ఐడియాలు అద్భుతాలు చేస్తాయి. నిత్య జీవితాన్ని సుల‌భ‌త‌రం చేస్తాయి. ఫుడ్‌ ఆర్డర్‌ కోసం ఒక యాప్‌. బిల్‌ పేమెంట్స్‌ కోసం ఇంకొకటి.. ట్రావెల్, సినిమా టికెట్లకు మరొకటి.. ఇలా ప్రతి దానికో యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే బదులు అన్ని రకాల సేవలకూ ఒకే యాప్‌ ఉంటే? ఇదే ఆలోచ‌న‌తో ఓ యాప్ రూపొందించాడు. జీవితంలో దూర‌మైన‌ బంధాల లోటును ఓ యాప్‌తోనే తీర్చే మ‌రో ఐడియా. లైఫ్‌ను స్మార్ట్ చేసే ఐడియాల‌తో స్టార్ట‌ప్‌లో దుమ్మురేపుతున్నాడు వ‌రంగ‌ల్‌కు చెందిన పాతికేళ్ల కుర్రాడు భాను ల‌క్ష్మ‌ణ్.

Image may contain: 1 person, closeup

విధి తనను వెక్కిరిస్తే.. ఆ విధినే జయించాడు వరంగల్ కు చెందిన భాను లక్ష్మ‌ణ్. సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో తమిళనాడులోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్‌లో బీఎఫ్‌టెక్ కోర్సు చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాకు సౌండ్ ఇంజనీర్‌గా పనిచేశాడు. అంతటి ప్రతిభ ఉన్న దర్శకుడి కంట్లో పడినందుకు సంతోషించాడు. తన కెరీర్ గాడిలో పడిందనుకున్నాడు. ఇండ‌స్ట్రీలో నిలదొక్కుకుంటున్న సమయంలోనే అమ్మ మరణించిన వార్త భానుని మనో వేదనకు గురిచేసింది. ఇక న‌గ‌రం నుంచి వెళ్లిపోవలసిన పరిస్థితి వచ్చింది. ఉన్న ఊరిలోనే ఉంటూ తన ప్రతిభకు పదునుపెట్టాడు. స‌రికొత్త‌ యాడియాల‌తో యాప్‌ల‌ను ఆవిష్కరించాడు. 

Image may contain: 1 person, standing and indoor

తాజాగా భాను ల‌క్ష్మ‌ణ్ క్రియేట్ చేసిన యాప్ హౌడీమి. జీవితంలో వివిధ సంబంధాల నుంచి దూర‌మైన వారిని కలిపే యాప్. అంటే జీవిత భాగ‌స్వామిని కోల్పోయినా, సోద‌రిని కోల్పోయినా, ఇత‌ర బంధాల‌ను కోల్పోయినా.. స‌రిగ్గా అలాంటి ప‌రిస్థితిని ఎదుర్కొంటున్న వారితో బంధం క‌లిపే యాప్ అన్న‌మాట‌. ఇంకా ఈ యాప్‌లో మ‌న‌కు స‌మీపంలో ఉన్న వివిధ స‌ర్వీసుల‌ను పొందే వెలుసుబాటు ఉంది.  
అంత‌కు ముందే భాను 2015లో 3 లక్షల రూపాయల పెట్టుబడితో షాపిట్‌సూన్ డాట్ కామ్ ప్రారంభించాడు. ఒకే యాప్‌ ద్వారా పలు రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చాడు. షాపింగ్ కోసం షాప్ ఇట్ సూన్, ఈటింగ్ కోసం ఈట్ ఇట్ సూన్, వార్తలు, కరెంట్ అఫైర్స్ కోసం రీడ్ ఇట్ సూన్, ట్రావెల్స్ కోసం రైడ్ ఇట్ సూన్, లావాదేవీల కోసం స్వైప్ ఇట్ సూన్ అనే వేర్వేరు వేదికలు అందుబాటులోకి తీసుకువచ్చాడు.
 
వీటన్నింటినీ ఒకే యాప్‌లో పొందుపరచాలనుకున్న భాను ‘పబ్బాస్ యాప్’ ను తయారు చేశాడు. ఈ యాప్ ద్వారా ఏటా 18 లక్షల ఆర్డర్లను.. 25 లక్షల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. భానూ రూపొందించిన ఈ యాప్ ద్వారా మొత్తం 18 రకాల సేవలను పొందవచ్చు.
 Image may contain: one or more people, people sitting, screen and indoor
మొబైల్ రీచార్జ్ నుంచి ఎలక్ట్రిసిటీ, డీటీహెచ్ బిల్స్, ఫుడ్, గ్రాసరీ, ట్రావెల్స్, మెడిసిన్స్, డయాగ్నస్టిక్స్, ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్, ప్లంబింగ్, కార్పెంటరీ వర్క్స్ వంటి మరికొన్ని సేవలకు ఈ యాప్ ద్వారా పొందవచ్చు. ప్రస్తుతం పబ్బాస్ స్టార్ట‌ప్‌లో 80 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 10 వేల రకాల కిరాణా ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. విదేశాల నుంచి కూడా ఆర్డర్లు తీసుకుంటున్నారు. తన సేవలను విస్తరించాలనుకుంటున్నట్లు భాను చెబుతున్నారు. రానున్న రోజుల్లో హైద‌రాబాద్‌తో పాటు, బెంగళూరు, చెన్నై, పూణె వంటి నగరాల్లో కూడా పబ్బాస్ సేవలు అందుబాటులో ఉంటాయని ఆనందంగా చెబుతున్నాడు. అంతేకాదు స‌రికొత్త ఐడియాల‌తో మరిన్ని స్టార్ట‌ప్‌ల‌కు తెర‌తీయ‌బోతున్నాడు. 


మ‌న‌కు ప‌రిస్థితులు ఎప్పుడూ  అనుకూలించ‌వు. అంత‌మాత్రాన నిరాశ‌ప‌డ‌కూడ‌దు. అవ‌కాశాల‌ను మ‌న‌కు మ‌న‌మే క్రియేట్ చేసుకోవాలి అనే మెసెజ్ ఇస్తూ ఈత‌రం యూత్‌కు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు ఈ పాతికేళ్ల యువ‌కుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: