సంపాదన ఎంత ఉంటే అంత గొప్ప పేరు ప్రతిష్ఠలు వస్తాయి. అయితే సంపాదనలో కొంత భాగాన్ని సామాజిక సేవకు కేటాయించే గొప్పవారు కూడా ఉన్నారు. నార్వేకి చెందిన షెల్లింగి రక్కె పరోక్షంగా మానవాళికి సాయం చేసే  గొప్ప కార్యానికి నాంది పలికారు. చేపలు పట్టే జాలరిగా జీవితం ప్రారంభించిన షెల్లింగ్ రక్కె అనేక వ్యాపారాలు చేస్తూ కోట్లకు పడగలెత్తారు. ఓడలు.. ఓడరేవులకు సంబంధించిన వ్యాపారాల్లో ఆయన వాటానే ఎక్కువగా ఉంటుంది. సముద్రంతో పెనవేసుకుపోయిన ఆయన సముద్రాన్ని కాలుష్యం కమ్మేయడం ఆవేదనకు గురి చేసింది.


పరిశ్రమలు ఉండే నేలపై కాలుష్యం అంటే సాధారణమే అనాల్సిందేనని..అయితే నడి సముద్రంలో కూడా ప్లాస్లిక్ వ్యర్థాలు ఉన్నాయన్న చేదునిజాన్ని విన్నారు. దీంతో సముద్రాన్ని కాలుష్యం చేస్తూ, చేపల ప్రాణానికి, పరోక్షంగా మానవాళికి నష్టంగా పరిణమించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించే మహత్తరకార్యానికి నడుం బిగించారు.

 

 నార్వేకి చెందిన వరల్డ్‌ వైల్డ్‌ లైఫ్‌ ఫండ్‌ అనే సంస్థతో కలిసి సముద్రాన్ని శుభ్రపరిచేందుకు భారీ ఓడను (రీసెర్చ్‌ ఎక్సిపెడిషన్‌ వెసెల్‌) నిర్మించనున్నాడు. ఇందుకోసం ఆయన 17,000 కోట్ల రూపాయలు ఖర్చుచేయనున్నారు. ఈ భారీ షిప్ లో 30 మంది సిబ్బందితో పాటు 60 మంది పరిశోధకులు, శాస్త్రవేత్తలు ప్రయాణించనున్నారు. ఈ ఓడ సముద్రంలో కలిసే వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తుంది. రోజుకి 5 టన్నుల ప్టాస్టిక్‌ వ్యర్థాలను తొలగించి రిసైకిల్‌ చేస్తుందని ఆయన తెలిపారు. ఈ మహత్కార్యంలో భాగస్వాములయ్యేందుకు ముందుకు రావాలని ఆయన పరిశోధకులు, శాస్త్రవేత్తల్ని కోరుతున్నారు. సముద్రంలో ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించేందుకు సరికొత్త సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేయాలని ఆయన ఔత్సాహికులకు పిలుపునిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: