యువ‌త త‌ల‌చుకుంటే మ‌హాసామ్రాజ్యాన్ని నిర్మించ‌గ‌ల‌రు. కేవ‌లం కొన్ని నెలల్లోనే వేల కోట్లు సంపాదించ‌గ‌ల‌రు.. మ‌న దేశానికి చెందిన ముగ్గురు కుర్రాళ్లు మూడేళ్ల‌లో 3,333 కోట్లు సాధించారు. సోషల్‌నెట్‌వర్కింగ్ యాప్ స్టార్ట్ చేసి డిజిట‌ల్ యుగంలో దుమ్మురేపుతున్నారు. 
 
ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌లకు పోటీ ఇస్తున్న భారతీయ సోషల్‌నెట్‌వర్కింగ్‌ ఆప్‌ ‘షేర్‌చాట్‌’. ఇందులో ఇంగ్లీష్‌కాకుండా భారతీయ భాషల్లో మాత్రమే సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. ‘షేర్‌చాట్‌’ రూప‌క‌ర్త‌లు అంకుశ్‌ సచ్‌దేవ, ఫరీద్‌ అహ్సన్‌, భాను ప్రతాప్‌ సింగ్‌. 24, 25, 26.. వయసుగ‌ల‌వారు. వీరు రూపొందించిన  ‘షేర్‌చాట్‌’ వినియోగదారుల్లో అధిక శాతం వీరి వయసు వాళ్లూ లేదా అంతకంటే చిన్నవాళ్లే. ముగ్గురూ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకుంటూనే రకరకాల ఆప్‌లు డిజైన్‌ చేసేవాళ్లు. 

Image result for sharechat founders

నిజానికి వీళ్లు స్నేహితులు కాదు. కానీ టెక్‌ కంపెనీ ప్రారంభించాలన్న కోరిక వీరిని కలిపింది. ఆ తర్వాతే వారి మధ్య స్నేహబంధం కూడా ఏర్పడింది. షేర్‌చాట్‌ కేవలం భారతీయ భాషల్లో అందుబాటులో ఉండే సోషల్‌ నెట్‌వర్క్‌ ఆప్‌. ప్రస్తుతం హిందీ, తెలుగు, తమిళం సహా పద్నాలుగు భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. భారతీయుల కోసం భారతీయులు రూపొందించిన ఆప్‌ అన్నమాట. ఈ ఆప్‌లో ఫొటోలూ, వీడియోలతోపాటు నచ్చిన అంశాల్ని రాసి షేర్‌ చెయ్యొచ్చు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ లాంటి ఇతర సోషల్‌ నెట్‌వర్కింగ్‌ ఆప్‌లలోకి ఇక్కడి సమాచారాన్ని షేర్‌ చేయొచ్చు. అన్నీ ట్రెండింగ్‌ టాపిక్సే ఉంటాయి. ఇవి ప్రాంతాల్నిబట్టీ మారుతాయి. శుభాకాంక్షలూ, జోకులూ, స్ఫూర్తినిచ్చే రాత‌లు, మాట‌లు, రాశిఫలాలూ, వీడియోలూ, తాజా వార్తాలు... ఇలా ఎన్నో ఉంటాయి. వీటికితోడు సినిమా, క్రికెట్‌, విద్య.. ఇలా కొన్ని అంశాల్ని ఎంపికచేసుకుంటే వాటికి సంబంధించిన అంశాలు హోమ్‌ పేజీలో ముందు కనిపిస్తాయి. వాటికి లైకులూ, కామెంట్లూ పెట్టొచ్చు.

 Related image
ఆలోచ‌న‌కు అంకురార్ప‌ణ‌..
2012 నుంచీ రకరకాల యాప్‌లు రూపొందించేవారు ఈ ముగ్గురు మిత్రులు. 17 ప్రాజెక్టులు చేపడితే అందులో 14 ఫెయిల్‌ అయ్యాయి. ఓ రెండు ప్రాజెక్టులు కాస్త ముందుకు వెళ్లినా భవిష్యత్తులేదని తాముగా వద్దనుకున్నారు. తర్వాత ఓసారి బాలీవుడ్‌ అభిమానులూ, సచిన్‌ అభిమానులూ... తాము వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేశామనీ, ఎవరైనా వీటిలో చేరొచ్చనీ ఫేస్‌బుక్‌లో పిలుపునిస్తే వేలమంది తమ నంబర్లను అక్కడ షేర్‌ చేసుకోవడాన్ని చూశాడు సచ్‌దేవ్‌. ఈ విషయాల్ని స్నేహితులతో పంచుకున్నాడు. తర్వాత అక్కడ కనిపించిన నంబర్లతో వాట్సాప్‌ గ్రూపులు సృష్టించి బాలీవుడ్‌ వార్తల్నీ, సచిన్‌కి సంబంధించిన కబుర్లనీ వారిమధ్య పంచుకునేలా చేశారీ మిత్రులు. అప్పట్లో ఒక గ్రూప్‌ 100 మందికి మాత్రమే పరిమితమయ్యేది. అందుకని అలాంటివి పది గ్రూపులు సృష్టించారు. అందులోనే చర్చలూ, కామెంట్లూ, సమాచార సృష్టి జరిగేది. కొందరైతే ప్రశ్నలూ అడిగేవారు. అంతకంటే మరో ముఖ్యమైన విషయం... వాళ్లంతా తమ ప్రాంతీయ భాషలో, యాసలోనే సంభాషించేవారు. ఇంగ్లిష్‌ పెద్దగా రానివాళ్లు గూగుల్‌లో కాకుండా ఇక్కడే సమాచారం కోసం చూస్తున్నారని అర్థమైంది. అప్పుడే భారతీయ భాషల్లో చాట్‌ చేసుకునే ఆప్‌ తేవాలన్న ఆలోచన వచ్చింది. అలా షేర్‌చాట్‌ వైపు అడుగులువేశారు. 2015 అక్టోబరులో షేర్‌చాట్ యాప్‌ను ప్లేస్టోర్‌లో పెట్టారు.
 Image result for sharechat founders
ఇంటర్నెట్‌ డేటా ఛార్జీలు బాగా తగ్గి నెట్‌ వినియోగదారుల సంఖ్య పెరగడంతో దేశంలో ప్రాంతీయ భాషల్లో సేవలు అందించే వివిధ మీడియా, సోషల్‌ మీడియా సంస్థలకు ఆదరణ పెరిగింది. ఈ అవకాశాన్ని షేర్‌చాట్‌ బాగా ఉపయోగించుకుంటోంది. వీళ్లు అందిస్తున్న 14 భారతీయ భాషల్లో హిందీ, తెలుగు, తమిళ భాషలకు చెందిన వినియోగదారులు ఎక్కువగా ఉన్నారు. పండగ శుభాకాంక్షలూ, వివిధ సందర్భాల్లో అభిప్రాయాలూ, కవిత్వమూ... అన్నీ ప్రాంతీయ భాషల్లోనే వచ్చిచేరతాయి. ప‌లు దేశాల్లోని ప్రవాస భారతీయులు ఈ ఆప్‌ను ఉపయోగిస్తున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థలో ఉద్యోగుల సంఖ్య కేవలం 50 మాత్రమే. అయితేనేం ఇప్పటివరకూ అయిదుకోట్ల మందికిపైగా షేర్‌చాట్ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
 
2021 నాటికి దేశంలో ఇంగ్లిష్‌ వచ్చిన నెట్‌ వినియోగదారులకంటే హిందీ వచ్చినవాళ్లే ఎక్కువగా ఉంటారనీ, మూడో వంతు వినియోగదారులు ఇంగ్లిష్‌కాకుండా భారతీయ భాషలనే ఉపయోగిస్తారనీ మార్కెట్‌ వర్గాల అంచనా. అందుకే ఈ యాప్‌ విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూ వస్తోంది. గతేడాది డిసెంబరులో సంస్థ నిధుల సమీకరణ చేసినపుడు దాని అంచనా విలువ 431 కోట్లుగా లెక్క కట్టారు. తాజాగా ఆ విలువ 3,333 కోట్లని తేలింది. షేర్‌చాట్‌ త్వరలోనే బిలియన్‌ డాలర్ల కంపెనీగా మారనుంది. 
 
అంద‌రు వెళ్లే దారే కాకుండా భిన్నంగా స‌రికొత్త‌గా యూత్‌ను ఆక‌ర్షించే ఐడియా అమ‌లు చేస్తే ఈ డిజిట‌ల్ యుగంలో దుమ్మురేప‌డం ఖాయ‌మ‌ని నిరూపించిన ఈ ముగ్గురు కుర్రాళ్ల స‌క్సెస్ స్టోరీ ఈ త‌రం యువ‌త‌కు గొప్ప స్ఫూర్తి ఇస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: