చిన్న‌వ‌య‌సులోనే కోట్లు సంపాదించ‌డం ఒక క‌ల మాత్ర‌మే కాదు.. క‌సితో కూడుకున్న ఓ తిరుగులేని ప్ర‌య‌త్నమంటూ ఎంద‌రో నిరూపించారు. డిమాండ్‌-సప్లై మధ్యనున్న సమస్యని తీరుస్తూ ట్వంటీప్ల‌స్‌లోనే కుబేరుల లిస్టులోకి చేరిపోతున్నారు మ‌న యువ‌త‌. ఇండియ‌న్ స్టార్ట‌ప్‌లో ఓ సంచలనమైన 32 ఏళ్ల భావిష్‌ అగర్వాల్‌ కథ ఇది.

Image result for bhavish aggarwal

పంజాబ్‌లోని లూధియానాకు చెందిన భావిష్‌ అగర్వాల్ 2004-ఐఐటీ ప్రవేశ పరీక్షలో 23వ ర్యాంకు సాధించాడు. కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థిగా ఐఐటీ-బొంబాయిలో అడుగుపెట్టాడు. భావిష్‌కి ఐఐటీ వాతావరణం బాగా న‌చ్చింది. . ఐఐటీ విద్యార్థులకు సహచరులే బలమనీ, ఆ వాతావరణం నేర్చుకోవడానికి గొప్ప అవకాశమనీ న‌మ్మాడు భానీష్‌.  ఓలా సహ వ్యవస్థాపకుడైన అంకిత్‌ భాటీతో భావిష్‌కు ఇక్కడే పరిచయం ఏర్పడింది. ఎదురెదురు గదుల్లో ఉండేవాళ్లు.  భవిష్యత్తులో కలిసి బిజినెస్ చేయాలనుకున్నారు. అక్కడ ఉన్నపుడే ఇద్ద‌రూ క‌లిసి బయట ప‌లు కంపెనీల‌కు కోడింగ్‌, వెబ్‌సైట్‌ డిజైనింగ్‌ చేసేవాళ్లు. 

Related image

బీటెక్‌ పూర్తిచేశాక మైక్రోసాఫ్ట్‌ బెంగళూరు కేంద్రంలో అసిస్టెంట్‌ రీసెర్చర్‌గా చేరాడు భావిష్‌. పనిచేస్తున్నాడు కానీ సొంతంగా ఏదైనా చేయాలన్న ఆలోచనవల్ల అక్కడ ఉండలేకపోయేవాడు. తరచూ స్టార్ట‌ప్ ఆలోచనల్ని అంకిత్‌తో చర్చించేవాడు. ఆ సమయంలోనే ఓసారి వారాంతంలో పర్యటనకు వెళ్లినపుడు క్యాబ్‌ డ్రైవర్‌ గమ్యం చేర్చకుండా మధ్యలోనే విడిచి పెట్టాడట. అది తన ఒక్కడి అనుభవం మాత్రమే కాదనీ, చాలామందికి ఎదురయ్యేదేననీ తెలుసుకుని క్యాబ్‌ సర్వీసుకు సంబంధించి కంపెనీ పెట్టాలనుకున్నాడు. ‘నాన్నతో నా ఆలోచన చెబితే... ట్రావెల్‌ ఏజెన్సీ పెడతావా’ అన్నాడు. రెండేళ్లు సమయం ఇవ్వండి. అప్పటికి వ్యాపారంలో బాగా నిలదొక్కుకోలేకపోతే తిరిగి ఉద్యోగంలో చేరతానని చెప్పాడు. చివ‌ర‌కు అయిష్టంగానే అంగీకరించారు.
భావిష్‌ మైక్రోసాఫ్ట్‌లో పనిచేసిన సమయంలో అంకిత్‌ ఐఐటీలోనే ఎంటెక్‌ పూర్తిచేశాడు. తర్వాత ఇద్దరూ 2010లో ముంబయిలో ‘ఓలాట్రిప్‌డాట్‌కామ్‌’ని ప్రారంభించారు. విమాన సేవలకు మేక్‌మైట్రిప్‌ ఉన్నట్లు క్యాబ్‌ బుకింగ్‌ సేవల విభాగంలో తాము ఉండాలనేది వీరి లక్ష్యం. ముంబయి పరిసరాల్లో పర్యటనలకి వాహన సదుపాయంతోపాటు, హోటల్‌ గదులు బుక్‌ చేసే సేవల్ని మొదలుపెట్టారు. కానీ అది అనుకున్నంతగా సక్సెస్‌ కాలేదు. అప్పుడే బయటకంటే నగరాల్లోనే రవాణా సమస్య ఎక్కువగా ఉన్నట్టు వాళ్లకి అర్థమైంది. 

Image result for bhavish aggarwal

సిటీల్లో కొందరు కారు డ్రైవర్లు పనిలేక ఖాళీగా ఉంటే, ఇంకొందరు వినియోగదారుల నుంచి డబ్బుని దారుణంగా పిండుకోవడం వాళ్లు చూశారు. అందుకే కార్ల యజమానుల్ని, వినియోగదారులతో అనుసంధానించి డిమాండ్‌-సప్లై మధ్యనున్న సమస్యని పరిష్కరించాలనుకున్నారు. ప్రారంభించిన ఆరు నెలలకే ఓలా ట్రిప్స్‌ని ఓలా క్యాబ్స్‌గా మార్చి సేవలు మొదలుపెట్టారు. అదే ఇప్ప‌టి ఓలా. ఫోన్‌తో పాటుగా వెబ్‌సైట్‌, యాప్ ద్వారా సేవలు అందించారు.
నిజానికి కంపెనీ ప్రారంభించిన సమయానికి వీరి దగ్గర పెద్దగా డబ్బులేదు. అంకిత్‌ అప్పటికి జాబ్‌ కూడా చేయలేదు. భావిష్‌ దగ్గర తను ఉద్యోగం చేస్తూ దాచుకున్న మొత్తం 4 లక్షల రూపాయ‌ల డ‌బ్బు మాత్ర‌మే ఉండేది. దాన్నే పెట్టుబడిగా ఉపయోగించారు. ఒక సింగిల్‌ బెడ్‌రూమ్‌ అపార్ట్‌మెంట్‌లో ఆఫీసు ప్రారంభించారు.  పగటిపూట డ్రైవర్లతో సంప్రదింపులకు, రాత్రిపూట వ్యాపార వ్యూహాలకు అదే కేంద్రం. కోడింగ్‌, సాంకేతిక విషయాలు అంకిత్‌ చూస్తుంటే, భావిష్‌ వాటికితోడు పెట్టుబడుల కోసం తిరిగేవాడు.
ఓలా సేవల్ని 2011 జనవరిలో ప్రారంభించారు. తొలి 100 రైడ్‌లు రావడానికి ఏడాదిన్నర పట్టింది. 2012లో ఢిల్లీ, బెంగళూరులకు విస్తరించారు. స్థిరమైన ఆదాయం వస్తుండటంతో క్యాబ్‌ డ్రైవర్లు పెద్దమొత్తంలో ఓలాతో పనిచేయడం మొదలుపెట్టారు. వినియోగదారులకూ అది లాభసాటి బేరంగా ఉండేది. ఆ తర్వాత క్రమంగా పెరుగుదల బాగా కనిపించింది. 2013 మధ్యకి వచ్చేసరికి రోజుకి 2000 రైడ్‌లు వచ్చేవి. తర్వాత మిగతా నగరాలకు విస్తరించుకుంటూ పోయారు. వినియోగదారులకు యాప్‌లో సౌలభ్యం ఉందని అర్థమవడంతో అంద‌రూ యాప్‌పైనే పూర్తిగా దృష్టిపెట్టారు. ఇంటర్నెట్‌ స్పీడ్‌ తక్కువ ఉన్నా కూడా ఆప్‌ పనిచేసేలా డిజైన్‌ చేశారు. ఆప్‌ వినియోగం చాలా సులభంగా ఉండేలా చూసుకున్నారు. ధర చౌక, వినియోగం సులభం... అన్న ప్రచారం వచ్చాక సొంత కార్లు ఉన్నవాళ్లూ ఇటువైపు అడుగేశారు. 
ఓలాలో ఇప్పటివరకూ వివిధ సంస్థలు 15వేల కోట్ల రూపాయ‌ల‌ పెట్టుబడి పెట్టాయి. అన్నింటికంటే కూడా తొలి రౌండ్‌లో 34 లక్షల రూపాయ‌లు ఫండింగ్‌ సంపాదించడానికే తాను ఎక్కువ కష్టపడాల్సి వచ్చిందంటాడు భావిష్‌. ఓలా ప్రారంభంలో పెట్టుబడి పెట్టినవాళ్లలో మైక్రోసాఫ్ట్‌లో భావిష్‌ మేనేజర్‌ ఒకరు. తర్వాత షాది డాట్‌కామ్‌ వ్యవస్థాపకుడు అనుపమ్‌ మిత్తల్‌, స్నాప్‌డీల్‌ వ్యవస్థాపకుడు కునాల్‌ బాహల్‌, వెంచర్‌ క్యాపిటలిస్ట్‌ రెహాన్‌ యార్‌ ఖాన్‌, రతన్‌ టాటా లాంటివారు  పెట్టుబడులు పెట్టారు. ఆపైన ప్రపంచస్థాయి సంస్థలైన సాఫ్ట్‌బ్యాంక్‌, టైగర్‌ మేనేజ్‌మెంట్‌, టెన్సెంట్‌... ఇవన్నీ వచ్చాయి. డబ్బుకంటే కూడా ఆయా వ్యక్తులతో కలిసి పనిచేయడంవల్ల లాభం ఉంటుందనుకుంటేనే చేతులు కలిపేవాళ్లు. స్వల్పకాల లాభాల్ని ఆశించేవాళ్లని కాకుండా దీర్ఘకాలం కొనసాగాలనుకునేవాళ్లని ఎంచుకున్నారు.

Image result for bhavish aggarwal

భావిష్‌ ఓలా ట్రిప్‌ ప్రారంభించిన సంవత్సరం 2010. ఆ త‌ర్వాత‌ ఓలా మార్కెట్‌లో వేగంగా దూసుకెళ్తోన్న సమయంలో ఇంట‌ర్నేష‌న‌ల్ కంపెనీ ఉబర్‌ 2013 సెకండాప్‌లో భారత్‌లో అడుగుపెట్టింది. డబ్బు, టెక్నాలజీ, అనుభవం... ఏ విధంగా చూసుకున్నా ఓలా కంటే ఒకడుగు ముందే ఉండేది ఉబర్‌. కానీ భారత్‌ గురించి  భారతీయులకంటే ఎవరికి బాగా తెలుస్తుంది. ‘చంటి గాడు లోకల్‌’ అని నిర్భయంగా ముందడుగు వేశాడు భావిష్‌. ఉబర్‌ జోరుకు అడ్డుకట్ట వేస్తూ ‘ఓలా ఆటో’ని తెచ్చారు. స్వల్ప వ్యవధిలోనే అక్కడ మంచి మార్కెట్‌ సంపాదించింది ఓలా. ఇప్పటికీ సంస్థ ఆదాయంలో 15 శాతం ఈ విభాగం నుంచి వస్తోంది. మెరుగైన ఉద్యోగుల కోసం కంపెనీ ప్రధాన కార్యాలయాన్ని బెంగళూరుకి మార్చారు. ‘విదేశీ కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బు జల్లాలని చూస్తాయి. అయితే మనం దేశీయ అవసరాలకు తగ్గట్టు కొత్త ఉత్పత్తుల్ని తీసుకొచ్చి ఇక్కడ లాభాల్ని సంపాదించగలిగే స్థాయిలో ఉన్నామని వాళ్లకి క్రమంగా అర్థమవుతుంది’ అంటారు భావిష్‌. స్థానిక ట్యాక్సీల్ని బుక్‌ చేసుకునేలా ముంబయిలో ‘ఓలా కాలీ-పీలీ’, కోల్‌కతాలో ‘ఓలా ఎల్లో క్యాబ్స్‌’ పేరుతో సేవలు మొదలుపెట్టారు. ఇంకా ఓలా షటిల్‌, బైక్‌, రెంటల్‌, ఔట్‌స్టేషన్‌, ఇ-రిక్షా, పెడల్‌, ఎలక్ట్రిక్‌... ఇలా ఎన్నో విభాగాల్నీ తెచ్చింది ఓలా. ప్రస్తుతం ఓలా కింద పది లక్షల వాహనాలు ఉన్నాయి. భారత్‌లో ఉబర్‌ 31 నగరాల్లో ఉంటే, ఓలా 110కిపైగా నగరాల్లో ఉంది. సగంకంటే ఎక్కువ మార్కెట్‌ ఓలాకే ఉంది. ఓలా ఇంట గెలవడమే కాకుండా ఈ ఏడాది ప్రారంభంలో ఆస్ట్రేలియాలోనూ సేవలు ప్రారంభించింది. అక్కడ ఉబర్‌తో పోటీ పడుతోంది. భారతీయ ఈ కామర్స్‌ కంపెనీ విదేశాల్లో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి.

Related image

ప్రస్తుతం ఓలా విలువ 26 వేల కోట్ల రూపాయ‌ల‌ని అంచనా. వంద కోట్ల ప్రజల రవాణా అవసరాల్ని తీర్చడమే ధ్యేయంగా రోజూ పని ప్రారంభిస్తానని చెప్పే భావిష్‌కు సొంత కారు లేదు. తనలానే అందరూ సొంత కార్లు కొనకుండా చూడాలనేది భావిష్‌ లక్ష్యాల్లో ఒకటి. ‘నాకు సొంత కారు లేదు. కానీ ఓలాలో మినీ, మైక్రో ఎస్‌యూవీ, లగ్జరీ... ఇలా నచ్చిన కారు ఉపయోగించుకునే అవకాశం ఉంది. పార్కింగ్‌, మెయింట్‌నెన్స్‌ లాంటి తలనొప్పులూ ఉండవు’ అనేది భావిష్ మాట‌. ఏదైతేనేం ట్రెండ్‌ను క్రియేట్ చేయ‌డం, దాన్ని నిల‌బెట్టుకోవ‌డం ఏంటో భానిష్ నుంచి యువ‌త నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: