ఎంతోమందికి విద్యా దానం చేసిన ఓ టీచర్ రిటైర్ అయిన తర్వాత భర్త, బిడ్డల నిరాదరణకు గురై బిచ్చగత్తెగా మారి పిచ్చిదానిలా వీధుల్లో తిరుగుతుంటే ఆమె వద్ద చదువుకున్న విద్యార్థులు బిడ్డలకంటే ప్రేమగా ఆమెను వెతుక్కుంటూ వచ్చారు. మా ఇంటికి రమ్మంటూ ప్రాధేయపడ్డారు. ఆర్థిక సహాయం చేస్తామంటూ అర్థించారు. అయినా ఆ టీచర్ వినలేదు. తన ఖర్మకు తనను ఇలాగే వదిలేయమని ప్రాధేయపడింది. ఆమె దగ్గర చదువుకుని ఉన్నత స్థాయికి పోయిన విద్యార్థులు బలవంతంగా తమ టీచర్ ను వృద్ధాశ్రమానికైనా తరలించాలని ప్రయత్నించి విఫలమయ్యారు.


కేరళలో ఒక టీచర్ కన్నీటి గాధ ఇది. వృద్ధాప్యంలో బిడ్డలు తల్లిదండ్రులను వదిలేసినా, ఫేస్ బుక్ లో తమ టీచర్ దుస్థితిని చూసిన విద్యార్థులు కన్నబిడ్డలకంటే ఎక్కువగా ప్రేమ చూపి తమ గురుభక్తిని నిరూపించుకున్నారు. కేరళలోని తంపనూరు రైల్వే స్టేషన్లో ఈనెల 5వతేదీన విద్య అనే ఓ యువతి చిరిగిన గుడ్డలు, తైల సంస్కారం లేని తలతో రైల్వే స్టేషన్ ముందు బిచ్చమెత్తుకుంటున్న ఓ వృద్ధురాలిని చూసింది. ఆకలిగా ఉన్నావా అని అడిగితే లేదంటూ ఆ వృద్ధురాలు సమాధానం చెప్పింది. విద్య ఆమెకు ఆకలి లేదన్నా ఆమె పరిస్థితి చూసి టిఫిన్ తెచ్చి ఇచ్చింది. తర్వాత ఆమెతో మాటలు కలిపింది. ఆ బిచ్చగత్తె ఇంగ్లిష్ లో అనర్గళంగా మాట్లాడే విధానం చూసి తను పోవాల్సిన రైలు తప్పిపోయినా ఆమె ఎవరో కనుక్కుంది.

ఆమెను మాలాపురం లో ప్రతిష్టాత్మక స్కూల్ లో మ్యాథ్స్ టీచర్ గా పనిచేసిన వల్స గా గుర్తించింది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది. వెంటనే విద్యార్థులు తమ టీచర్ ను వెతుక్కుంటూ బయలుదేరారు. ఊరంతా తిరిగి ఆమెను గుర్తించారు. తమతో రమ్మని ప్రాథేయపడ్డారు. భర్త, బిడ్డలు తమను వదిలేశారని వారొస్తే తను వారితోనే ఉంటానని చెప్పారు. ఆర్థిక సాయం చేస్తానన్నా ఒప్పుకోలేదు. భర్త, బిడ్డలు తప్పు తెలుసుకుని తన దగ్గరకు వచ్చే వరకు తాను ఇలాగే ఉంటానని, వృత్తి ధర్మంగా చదువు చెప్పానని, కట్టుకున్న భర్త, కడుపున పుట్టిన బిడ్డలే తనను కాదన్నప్పుడు తానెవరికీ భారం కాదలచుకోలేదని తెగేసి చెప్పింది.విద్యార్థులు పోలీస్ స్టేషన్ కి వెళ్లారు.

తమ టీచర్ ని ఎలాగైనా ఒప్పించమని ప్రాథేయపడ్డారు. పోలీసులు ఆమెను ఒప్పించేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేదు. దీంతో విద్యార్థులే కలగజేసుకుని తమ టీచర్ భర్త, బిడ్డలకోసం వెదుకులాట ప్రారంభించారు. ఆమె సోదరిని మాత్రం కనుక్కోగలిగారు. అయినా తాను ఎవరితో పోనని, బిడ్డ, భర్తలతోనే ఉంటానని ఆ టీచర్ చెబుతోంది.

ఇప్పటికీ విద్యార్థులు ఆమెను అనుసరిస్తూనే ఉన్నారు. తమతో వచ్చేయమని ప్రాధేయపడుతూనే ఉన్నారు. ఒక టీచర్ దగ్గర చదువుకున్నందుకు ఆమెను గుర్తు పెట్టుకుని ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. అయితే ఆమె వారినుంచి ఎటువంటి సహాయం పొందడంలేదు. బిచ్చమెత్తుకునే జీవనం కొనసాగిస్తోంది. వీధుల్లోనే పడుకుంటోంది. అదీ ఆత్మగౌరవం అంటే, ఇదీ ఆత్మాభిమానం అంటే.


మరింత సమాచారం తెలుసుకోండి: