వాడి మాట తియ్య‌గా ఉంటుంది. మ‌న‌సు మాత్రం మ‌లిన‌మే.. వాడి పిలుపు సుతిమెత్త‌గా వినిపిస్తుంది. క‌ళ్లు మాత్రం కామంతో మాటువేసి ఉంటాయి. వాడి పొగ‌డ్త‌ల మాటున‌  పాడుబుద్ధి బుస‌లుకొడుతూ ఉంటుంది. ఆరేడేళ్ల‌ ఆడ‌పిల్ల‌లే టార్గెట్‌గా వాడి అడుగులు ప‌డుతుంటాయి. కంట‌ప‌డితే చాలు.. చాటుగా కాటువేసేందుకు రెడీగా ఉంటాడు. ఇలా కొద్దికాలంగా సాగుతున్న వాడి ఆట‌ల‌కు పోలీసులు ఎట్ట‌కేల‌కు చెక్ పెట్టారు. చేసిన త‌ప్పును మ‌ళ్లీ చేయ‌బోయి స్థానికుల‌కు అడ్డంగా దొరికిపోయాడు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని గూడూరు మండ‌లంలో ఓ గ్రామానికి చెందిన యువ‌కుడి పాడుబుద్ధి క‌థ‌నం ఇది. చిన్నారి ఆడ‌పిల్ల‌లే ల‌క్ష్యంగా వాడు సాగిస్తున్న త‌ప్పుడు ప‌నుల‌కు ఎట్ట‌కేల‌కు చెక్ ప‌డింది. ఆ వివ‌రాలేమిటో చూద్దాం.. గ్రామంలో స‌ద‌రు యువ‌కుడి ఇంటి స‌మీపంలో మ‌రో ఇల్లు ఉంటుంది. ఆ ఇంటిలో రెండో త‌ర‌గ‌తి చ‌దువుతున్న బాలిక ఉంటుంది. 

 

కొద్దిరోజుల క్రితం ఆ యువ‌కుడు ఆ బాలిక‌ను ఇంటికి పిలిపించుకుని ముద్దుముద్దుగా మాట్లాడుతూ.. అశ్లీల చిత్రాలు, బొమ్మ‌ల‌ను చూపించాడు. ఈ విష‌యాన్ని చుట్టుప‌క్క‌ల‌వాళ్లు గ‌మ‌నించ‌డంతో ఊరి నుంచి పారిపోయాడు. ఆ త‌ర్వాత ఓ ప‌దిరోజుల‌కు అంద‌రూ మ‌రిచిపోయి ఉంటారులే.. అని  మ‌ళ్లీ గ్రామానికి వ‌చ్చాడు. అదేరోజు సాయంత్రం మ‌ళ్లీ బాలిక‌ను ఇంటికి పిలిపించుకున్నాడు. ఆ చిన్నారితో యువ‌కుడు ఉండ‌డాన్ని గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే ప‌ట్టుకుని చిత‌క‌బాదారు. ఆ వెంట‌నే పోలీసుల‌కు స‌మాచారం ఇవ్వ‌డంతో అరెస్టు చేసి తీసుకెళ్లారు. అయితే.. ఇలా మ‌రికొంద‌రు ఆడ‌పిల్ల‌ల‌తో కూడా ఇలాగే ప్ర‌వ‌ర్తించాడ‌ని స్థానికులు చ‌ర్చించుకుంటున్నారు. ఎక్క‌డ త‌మ ప‌రువు పోతుందేమోన‌ని వారు బ‌య‌ట‌కు చెప్ప‌లేక‌పోతున్నార‌ని అంటున్నారు. ఎట్ట‌కేల‌కు ఇలాంటి దుర్మార్గుడు జైలుపాలు కావాల్సిందేన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: