ఒక మ‌హా విజ‌యం సాధించాలంటే ఏం చేయాలి? కోట్లాది మందిలో కొంద‌రు మాత్ర‌మే ఎందుకు స‌క్సెస్ అవుతారు? అస‌లు ఉండాల్సిన ల‌క్ష‌ణాలు ఏంటీ? అస‌లు స‌క్సెస్ సీక్రెట్ ఏంటీ? నిజానికి వ‌్యాపారం చేయాలంటే వినియోగ‌దారుల మ‌న‌సు గెలుచుకుంటే ప్ర‌పంచాన్ని గెలిచిన‌ట్టే అంటూ ఓ అద్భుత విజ‌య ర‌హ‌స్యం చెబుతోంది ప్రపంచంలోనే అతిపెద్ద ఫర్నిచర్‌ సంస్థ ఐకియా.

Related image

ఐకియా తన సామ్రాజ్యాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా వేగంగా విస్త‌రించుకుంటూ పోతోంది. ఇండియాలోనే తొలిసారి హైద‌రాబాద్‌లో త‌న ఫ‌ర్మిచ‌ర్ షోరూంను గ్రాండ్‌గా ఏర్పాటు చేసింది. హైద‌రాబాద్ టూరిస్టుల‌కు ఐకియా కూడా ఓ చూడదగ్గ ప్రదేశం అయిపోయింది. ఆ అంతర్జాతీయ దిగ్గజం భార‌తీయుల‌ మనసులు గెల్చుకోవడం వెనుక ఓ కథ ఉంది.
 
2012లో ఐకియా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకునే భాగంగా భార‌త‌దేశంపై దృష్టి పట్టింది. భారత్‌లో అడుగుపెట్టే బాధ్యతను జువెన్సియో మజ్దు అనే అధికారికి అప్పగించారు. జువెన్సియోకి మన దేశం మీద అవగాహన లేదు. పుట్టింది స్పెయిన్‌లో, ఉద్యోగం చేస్తోందేమో లండన్‌లో.. అలాంటి తనని ఓ విశాలమైన అపరిచిత ప్రాంతానికి పంపేసరికి కంగారు ప‌డ్డారాయ‌న‌. ఎప్పటికైనా భార‌త్‌లోని సంక్లిష్టతలనీ, వైవిధ్యాలనీ ఆకళింపు చేసుకోగలనా? అన్న సందేహంలో ప‌డిపోయాడు. రోజులు గడుస్తున్నా ఇక్కడి వాతావరణం మీద పట్టు చిక్కలేదు. అలాంటి సమయంలో ఓ రోజు ఢిల్లీలోని విదేశాంగ శాఖ కోసం పాస్‌పోర్టు ఫొటో అప్పగించాల్సి ఉంది. కానీ చేతిలో ఫొటో కూడా లేదు. దారిలో కనిపించిన ఒక ఫొటో స్టూడియోలోకి అడుగుపెట్టాడు. ఇక అక్కడి నుంచి కథ మారిపోయింది.
 Image result for ikea juvencio
అదో పాత స్టూడియో. దాని యజమాని ఓ ముసలాయన. ఐదే నిమిషాల్లో మీ ఫొటో తీస్తానని భరోసా ఇచ్చాడు ఆ పెద్దాయన. కానీ పావుగంట గడిచినా పని జరుగుతూనే ఉంది. తన పని ఆలస్యం అయిపోతోందన్న అసహనం జువెన్సియోలో మొదలైంది. దాన్ని కనిపెట్టిన ముసలాయన.. వేడి వేడి మసాలా టీ తాగుతారేంటి? అని చల్లగా అడిగాడు. ఆ ప్రతిపాదనను జువెన్సియో వెంటనే తుంచేశాడు. మరో 5 నిమిషాలు గడిచాయి. మొరాయిస్తున్న తన ప్రింటర్‌ను దారిలోకి తెస్తూ- ‘వేడి వేడి మసాలా టీ తాగుతారేంటి?’ అని మరోసారి జువెన్సియోని కదిపాడు పెద్దాయన. ‘వద్దు..’ అంటూ ఈసారి కాస్త కటువుగానే బదులిచ్చాడు జువెన్సియో. ‘5 నిమిషాల పాటు ప్రశాంతంగా టీ తాగలేని జీవితమూ ఓ జీవితమేనా’ అని ముసలాయన కాస్త పెద్దరికంతో మందలించాడు.
 Image result for ikea juvencio
అంతే.. జువెన్సియోని ఎవరో గ‌ట్టిగా చాచి కొట్టినట్లయ్యింది. తను ఎక్కడో దేన్నో విస్మరిస్తున్నానని తోచింది. ఐకియా అధికారి అనే ముసుగు నుంచి కాసేపు తప్పుకొని.. ఓ సాధారణ మనిషిగా భారతదేశాన్ని తెలుసుకోవాల్సిన అవసరం కనిపించింది. తను విదేశాంగ శాఖకు వెళ్లాల్సిన విషయం కూడా మర్చిపోయి మరో గంట సేపు... ఆ స్టూడియో పెద్దాయనతో టీ తాగుతూ కబుర్లలో మునిగిపోయాడు. అతనిలో సగటు భారతీయుడిని చూస్తూ, ఈ దేశం గురించి అతని మాటల్లోనే వినే ప్రయత్నం చేశాడు. ఇక్కడి ప్రజల అలవాట్లు, అభిరుచులు, ఆలోచనలు తెలుసుకున్నాడు. అంతే.. ఆ గంటా గడిచాక భారత్‌ ఓ పరాయి దేశంలాగా అనిపించనేలేదు.
 
ఆ చిన్న అనుభవంతో జువెన్సియో తీరు మారిపోయింది. దేశంలోని అధికారులు, రచయితలు, సామాజిక శాస్త్రవేత్తలు, వ్యాపారవేత్తలు.. ఇలా భిన్న రంగాల వ్యక్తులతో సంభాషించడం మొదలుపెట్టాడు. ఐకియాకి సంబంధించిన విదేశీ అధికారులు ఎవరు వచ్చినా, వాళ్లు కూడా భారతీయులతో కలుపుగోలుగా ఉండే పరిస్థితులు కల్పించేవాడు. క్రమంగా వాళ్లకి భారతీయులు ఏం కోరుకుంటున్నారో అర్థమైంది. భారతీయులు తక్కువ ధరలో నాణ్యమైన వస్తువులు కొనేందుకు ఇష్టపడతారు, రుచికరమైన ఆహారానికి ప్రాధాన్యమిస్తారు, ఇప్పుడిప్పుడే ఆన్‌లైన్‌ షాపింగ్‌కి అలవాటు పడుతున్నారు, చేతివృత్తులను గౌరవిస్తారు. ఇలాంటి విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొంది జువెన్సియో టీమ్‌. ఐకియాలో దొరికే వస్తువులన్నీ సామాన్యులకు అందుబాటు ధరల్లో ఉండేట్లు జాగ్రత్తపడింది.
 
దాదాపు వెయ్యిమంది కూర్చోగల భారీ రెస్టారెంటుని తన స్టోర్‌లో నెలకొల్పింది. స్టోర్‌ ప్రారంభం అయిన మొదటి రోజు నుంచే ఆన్‌లైన్‌లో కూడా ఐకియా వస్తువులు దొరికేలా చూసింది. కొబ్బరి పీచు, వెదురులాంటి పదార్థాలతో స్థానికులు చేసిన వస్తువులను కూడా అందుబాటులో ఉంచింది.
 Related image
జువెన్సియో వ్యూహం వృథాగా పోలేదు. ఆరంభించిన మొదటి రోజు నుంచే ఐకియా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకొంది. వచ్చిన పని పూర్తికావడంతో ఆయనను నెదర్లాండ్స్‌లో ఉన్న ఐకియా హెడ్‌ క్వార్టర్స్‌కు బదిలీ చేశారు. అక్కడ మరో సవాల్ రెడీగానే ఉండి ఉంటుంది. కానీ భారతదేశం మాత్రం తన వ్యక్తిత్వాన్ని శాశ్వతంగా మార్చేసిందంటాడు జువెన్సియో. ఇంతకు ముందు, వ్యాపార దృక్పథమే నా ఆలోచనలను ప్రభావితం చేసేది. కానీ ఇప్పుడు సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని ముందుకు నడుస్తున్నాను.. అని చెబుతారు జువెన్సియో.
వ్యాపారమైనా, ఉద్యోగమైనా.. మన చుట్టూ ఉండేవారి మనసును గెల్చుకునే ప్రయత్నం చేస్తేనే విజయం సాధ్యం అని చెప్పేందుకు జువెన్సియో అనుభవమే ఓ ఉదాహరణ. అందుకే ఇప్పుడు ఐకియా అద్భుత విజ‌యంతో ప‌రుగులు తీస్తోంది. ఎక్క‌డ చూసినా ఆత్మీయంగా ఐకియా ప‌ల‌క‌రిస్తుంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: