జీవితం ఓ ఆట.. ఆడి చూడు అంటాడో రచయిత. నిజమే ఆట అన్నాక గెలుపూ ఓటమీ రెండూ ఉంటాయి. రెండింటినీ సమంగా చూడగల జీవన సామర్థ్యం చాలా అవసరం. మామూలు సమయాల్లో కంటే ఇప్పుడు కరోనా వంటి కష్టకాలాల్లో ఈ సామర్థ్యం ఇంకాస్త ఎక్కువ అవసరం.

 

 

కొందరు తమ జీవితంలో ఏమాత్రం మార్పు వచ్చినా తట్టుకోలేరు. తమకు అందుతున్న సౌకర్యాల్లో ఏ ఒక్కటి తగ్గినా తెగ మథనపడిపోతారు. అనుకూలంగా సాగిపోతున్న జీవనంలో చిన్న ప్రతికూలత వచ్చినా తట్టుకోలేరు. ఇలాంటి వారికి జీవితం సాఫీగా సాగినప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ రాదు. కానీ కాస్త తేడా కొడితే అగాధంలోకి జారిపోతారు.

 

 

డిప్రెషన్ లోకి వెళ్లిపోతారు. అందుకే.. అనివార్యాలను ఆహ్వానించాలి. ప్రతికూలతలను ఊహించాలి. కష్టాలకు సిద్ధంగా ఉండాలి. వాటికి మనల్ని మనం అనుకూలపరచుకోవడం అభ్యాసం చేసుకోకపోతే అభ్యుదయం వైపు సాగిపోలేం. సంఘర్షణ, సంక్షోభం జాడలేని జీవితాలే కనిపించవు.

 

 

వాస్తవానికి అవి మన పురోగమనానికి దీప స్తంభాల్లాంటివి. అవి మనలో నిబిడీకృతమైన శక్తుల్ని మేల్కొలుపుతాయి. అంతర్ముఖులమై ఆలోచిస్తే సుఖదుఃఖాల వెలుగునీడల క్రీడే జీవితం. వెలుగును మాత్రమే వాంఛిస్తూ, చీకటిని నిరాకరిస్తే ఆటను ఎలా సంపూర్ణంగా ఆస్వాదించినవారమవుతాం.. కీర్తికిరీటాలకు అర్హులం కాలేం కదా..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: