రోజూ ఎంతో మందిని చూస్తుంటాం.. రోజూ ఎందరితోనూ కలసి పని చేస్తుంటాం. కానీ కొందరి వల్ల మనం అనుకోకుండా నష్టపోతాం.. కనీసం అలా నష్టపోతున్నామని మనం గుర్తించేలోపే జరిగే నష్టం జరిగి తీరుతుంది. అలాంటి వారు ఎవరో తెలుసా.. మన చుట్టూ ఉన్న వ్యతిరేక దృక్పథం ఉన్నవాళ్లు.

 

 

మనం పని చేసే వాతావరణం లో అనేక మనస్తత్వాలున్న అనేకమంది పనిచేస్తుంటారు. పైకి అంతా నవ్వుతూ ఆనందంగా కనబడుతుంటారు. కానీ అంతర్గతంగా రకరకాలుగా ఉంటారు.అందులో సానుకూల దృక్పథం ఉన్నవారితో కలిసి పనిచేయడం ఎంత ఆనందమో వ్యతిరేక దృక్పథం ఉన్న వాళ్ళతో సర్దుకు పోవడం అంత సులభం కాదు.

 

 

వీరందరితో సర్దుకుపోతూ పనిచేయడం అంత సుళువైన విషయం కాదు. వీరిలో కొందరు ఫిర్యాది గాళ్ళుంటారు. అంటే.. వీరు తరుచూ అన్ని విషయాల పట్ల, అందరివ్యక్తులపై తీవ్ర అసంతృప్తితో ఉండి వారిలోని లోపాలను నిత్యం కనబడే ప్రతీవారికి ఫిర్యాదు చేస్తుంటారు. కోడిగుడ్డు పై వెంట్రుకులుతీసే పనిలో నిత్యం ఆనంద పడుతుంటారు.

 

 

ఇంకొందరు వెన్నుపోటుగాళ్ళు కూడా ఉంటారు. వీరు మన ఎదుట చాలా మంచిగా నటిస్తూ ఉంటారు కాని సమయం చూసి మన అంచనాకు ఏ మాత్రం అందకుండా దొంగదెబ్బ తీస్తారు. వీరి వినమ్రత, నక్క వినయాలు చూసి వీరిపై పూర్తిగా ఆధారపడ్డామా అడ్డంగా దొరికిపోతాం.

 

ఇలాంటి మనస్తత్వంతో ఉన్న వీరిని ఎలా సంస్కరించాలనే ఆలోచనలొద్దు. వీరినుండి మనం మనల్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచిస్తే సరిపోతుంది. ఎందుకంటే.. దారిలో ముళ్ళుంటే అవన్నీ ఏరుకొని కూర్చుంటామా, కాళ్ళకు మంచి చెప్పులు వేసుకుంటే సరిపోలా ?.. వాళ్లను సంస్కరించాలంటే.. మన జీవిత కాలం సరిపోదు సుమా.

మరింత సమాచారం తెలుసుకోండి: