ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్నవారిలో వాట్సప్ వాడని వారు చాలా అరుదు. అంతగా ఈ యాప్ వినియోగదారుల జీవితాల్లో ఓ భాగం అయ్యింది. అయితే వాట్సప్ అందరూ ఒకలా వాడరు. వాడకంలో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైలు.. మరి ఆ స్టైల్ ఏంటో.. మీరు ఈ కింది వారిలో ఏ కేటగిరీ కిందకు వస్తారో ఓసారి చెక్ చేసుకోండి. చేసుకుని నవ్వుకోండి. 




మెరుపు వీరులు
ఎవరన్నా మెసేజ్‌ పెట్టడం ఆలస్యం. ఒక మెరుపు మెరిసినట్టు తళుక్కున, చటుక్కున స్పందిస్తారు.

నిశాచరులు
గ్రూపుల్లో పగలు జరిగే సంభాషణల్లో పాలు పంచుకోరు. సరిగ్గా కళ్లు మూతలు పడుతున్నాయ్ అనగా, రాత్రి ఇంక వైఫై ఆపేసి కునుకుతీద్దాం అనుకునే సమయానికి ఉరుములు పడ్డట్టు ఒక్కసారిగా ఫోన్ కంపిస్తుంది. ఇక పలకరింపులు, పలవరింతలు, పగటి సంభాషణకు సమాధానాలు, జోకులు, ఎకసెకాలు షురూ చేస్తారు. 

గూఢచారి 116
వీరు మనలోనే ఉంటారు. మనతోనే ఉంటారు. ఎవరేం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి లైనేంటి? ఎవరి విధానం ఏంటి? అన్నీ గూఢచారుల్లా గమనిస్తూంటారు. దేనికి స్పందించరు. వాళ్లు ఉన్నట్టు కూడా ఎవరికీ తెలీదు. నేత్రానందమే ఈళ్లది.

పిండుకున్నోడికి...
గ్రూపులో ఎవరన్నా ఓ మెసేజ్‌ పెట్టగానే లటుక్కున దాన్ని మింగేస్తారు. పెట్టడం పెద్దల నుంచీ లేదు..పుచ్చుకోవడం పూర్వం నుంచి ఉందనే బాపతు వీళ్లు. వాట్సప్‌ గ్రూపులో ఓ మంచి మెసేజ్‌, ఫోటో పడటం ఆలస్యం వెంటనే ఫేస్‌బుక్‌లోకి తోసేస్తారు. కనీసం పంపినోడి పేరు  పొరపాటున కూడా ఉచ్ఛరించరు. అలా అని వాళ్లేమన్నా పోస్టులు పెడతారా అంటే అదీ ఉండదు. 

మంచి దొంగ
ఈ బాపతు వాళ్లు పాపం అమాయకులు. చోరకళలో వీరికి నైపుణ్యం తక్కువ. ఓ గ్రూపులో కొట్టేసిన మెసేజ్‌ని తిరిగి వాళ్లకే పెట్టి దొరికిపోతూంటారు. కొందరి అఘాయిత్యం పాడుగాను వాళ్లయితే కింద వారి పేరు కూడా క్లయిమ్‌ చేసుకుంటారు. పరీక్షలో పక్కనోడి పేపర్‌ను యథాతధంగా వాడి పేరు, ఇంటిపేరుతో సహా ఎక్కించేసుకుని దొరికిపోతూంటారు.

వ్యాస భగవానులు
వీరు పంపారంటే మెసేజ్‌లు దానికి ఆది అంతం ఉండదు. ఓ జాతీయ రహదారిలాగా మనం ఆ మెసేజ్‌ను పైనుంచి కిందకి స్క్రోల్‌ చేస్తూనే ఉండాలి తప్ప దాని ఎండ్‌ ఎక్కడో ఓ పట్టాన తెలీదు. అంతంత భారీ తెలుగు, ఆంగ్ల, హిందీ వ్యాసాలను తలపించే మెసేజ్‌లు పెడతారు. అంత లాంగ్‌ లాంగెగో మెసేజ్‌లు చదివేంత తీరిక ఎవడికీ ఉండదని, పైగా ఇతర మెసేజ్‌లు చూడటానికి వీటిని అడ్డంకిగా భావించి వెంటనే చాలామంది డిలీట్ చేస్తారని గ్రహించరు. 

మీడియా మొఘల్స్‌
ఈళ్లయితే ఓన్లీ ఫోటోలు, వీడియోలు మాత్రమే పంపుతారు. మామూలు మెసేజ్‌లు పెట్టరు. సంభాషణల్లోకి రారు. సాలార్‌జంగ్‌ మ్యూజియంలో గడియారంలో నుంచి మనిషి వచ్చి గంట కొట్టినట్టు ఏదో టైములో ఒకసారి పిడుగుల్లాగా కొన్ని ఫోటోలు, వీడియోలు కుమ్మరించేసి వెళ్లిపోతారు. మళ్లీ జాబు, జవాబు ఉండదు. వాళ్లా వీడియోలు చూశారా? దానిలో ఏముంది అనేది మిగతా వాళ్లందరికీ శేష ప్రశ్నలే.



మరింత సమాచారం తెలుసుకోండి: