చదువు చదువు చదువు - ఎవ్వరి నోట విన్నా ఇదే మాట.. మంచిదే - అందరూ చదువుకుంటే అంతకన్నా మంచేముంది.. కాకపోతే అత్యాశ పనికిరాదు.. అందరూ కలెక్టర్లో, డాక్టర్లో, ఇంజనీర్లో అవ్వలేరు కదా! కానీ ప్రతి తల్లిదండ్రుల ఆశా తమ పిల్లలు మాత్రం అలా ఏదో ఒకటి కావాలనే..

 

 

మంచి సమాజసేవకులుగా సత్‌ప్రవర్తన కలవారుగా బాద్యతగల పౌరులుగా తమ పిల్లలని తయారుచేయడం కంటె బాగా సంపాదన ఆర్జించగలవారిగా లంచాలు బాగా వచ్చే పోస్టు తెచ్చుకోగలిగే వారిగా అధికారం దర్పం వుండే ఉద్యోగం చేయగల్గే వారిగా తమ పిల్లలు తయారుకావాలని ఆశిస్తున్నారు..

మంచిగా నిజాయితీతో బతికేవాన్ని తల్లో నాలుకలేని వాడని చేతకాని వాడని ఎద్దేవా చేస్తున్నారు.. అదే లంచాలు మరిగిన కొడుకును చూసి “రెండు చేతులా ఆర్జిస్తున్నాడని” గొప్పగా చెప్పుకుంటున్నారు..

 

 

 ఆ విధంగా సంపాదనే లక్ష్యంగా మన చదువులు వుంటున్నాయి తప్పితే విలువల లక్ష్యంగా లేవు.. పిల్లల కిష్టమయిన చదువులు కాక భవిష్యత్తులో బాగా సంపాదించడానికి వుపయోగపడే చదువులు చదివిస్తున్నారు.. భవిష్యత్తు పేరుతో పిల్లల వర్తమానాన్ని పాడు చేస్తున్నారు.. ఎంతో అమూల్యమయిన బాల్యాన్ని చదువుల పేరుతో చెరబడుతున్నారు..

"అసలు అయిదేళ్ళు వచ్చేవరకు బడిలో చేర్పించడాన్ని నిషేధించాలి".

పాలుతాగే వయసులో పుస్తకాలు తినడం ఏంటి? ఎదురింటి పక్కంటి పిల్లలతో పోల్చి వాళ్ళలో అసూయ, స్పర్థ బీజాలు నాటడమెందుకు?

 

 

ఏ పిల్లాడికయినా తనకంటూ కొన్ని పరిమితులు వుంటాయి.. వాటిని మించి వాళ్ళను చదివి ర్యాంకులు సాధించమంటే అది చివరికి బెడిసికొట్టి ఆ ఒత్తిడి తట్టుకోలేక తల్లిదండ్రులకు ఎదురు తిరగుతారు లేక పోతే ఆత్మహత్యలు చేసుకుంటారు.. వారమంతా పాఠాలటా.. శనివారం, ఆదివారం పరీక్షలట! వారమంతా చదువే అయితే ఇక బయటి విషయాలు వాళ్ళకెలా తెలుస్తాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: