అరకు లోయకు వెళ్లే దారిలో అనంతగిరి మండలంలో ఎత్తైన కొండవాలులో కొండల మధ్య ఉన్న భూమి వృధాగా పడి ఉండేది. దీనినిలా వదిలేస్తే లాభం లేదని భావించిన 26 మంది ఆదివాసీ రైతులు సాగు చేసి పంటలు పండించాలని డిసైడ్‌ అయ్యారు.

 వారికున్న 22 ఎకరాల భూమిని అభివృద్ధి చేయడానికి ఉపాధి హామీ పథకంలో పనులు కావాలని విశాఖ జిల్లా డ్వామా అధికారులను వెంట పడి చివరికి సాధించారు. వారి అభ్యర్దనను గ్రామ సభలో తీర్మానం చేసి జిల్లా అధికారులకు పంపారు. నరేగాలో వారికి పనులు మంజూరవగా , 215 మంది కూలీలు ఉపాధి పనులు చేసి ఆ భూమిని టెర్రసింగ్‌ చేశారు.

''ఉపాధి హామీ పథకంలో పిచ్చి చెట్లతో ఎగుడు దిగుడుగా ఉన్న గుట్టలను తవ్వి సాగుకు యోగ్యంగా చేసుకున్నాం. మెట్లసాగు చేస్తున్నాం. ఒకప్పుడు ఎందుకూ పనికి రాకుండా ఉన్న ఈ నేలలో రెండు పంటలు వరి పండిస్తున్నాం. కొండల మీద నుండి ప్రవహించే ఊటనీరే మా పంటలకు సరిపోతుంది కొన్ని చోట్ల కూరగాయలు కూడా పండించి అదనపు ఆదాయం పొందుతున్నాం.

కుటుంబాలతో సంతోషంగా ఉన్నాం. '' అని ములయగుడ గ్రామస్థులు కిల్లో అప్పన్న, తెమ్మలి వీరమ్మ, గుమ్మల లక్ష్మన్న అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: