హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేకెత్తించే ప‌రిణామాల్లో ఇదొక‌టి. చాప‌కింద నీరులా విస్త‌రిస్తున్న విష సంస్కృతిలో మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఆర్డ‌ర్‌పై ఆహార‌ప‌దార్థాలు తెచ్చి ఇవ్వ‌డం, కిర‌ణ స‌రుకులు, ఇత‌ర ఉత్ప‌త్తులు ఇంటికే తెచ్చి ఇస్తున్న‌ట్లే....ఆర్డర్లపై డ్రగ్స్ ఇంటికే సప్లయ్ చేస్తున్నారు. ఔను నిజ‌మే. జూబ్లీహిల్స్‌లో ఈ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. ఆర్డర్లపై డ్రగ్స్ సప్లయ్ చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం అరెస్టు చేసింది.


డ్రగ్స్ దందాలో ఆరితేరిన జూబ్లీహిల్స్ ఫిల్మ్ నగర్‌కు చెందిన షేక్ ఫహాద్ (40) రోడ్ నంబర్ 5 అడ్డాగా ఈ డోర్ డెలివ‌రీ దందా ప్రారంభించాడు. కర్నాటక గుల్బర్గాకు చెందిన బగారి సంతోష్ (21), టోలిచౌకీకి చెందిన మహ్మద్ మసూద్(38), వరంగల్ జిల్లా కొత్తగుడెంకు చెందిన నారగాని సురేశ్‌ (35)ను డ్రగ్స్ సప్లయర్లుగా ఫహాద్‌ చేర్చుకున్నాడు. వీళ్ల కోసం ఫిల్మ్ నగర్ రోడ్ నంబర్ 5లో షెల్టర్ ఏర్పాటు చేశాడు. జీతాలు, భోజన వసుతులు కల్పిస్తూ డ్రగ్స్ డోర్‌ డెలివరీ చేయించేవాడు.  హైదర్షాకోట్‌లో ఉండే నైజీరియన్ పీటర్ నుంచి కొకైన్, ఓపియంను కొని అమ్మేవాడు. 


కూకట్‌పల్లి,  మాదాపూర్, గచ్చిబౌలి, మాసబ్‌ట్యాంక్, గచ్చిబౌలిలో డ్రగ్ పాయింట్లనూ ఏర్పాటు చేశాడు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పాటు హైటెక్‌సిటీ, గచ్చిబౌలిల్లోని తన కస్టమర్లకు డ్రగ్స్‌ను పీటర్ నుంచి ఆర్డర్ చేస్తూ సప్లయ్ చేసేవాడు. 6 నెలలుగా డోర్ డెలివరీతో పాటు డ్రగ్ సేల్ పాయింట్స్‌తో దందా నడిపిస్తున్నాడు. ఎట్ట‌కేల‌కు వీరి గుట్టు ర‌ట్ట‌యింది.  వారి నుంచి 7 గ్రాముల కొకైన్, 2 గ్రాముల ఓపియం, రూ.1.13 లక్షలు, 3 బైకులు స్వాధీనం చేసుకుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: