విజయం.. ఇది ఇచ్చే ఆనందం అంతా ఇంతా కాదు.. అందుకే జీవితంలో విజయం సాధించాలనే అంతా తపిస్తుంటారు. కానీ.. అంతా కోరుకున్నా అది అందరికీ అందేది కాదు. మరి ఈ విజయం సాధించాలంటే ఏం కావాలి.. గెలుపు ఎప్పుడూ మనవైపే ఉండాలంటే ఏం చేయాలి.. ఏం చేస్తే విజయ లక్ష్మి మనల్ని వరిస్తుంది.. ఈ విషయాలు ఓసారి పరిశీలిద్దాం.


ఒక విత్తనం మొక్కగా మెలకెత్తాలంటే ఏం కావాలి.. చక్కటి సారవంతమైన నేల, తగినంత నీరు.. గాలి.. ఇన్ని సానుకూల అంశాలు ఉంటే తప్ప.. ఒక విత్తనం మొక్క కాదు.. ఈ విషయం ఎవరైనా అంగీకరిస్తారు. కానీ.. మీరు రాతి నేలలోనూ మొక్కలు చూసే ఉంటారు. ఇక కొన్నిచోట్ల రావి చెట్లు రాతి గోడల్లో నుంచి మొలుస్తాయి. మరి వాటికి ఏం సానుకూల అంశాలు ఉన్నాయి.. నేల లేదు. నీరు లేదు.. మరి ఎలా ఎదిగాయి.. ఎలా రావి విత్తనం మానుగా మారింది. రాతి నేలమీద పడ్డా, తడి తగిలేదాకా లోతుగా వేళ్లను విస్తరిస్తూ కష్టమ్మీద మొక్కయి మానై చివరకు కొండ చెట్టయి సగర్వంగా చిగుళ్లు మెలేస్తుంది విత్తనం. 


ఇది ఎలా సాధ్యం.. అందుకు ఒకటే కారణం.. సానుకూల దృక్పథం. మరో దృశ్యం చూద్దాం.. 
పులి లాంటి క్రూరజంతువు వేగంగా వెంటాడుతోంది. ఓ జింక పిల్ల ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగెడుతోంది. పులి శక్తి ముందు జింక పిల్ల ఎంత.. కానీ కొన్నిసార్లైనా జింక గెలుస్తుంది.. ఇది ఎలా సాధ్యం.. ఎందుకంటే బతుకు మీద తీపి. ప్రాణాలపై ఆశ.. అవును అంటే... మనిషిని గెలిపించేది ఆశే. 


ఆశావాదమే.. గెలిచి తీరాలన్న కోరిక గుండెల్లో నిరంతరం కణకణలాడుతూ ఉండేలా చేస్తుంది. సానుకూల ధోరణి, ఆశావహ దృక్పథం మనిషిని విజయ తీరాలకు తప్పక చేరుస్తాయి. జీవం తొణికిసలాడుతూ నిండు నూరేళ్లు చూద్దాం... నూరేళ్లు విందాం... నూరేళ్లూ మాట్లాడుతూ ఉందాం అంటుంది మన వేదం ప్రోత్సహించింది. సర్వస్వాన్నీ కోల్పోయినా, రేపనేది ఒకటి మిగిలేఉందన్న ఆశతో మనిషి జీవించాలి. ఇదే విజయం రహస్యం.

మరింత సమాచారం తెలుసుకోండి: