నాన్నేం చేస్తాడు..

నువ్వు రాల్చిన రెండు కన్నీటిబొట్లను

దోసిట్లోకొంపుకుని..

అనేక ఆనందభాష్పాలుగా మార్చిస్తాడు

 

 

నీ దిగులు మబ్బుల్ని

వానచినుకులుగా చెదరగొట్టి

నీ ఆకాశం నిండా..

ఇంద్ర ధనుస్సుల్ని పూయిస్తాడు

 

 

నువ్వు నడిచే దారిలో..

ముళ్ల పొదలను తొలగించి

నీ పాదాల కింద మెత్తని..

ప్రేమపూలను పరుస్తాడు

 

 

తన గుండెలమీద నీ తన్నులు కాస్తూ...

మెడలమీద నిన్నూరేగిస్తూ..

నీ తప్పటడుగుల్ని...

తప్పుటడుగుల్నీ తలకెత్తుకుని..

తనకంటే‌ ఎత్తులో నిన్ను

నిలబెట్టే విశ్వప్రయత్నం చేస్తాడు..

 

 

తన కన్నీళ్లను దాచిపెట్టి

నీ‌ బతుకుపంటకు..

మటకాలువలుగా మళ్లిస్తాడు

అడుగడుగునా నీకో రక్షణ కవచాన్ని తొడిగి

ఈ లోకంతో తలపడే

ఎన్నో యుద్ధనైపుణ్యాల్ని నేర్పిస్తాడు..

 

 

 

ఏ నాన్నైనా ఏం చేస్తాడు

అమ్మతో కలిసి జీవితాంతం

తన‌ కుటుంబ బాగోగుల్ని తలపోస్తూ

బతుకంతా శ్రమల పొద్దయి ప్రకాశిస్తూ

పిల్లల్ని ఈ జాతి రత్నాలుగా తీర్చిదిద్ది

చివరకు వాలిన పొద్దయి నిష్క్రమిస్తాడు !

 

మరింత సమాచారం తెలుసుకోండి: