అందాల ప్ర‌పంచంలో గెలిచింది.. కానీ త‌ను అంద‌మైన దేశం చూడాల‌నుకుంటోంది. అందుకే ఫ్యాష‌న్ ప్ర‌పంచం నుంచి దేశాన్ని ర‌క్షించే రంగంలోకి స‌గ‌ర్వంగా అడుగుపెట్టింది. చదువు, తెలివి, అందం, ధైర్యం.. ఇవ‌న్నీ క‌ల‌గ‌లిసిన ఆమెకు ఇప్పుడు దేశం సైల్యూట్ చేస్తోంది. 
 Image result for garima yadav
గరిమ యాదవ్ ఫ్యాషన్ రంగం నుంచి.. ఆర్మీ రంగానికి వ‌చ్చింది. శారీరక కష్టాన్ని లెక్కచేయకుండా దేశం కోసం నిరంత‌రం సైనికులు పోరాడితే.. శరీరాన్ని ఎంతో నాజుకుగా కాపాడుకుంటూ ఫ్యాషన్‌ ప్రపంచంలో త‌ళుక్కున‌ వెలిగిపోతారు మోడల్స్‌. ఫ్యాషన్‌ ప్రపంచంలోని సుకుమారానికి అలవాటు పడినవారు సైన్యంలో చేరాలనే ఆలోచనే చేయరు. కుదిరితే అవకాశాలను వాడుకొని బాలీవుడ్‌లో స్థిరపడాలనుకుంటారు. కానీ ఫ్యాషన్‌ ప్రపంచంలో అందాల కిరీటాన్ని సొంతం చేసుకొన్న గరిమ మాత్రం వచ్చిన అవకాశాలను త్రుణప్రాయంగా వదులుకొని దేశం కోసం ఆర్మీలో చేరింది.  
 Related image
సిమ్లా ఆర్మీ ప‌బ్లిక్ స్కూళ్లో చ‌దువుకున్న గరిమ చదువులో కూడా చురుకైన అమ్మాయి. ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్ కాలేజ్ నుంచి పట్టా అందుకుంది. ఆ తర్వాత తొలి ప్రయత్నంలోనే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్‌ పరీక్షను పూర్తి చేసింది. దీంతో ఆమెకు చెన్నైలోని ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో సీటు వచ్చింది. అదే సమయంలో ఆమె సరదాగా ‘మిస్‌ ఇండియా ఛార్మింగ్‌ ఫేస్‌ 2017’ పోటీల్లో పాల్గొంది. చదువు, తెలివి, అందం ఈ మూడు కలగలిసిన ఆమెను విజయం వరించింది.  ఇటలీలో జరిగే ఇంట‌ర్నేష‌న‌ల్ పోటీల్లో పాల్గొనే అవకాశం వచ్చింది. కానీ అందాల పోటీల కోసం ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలో వచ్చిన సీటును వదులుకోవడానికి గరిమ ఇష్టపడలేదు. ఆర్మీనే కెరీర్‌గా ఎంచుకొని అకాడమీలో చేరింది. 
 Image result for garima yadav
ఆఫీసర్స్‌ ట్రైనింగ్‌ అకాడమీలోకి వచ్చిన కొన్నాళ్ల పాటు తీవ్ర క‌స‌ర‌త్తులే చేయాల్సి వ‌చ్చింది. తొలినాళ్లలో శిక్షణ స్థాయిని అందుకోవడానికి ఆమె శరీరం సహకరించలేదు. అయితేనేం ఆమె ప‌ట్టుద‌ల‌తో ఎక్క‌డా త‌గ్గ‌లేదు. ఎక్కడా పట్టువీడలేదు. చివరికి అన్ని ఈవెంట్లలో విజయం సాధించి విజ‌య‌వంతంగా శిక్షణ పూర్తి చేసుకుంది. ట్రైనింగ్ పూర్తి చేసి అనంత‌రం ఇటీవ‌లే లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టింది. అయితే సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డులో ఎంపికవ్వడానికి శారీరక దృఢత్వానికి సంబంధం లేదని, బలహీనతలను అంగీకరించి నిత్యం మెరుగుపర్చుకునేందుకు కృషి చేస్తే చాలు.. అని గరిమ శిక్షణ అనంతరం సగర్వంగా తెలిపింది. అందాల పోటీ నుంచి ఆర్మీలోకి వెళ్లిన లెఫ్టినెంట్‌ గరిమ యాదవ్‌ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: