అమ్మా... నా స్నేహితులు వస్తున్నారు... వాళ్ల ఎదుట నన్ను విసిగించకు. ఆంగ్లంలో మాట్లాడటానికి ప్రయత్నించకు. మా స్కూల్‌కు వచ్చేటప్పుడు మంచి దుస్తులు వేసుకో... ఎందుకిలా తప్పుగా ప్రవర్తిస్తావు...’


- మనలో దాదాపు తొంభైశాతం మంది అమ్మలతో ఇలా ఏదో ఒక సందర్భంలో అనే ఉంటాం. ఆ మాటలతో అమ్మ కూడా ఎప్పుడో ఒకప్పుడు బాధపడే ఉంటుందని అంటారు జైపూర్‌కు చెందిన ప్రముఖ రచయిత్రి అనామిక జోషి.

ఇవన్నీ గుర్తించే ఆమె అమ్మపై కవిత రాసి, ఓ వేదికపై వినిపించింది. అది ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. వేలాదిమంది నుంచి ప్రశంసలు అందుకుంటోంది. యూట్యూబ్లో లక్షమంది ఈ కవితను చూడగా, పాతిక వేల మంది షేర్‌ చేయడం విశేషం.

ఆ కవితే...

నీతోనే ఉంటా...ఆమె అమ్మ.

ఉన్నతమైన వ్యక్తిగా మనల్ని తీర్చిదిద్దాలనుకుంటుంది.
మన భోజనాన్ని ప్రతిరోజూ రుచిగా అందించాలనుకుంటుంది.
మన దుస్తులపై మరకలు లేకుండా శుభ్రం చేసి ఎప్పటికప్పుడు అందించడానికి సిద్ధంగా ఉంటుంది.
అయితే... ఆమె ఉద్యోగానికి వెళ్లాలనుకున్నప్పుడు.. మనమే నిరోధిస్తాం.
ఇంటి నుంచే పనిచేయాలనుకుంటే... ఇంటిల్లిపాదీ కలిసి హేళన చేస్తాం.
నీ పిల్లల నుంచి నీకంటూ సమయాన్ని ఎలా కేటాయించుకుంటావు అని అడుగుతాం.
స్వార్థపూరితంగా తన కోసం తాను ఎలా జీవిస్తుంది అని భావిస్తాం...
చిన్నప్పటి నుంచి అమ్మపై మనం అపరిమితంగా కురిపించే ప్రేమ, ఆమె స్వేచ్ఛను హరిస్తుంది..
నిస్సహాయురాలిగా మారుస్తుంది. నిత్యం మన గురించే ఆలోచించేలా చేస్తుంది.
మనం ఎన్ని తప్పులు చేసినా అమ్మ వేలసార్లు క్షమిస్తుంది.
తప్పు చేయడానికీ అనుమతించదు. అప్పుడు కూడా ఆమె మన కోణం నుంచే ఆలోచిస్తుంది.
కానీ అమ్మ మనం కోరుకున్నట్లుగా ఉండాలనుకుంటుంది.

ఆ క్రమంలో తనకెదురైన కష్టాన్ని లెక్కచేయదు. అందుకే ఆమె అమ్మ అయ్యింది. కాబట్టి ఆమెను ఆమెలానే స్వీకరిద్దాం. మానవతామూర్తిలా ప్రేమిద్దాం.. తనకు నచ్చినట్లుగా ఉండనిద్దాం...అనుక్షణం తోడుగా ఉంటామని ప్రమాణం చేద్దాం...’ అంటూ కవిత్వాన్ని ముగిస్తుంది అనామిక.


మరింత సమాచారం తెలుసుకోండి: