జ‌బ‌ర్ద‌స్త్‌...ఈటీవీలో ప్రతి గురువారం ప్రసారమయ్యే షో. దీనికి మ‌రిన్ని నవ్వులు జోడించి శుక్రవారం ‘ఎక్స్‌ట్రా జబర్దస్త్’ ప్ర‌సారం అవుతోంది. ఈ షోకు న్యాయనిర్ణేతలుగా సినీ నటులు నాగబాబు, రోజాలు మరింత క్రేజ్‌ తెచ్చారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  తన సోదరుడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలోకి చేరి రాజకీయ కార్యకలాపాల్లో బిజీ అయ్యారు. నాగబాబు జనసేన పార్టీ నుంచి నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, ఆయ‌న బ‌దులుగా జ‌బ‌ర్ద‌స్త్‌లో మ‌రో ప్ర‌ముఖుడిని తెర‌మీద‌కు తీసుకువ‌చ్చారు. 

నాగబాబు పర్యవేక్షణలో నడిచిన జ‌బ‌ర్ద‌స్త్‌..ఇక నుంచి స్టార్ కమెడియన్ అలీ న్యాయ నిర్ణేతగా కొనసాగ‌నుంది. .  ఇప్పటికే ఆయనతో కొన్ని షోలను షూట్ చేయడం కూడా జరిగింది.  పనుల నుండి తీరిక దొరికాక మళ్ళీ నాగబాబు యాథావిధిగా న్యాయ నిర్ణేతగా తన స్థానంలోకి రానున్నారని కొంద‌రు అంటుండ‌గా....అలీయే పూర్తికాలం కొన‌సాగుతార‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. తాజా మార్పుల‌తో జబర్దస్త్ షో మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

కాగా, కొద్దికాలం క్రితం జ‌బ‌ర్ద‌స్త్ గురించి నాగ‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.  ‘రాజకీయాల్లో బిజీగా ఉన్నా, ‘జబర్దస్త్‌’ షో చేస్తారా.. లేక మానేస్తారా’ అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు నాగబాబు సమాధానం ఇచ్చారు. ‘‘ఏపీ ఎన్నికల రోజున సర్వేలో భాగంగా నేను ఓ పోలింగ్‌ బూత్‌కు వెళ్లాను. అక్కడ ఒక పెద్దావిడ.. ‘ఏమయ్యా.. నువ్వు ఎంపీ అయితే, ‘జబర్దస్త్‌’ మానేస్తావా?. నువ్వు మానేస్తానంటే ఒప్పుకొనేది లేదు.’ అని అన్నారు. ‘జబర్దస్త్‌’ అనేది ఒక సర్వీస్‌లాంటింది. అయితే, ఇది పెయిడ్‌ సర్వీస్‌. వినోదాన్ని పంచుతూ నాకు కొంత ఆదాయాన్ని ఇస్తోంది. దాని కంటే ప్రజల్ని నవ్వించే ఒక షోలో భాగం కావడం నాకు నచ్చింది.. గుర్తింపు తెచ్చింది. నేను ఈ షోకు కేటాయించేది నాలుగైదు రోజులు. ఒక వేళ నేను ఎంపీగా ఎన్నికైనా కూడా నాకు ఎటువంటి నష్టం జరగదు. ప్రజలకు చేరువకావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేను కచ్చితంగా ఈ షో చేస్తా. అయితే, సినిమాల్లో మాత్రం నటించలేకపోవచ్చు. ప్రజలకు నచ్చిన షో కాబట్టి తప్పకుండా చేస్తా. ఇది కొనసాగుతుంది.’’ అని అన్నారు. నాగాబాబు మాట‌ల్లో నిజ‌మెంతో తేలాలంటే..ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: