కొన్నాళ్లు ఉద్యోగం చేశాక ఆ పనులంటే విసుగనిపించడం సర్వసాధారణం. అలాగని అప్పటికప్పుడు ఉద్యోగం మానేసి కొత్తదాంట్లో చేరిపోలేం కదా.. అందుకే మీ ఉద్యోగంలో, పనిచేసే చోటా చిన్నచిన్న మార్పులు చేసుకుంటూ ఆనందం వెతుక్కునే ప్రయత్నం చేయండి. దానికీ కొన్ని మార్గాలున్నాయి. సమావేశంలో కావచ్చు, మీ సంస్థకు సంబంధించిన మరో సదస్సు కావచ్చు. మీలాంటి ఉద్యోగుల్ని మీరు కలుస్తూ ఉంటారు కదా! వారితో సత్సంబంధాలు పెంచుకోండి.

 

తరచూ మాట్లాడుకునేలా చూసుకోండి. దానివల్ల స్నేహం పెరగడమే కాదు, మీ రంగంలో వస్తున్న మార్పులూ, అందుబాటులో ఉన్న కొత్త అవకాశాలూ, మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవాల్సిన అంశాలవంటివెన్నో తెలుస్తాయి.దీనివల్ల నెట్‌వర్క్‌ పెరుగుతుంది. మీ వ్యక్తిగత నైపుణ్యాలు పెంచుకోవాలంటే మొదట చేయాల్సిన పని ప్రతిరోజూ పొద్దున్నే ఓ పదిహేను నిమిషాలు సృజనాత్మకంగా వచ్చే ఆలోచనల్ని రాసుకోవాలని అంటారు నిపుణులు. దానివల్ల కొత్త ఆలోచనలు పెరుగుతాయి. ఉత్పాదకతపైనా దృష్టిపెట్టొచ్చు. అలాగే మీకు ఆసక్తిగా అనిపించిన అంశంపై ఓ బ్లాగ్‌నీ ప్రారంభించి, క్రమంగా దాన్ని విస్తరించొచ్చు.

 

నలుగురిలో మాట్లాడే కళనూ పెంచుకోండి. ఒకవేశ అవకాశం వస్తే ఎలా మాట్లాడాలనేదీ సాధన చేసుకోండి. స్మార్ట్‌ వర్క్‌ చేసేందుకు కొత్తగా ఆలోచించడం లాంటివన్నీ నైపుణ్యాలు పెంచేవే. పై రెండూ కాకుండా ఇంకా ఏదయినా కొత్తగా చేయాలని అనుకుంటే.. మీరు రోజూ చేసే పనితోపాటూ అదనంగా కొత్తగా బాధ్యతను తీసుకోండి. అది మీకు సవాలుగా అనిపిస్తుంది. కొత్త విషయాలూ తెలుసుకునే అవకాశమూ కలుగుతుంది. సహోద్యోగులకు మీ వంతుగా సాయం చేయడం, మీరు చేసే పనులకు డెడ్‌లైన్లు పెట్టుకోవడం. లాంటివన్నీ మీకు ఉపయోగపడేవే.


మరింత సమాచారం తెలుసుకోండి: