ఆక‌లి బాధ దిగ‌మింగుకుని ఆకాశ‌న్నంటే విజ‌యాన్ని సాధించిన వారు నిజంగా హీరోలే. ఒక‌ప్పుడు ఆక‌లి బాధ‌లు, అవ‌మానాలు ఎదుర్కొని ఆ క‌సిలోంచే క‌నివినీ ఎర‌గ‌ని విజ‌యాలు సాధించిన‌ వారు ఉన్నారు. క‌టిక పేద‌రికాన్ని అనుభ‌వించి, స‌వాళ్ల‌కు ఎదురొడ్డి నిల‌బ‌డి క‌ల‌బ‌డి గెలిచారు. అలాంటి ఓ ద‌మ్మున్నోడి గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. 

నిత్యజీవితంలో మ‌న‌తో పెన‌వేసుకుని ఉండే ఫెవిక‌ల్.. మ‌న అవ‌స‌రాలు తీర్చుతూ మ‌న‌తో 'ఫెవిక‌ల్ బంధం'గా మారింది. అవును మ‌నం ఇప్పుడు చెప్పుకోబోతోంది 'ఫెవిక‌ల్' అధినేత బల్వంత్ రాయ్ కల్యాణ్‌జి పారేఖ్ గురించి. ఫెవికాల్ పారేఖ్ గా గుర్తింపు పొందిన ఆయ‌న స‌క్సెస్ స్టోరీ నిజంగా వండ‌ర్ అనే చెప్పొచ్చు.
నిరుపేద కుటుంబంలో జ‌న్మించిన బల్వంత్ రాయ్ కల్యాణ్‌జి పారేఖ్ గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లా మహువా గ్రామానికి చెందిన వాడు. పేదకుటుంబం కావడంతో అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. 1942లో పారేఖ్ చట్టాలను అధ్యయనం చేయడానికి బొంబాయికి వెళ్లాడు. ఆ సమయంలో భార‌త‌దేశానికి స్వాతంత్య్రం కావాల‌ని కోరుకుంటూ మ‌హాత్మ‌ గాంధీజీ ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం పారేఖ్‌ను ఆకట్టుకుంది. బొంబాయి నుంచి గుజరాత్‌కు తిరిగి వచ్చి క్విట్ ఇండియా, వివిధ సామాజిక కార్యక్రమాల్లో పారేఖ్ చురుగ్గా పాల్గొన్నాడు. మరుసటి ఏడాది పారేఖ్ మళ్లీ ముంబైకి పయనమయ్యాడు. స్నేహితులతో అద్దె గదిలో ఉంటూ, ఒక పూట తింటే మరో పూట పస్తులుంటూ, రాత్రిళ్లు అర్ధాకలితో నిద్రపోయే వాడు. పుస్తకాలు కొనేందుకు కూడా డబ్బుల్లేకపోతే కూలీకి వెళ్లే వాడు. ఎన్నో కష్టాలకోర్చి అతను లా పూర్తి చేశారు. ఆ త‌ర్వాత బొంబాయిలో ప్రాక్టీస్ ప్రారంభించాడు. 

Image result for fevicol founder BALVANT PAREKH

నిజాయితీని న‌మ్ముకుని..
జీవితంలో గొప్ప‌గా ఎద‌గాలంటే నిజాయితీ అవ‌స‌ర‌మ‌ని నిరూపించాడు పారేఖ్. ఎంత‌లా అంటే... లా ప్రాక్టీస్ వదిలేసిన అనంతరం పారేఖ్ అనేక ఇబ్బందులెదుర్కొన్నాడు. వృత్తిలో భాగంగా అబద్ధం చెప్పనని ఒకే మాట మీద నిల్చున్నాడు. చివరికి తాను నిలబడిన మాట కోసం వృత్తిని కూడా వదులుకున్నాడు. అనంతరం తనకున్న పరిచయస్తుల దగ్గర, కుటుంబీకుల దగ్గర అప్పు చేసి ముంబైలోనే డయింగ్, ప్రింటింగ్ ప్రెస్ ప్రారంభించాడు. ప్రారంభంలో గిరాకీ బాగానే ఉండేది. మూడు నెలల తర్వాత వ్యాపారం క్రమంగా త‌గ్గిపోయింది. ఆ రంగంలోని మెలకువలు తెలియకపోవడం, నిర్వహణ భారంగా మారడంతో అక్కడ కూడా పారేఖ్‌కు ఎదురు దెబ్బే తగిలింది. 

Fareq

వ్యాపారంలో దెబ్బ‌తిన‌డంతో ఆర్థిక చక్రంలో పడి నలిగిన పారేఖ్ వుడ్ ట్రేడర్స్ కార్యాలయంలో ప్యూన్‌గా చేరాడు. ఇంటి అద్దె కూడా కట్టలేని పరిస్థితుల్లో ఉన్న పారేఖ్ ట్రేడర్స్ యజమానులను బతిమాలి గిడ్డంగిలోనే భార్యతో కలిసి జీవించాడు. ప్యూన్‌గా టీలు, కాఫీలు అందిస్తూ పారేఖ్ చొరవ తీసుకుని నిర్వాహకులకు సూచనలు, సలహాలిచ్చేవారు. ట్రేడర్స్ నిర్వాహకుల్లో ఒకరు పారేఖ్ వ్యాపార ప్రతిభను గుర్తించారు. అనంతరం పారేఖ్‌కు అతడు చిన్న వ్యాపార బాధ్యతలను అప్పగించారు. ఇతర దేశాల నుంచి సైకిళ్ల విడిభాగాలను తీసుకొచ్చి బిగించి అమ్మే వ్యాపారాన్ని అప్పగించారు. ఆ పనిని పారేఖ్ తన తమ్ముడు సుశీల్ పారేఖ్‌తో కలిసి కొనసాగించాడు. గత అనుభవాలను పాఠాలుగా మలుచుకుని వ్యాపారంలో బాగా రాణించాడు. ఇందులో అతి తక్కువ రోజుల్లోనే అధిక మొత్తంలో లాభాలు గడించే స్థాయికి ఎదిగారు పారేఖ్ బ్ర‌ద‌ర్స్.

Related image

ఫెవికాల్ ఆలోచ‌న ఇలా..
ఇటు ప్యూన్‌గా, అటు వ్యాపారిగా కొనసాగుతున్న క్రమంలో ఒకరోజు పారేఖ్‌కు ఓ ఆలోచన వచ్చింది. రెండు బల్లచెక్కలను అతికించడానికి మొలలు కొట్టి, ఇతర ప్రయత్నాలెన్నో చేస్తున్నారు. ఇవేమీ లేకుండా సులభంగా ఒక ద్రవ పదార్థంతో రెండు బల్లలను అతికించ వచ్చు కదాని ఆలోచించారు. అప్పుడు రూపు దాల్చిందే ఫెవికాల్. ఆ తర్వాత సైకిల్ విక్రయాల వ్యాపారాన్ని పూర్తిగా తన తమ్ముడికి అప్పగించారు. 1959లో పిడిలైట్ ఇండస్ట్రీస్‌ను ప్రారంభించాడు. ఫెవికాల్‌కు కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. నిర్మాణరంగంలో ఫెవికాల్ లేకుండా పనులు జరగలేని పరిస్థితి నెలకొంది. డిమాండ్ పెరగడంతో ఫెవికిక్, ఎంసీల్ పేరుతో మరో రెండు వస్తువుల్ని రిలీజ్ చేశారు. భారతీయ మార్కెట్లో 75 శాతం వాటాను దక్కించుకున్నారు. కొత్త కొత్త ప్రకటనలతో త‌మ ప్రొడ‌క్టుల‌ను సామాన్యులకు చేర్చారు. 2006లో పారేఖ్ తన బిజినెస్‌ను ఇంట‌ర్నేష‌న‌ల్‌ మార్కెట్లోకి తీసుకెళ్లారు. ఏకంగా 14 దేశాల్లో కంపెనీలను స్థాపించి దుమ్మురేపారు. 

Image result for fevicol founder

జ‌న్మ‌భూమి రుణం తీర్చుకునేందుకు...
బిజినెస్‌లో బిగ్ ప‌ర్స‌న్‌గా ఎద‌గ‌డ‌మే కాదు సేవా కార్య‌క్ర‌మాలు కూడా చేస్తున్నాడు ఫారేఖ్. ఉన్న ఊరు కన్న తల్లివంటిదంటారు. ఆ తల్లి రుణం తీర్చుకునేందుకు స్వంత మహువాలో రెండు పాఠశాలలు, ఒక కాలేజీ కట్టించి ప్రతి ఒక్కరికీ ఉచితంగా విద్య అందిస్తున్నాడు పారేఖ్. చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు ఆరోగ్యాన్ని అందించేందుకు ప్రత్యేకంగా హ‌స్పిట‌ల్ కట్టించాడు. అన్ని విభాగాల స్పెషలిస్టులతో ఉచితంగా వైద్యం అందిస్తున్నాడు. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని పేదల కోసం ఖర్చు చేయాలని దర్శక్ ఫౌండేషన్‌ను స్థాపించాడు. ఈ సంస్థ గుజరాత్‌లోని కల్చరల్ హిస్టరీని స్టడీ చేస్తుంది. భావ్‌నగర్ సైన్స్ సిటీ ప్రాజెక్టు కోసం రెండు కోట్ల రూపాయ‌ల‌ విరాళంగా కూడా అందించాడు. బల్వంత్ పారేఖ్ సెంటర్ ఫర్ జనరల్ సెమాటిక్స్ అండ్ అదర్ హ్యూమన్ సైన్సెస్ పేరుతో స్థాపించాడు. 

నిరుపేద జీవితం నుంచి త‌న స‌రికొత్త ఆలోచ‌న‌లు ఆచ‌ర‌ణ‌లో పెట్టి అపారమైన సంపదను సృష్టించిన పారేఖ్ 88 ఏళ్ల వయసులో(2013లో) భౌతికంగా నిష్క్ర‌మించాడు. ఫోర్బ్స్ ఏసియా ప్రకటించిన రిచెస్ట్ ఫ్యామిలీస్ జాబితాలో బల్వంత్ పారేఖ్ పేరు కూడా ఉంది. అయితే ఆయన భౌతికంగా మనమధ్య లేకపోయినా ఫెవికోల్ బంధం అలాగే ఉంది. నిత్యం మ‌న వాడుక‌లో ఉంది. పారేఖ్ స‌క్సెస్‌స్టోరీకి ఈ త‌రం యూత్‌ ఫెవికల్ బంధంలా అతుక్కుపోవాల్సిన అవ‌స‌రం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: