పోరాటంలో ఎవరు గెలిచినా, గెలిపించేది మాత్రం వ్యూహమే. అవును. అలాంటి ఓ వ్యూహం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి తిరుగులేని విజ‌యాన్ని అందించింది. అసెంబ్లీ, లోక్‌స‌భ రెండింటిలోనూ మ‌హా విజ‌యం వెంట‌న‌డిచింది. జ‌గ‌న్ జైత్ర‌యాత్ర వెనుక ఉన్న ఆ వ్యూహం పేరు ప్ర‌శాంత్ కిషోర్. త‌న రాజకీయ వ్యూహ చాతుర్యంతో జగన్‌ను జనసమ్మోహితుడిగా మార్చేశాడు ప్ర‌శాంత్ కిషోర్. గ‌తంలోనూ ప‌లు పార్టీల‌కు ఆయ‌న చేసిన వ్యూహాలు తిరుగులేని విజ‌యాన్ని అందించాయి. ఒక సామాన్యుడు కింగ్ మేక‌ర్‌గా మారి దేశంలోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాడు. 

Image result for prashant kishor jagan

బీహార్‌లోని బక్సర్‌ ప్రాంతంలో సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వ్య‌క్తి ప్రశాంత్‌కిషోర్‌. ఆయ‌న తొలిసారి 2011లో రాజకీయరంగంలోకి అడుగు పెట్టాడు. అప్పుడు ప్రజారోగ్య విభాగంలో శిక్షణ పొంది ఎనిమిదేళ్లపాటు ఐక్యరాజ్య సమితిలో పనిచేశాడు. 2013లో సిటిజన్స్‌ ఫర్‌ అకౌంటబుల్‌ గవర్నెన్స్‌ (కాగ్‌) అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటుచేశారు. 2015లో దాన్ని ఇండియన్‌ పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ (ఐ-పాక్‌)గా మార్చారు. రాజ‌కీయాల్లో ఆధునిక చాణ‌క్యుడిగా పేరు తెచ్చుకున్నాడు.
ఇప్పటివరకు ప్ర‌శాంత్ కిషోర్ ఆరు ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థులకు వ్యూహాలు, ప్రచారం చేశారు. అంతకుముందు 2012లో జరిగిన గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నరేంద్రమోడీని మూడోసారి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఏడాది ముందుగానే కార్యరంగంలో దిగి వ్యూహరచన చేసి మోడీకి స‌క్సెస్ అందించాడు. 2014లోనూ మోడీ ప్రధాని కావడంలో పీకే స‌పోర్ట్ ఎంతో ఉంది. ఆయనపై రాజకీయ పార్టీలకు గురి కుదరడంతో 2015లోనే వైఎస్ జ‌గ‌న్ టీమ్ సంప్రదించింది. అవి కొలిక్కి వచ్చి మరుసటి ఏడాది కొంత సమాచార సేకరణ చేశారు. మిషన్‌ 2019 లక్ష్యంతో ప్ర‌శాంత్ కిషోర్ ఆండ్ టీమ్ రెండేళ్ల క్రిత‌మే పూర్తి స్థాయిలో రంగంలోకి దిగింది. 

Image result for prashant kishor jagan

రంగంలోకి దిగితే విజ‌య‌మే!

ప్ర‌శాంత్ కిషోర్ గ‌తంలో చేసిన స‌ర్వీస్ అన్ని పార్టీల‌కు క‌లిసి వ‌చ్చింద‌నే చెప్పాలి. బీజేపీ, కాంగ్రెస్‌, జేడీయూ పార్టీల విజయాల్లో పీకే వ్యూహం ఉంది. 2012 లో గుజరాత్‌ ఎన్నికల్లో న‌రేంద్ర మోడీ 3వ సారి ముఖ్య‌మంత్రి అయ్యేందుకు పీకే త‌న‌ వ్యూహాలు అమ‌లు ప‌రిచారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-న‌రేంద్ర మోడీ కోసం పనిచేశారు. ఇక 2015 బీహార్‌ ఎన్నికల్లో నితీష్ కుమార్‌కు వెన్నుదన్నుగా నిలిచి ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టారు. 2017 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కోసం పని చేశారు. ఇక‌ 2017 ఉత్తర ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా చేసినా.. ఆ పార్టీ విజ‌యంసాధించలేక‌పోయింది.


వైసీపీకి ప‌దునైన వ్యూహం
రెండేళ్లుగా వైసీపీ వేసిన ప్రతి అడుగులోనూ ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం ఉంది. నిజానికి పీకేను పరిచయం చేసిన సందర్భంలోనే పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడాలని జగన్‌ కోరినా.. ఆయన సున్నితంగా తిరస్కరిస్తూ తర్వాత మాట్లాడతానని ప్రకటించారు. ఆ తర్వాత కూడా పార్టీ వేదికలపై ఎప్పుడూ మాట్లాడకపోయినా తెర వెనుక పీకే వ్యూహాలు విజయనినాదమై ప్రతిధ్వనించాయి. ‘రావాలి జగన్‌ కావాలి జగన్‌’ పాట రూపకల్పనలో కీలకంగా వ్యవహరించి విస్తృత ప్రచారం చేశారు. యూట్యూబ్‌లో ఈ పాటకు 2కోట్లకుపైగా వ్యూస్‌ వచ్చాయంటే ప‌బ్లిసిటీ ఏ రేంజ్‌లో చేశారో అర్థ‌మ‌వుతుంది.  

Image result for prashant kishor jagan

గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేసిన వారికి ‘జగన్‌ అన్న పిలుపు’ పేరిట ఉత్తరాలు పంపించి జగన్‌తో భేటీలు ఏర్పాటు చేయించారు. వీరు క్షేత్రస్థాయిలో వైసీపీకి ఓటేసేలా ప్రభావితం చేయగలిగారు. నిన్ను నమ్మం బాబు.. బైబై బాబు అంటూ చంద్రబాబుపై కార్యక్రమాలు చేయించి సోష‌ల్ మీడియాల్లో ప్రచారం చేయించారు. ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహించి ఏ అభ్యర్థి అయితే సరిపోతారనేది నిర్ణయించి పార్టీ అధ్యక్షుడు జగన్‌కు అందించాడు. అభ్యర్థులను మార్చాల్సిన చోట నిర్మొహమాటంగా చెప్పేశాడు పీకే. అభ్యర్థుల ఎంపిక, ఖరారులోనూ కీలకంగా వ్యవహరించాడు.
ఏపీలో పోలింగ్ ముగిసిన వెంట‌నే కాబోయే సీఎం మీరే అంటూ జ‌గ‌న్‌కు అంత కాన్ఫిడెన్స్‌గా చెప్పిన త‌నేంటో నిరూపించుకున్నాడు ప్ర‌శాంత్‌కిషోర్. ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌శాంత్ కిషోర్ దేశ‌వ్యాప్తంగా ఆరు పార్టీల‌కు ప‌ని చేస్తే, 5 ఘ‌న విజ‌యం సాధించాయి. త‌న ఘ‌న విజ‌యం వెనుక నిలిచిన పీకే ఆండ్ టీమ్‌కు జ‌గ‌న్ ధ‌న్య‌వాదాలు తెలిపారు. వైసీపీ ఘ‌న విజ‌యంతో ప్ర‌శాంత్ కిషోర్ పేరు మరోసారి దేశ‌వ్యాప్తంగా మారుమోగిపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: