" సత్యం బ్రూయాత్ ప్రియంబ్రూయాత్

బ్రూయాత్ సత్య మప్రియమ్!

ప్రియం చనా నృతం బ్రూయాత్

ఏష ధర్మః సనాతనః॥" 


ఎప్పుడూ సత్యమే చెప్పాలి. సత్యాన్ని కూడా సంతోషం కలిగించేట్టుగా చెప్పాలి. సంతోషకరంగా వుండాలన్నారు కదా! అని అబద్ధాలు చెప్పకూడదు. ఇది ధర్మశాస్త్రం చెప్పిన మాట. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. 


“ఒక  అడవిలో లేడిపిల్లను పులి వెంబడించింది. లేడిపిల్ల పరుగెత్తుకొంటూ వచ్చి అక్కడున్న ముని ఆశ్రమంలోని చెట్టు వెనుక ప్రాణభయంతో దాక్కుంది. వెంబడించి వచ్చిన పులికి లేడిపిల్లజాడ తెలియక అక్కడవున్న మునీశ్వరుని దగ్గరకు వెళ్ళి...... “మునీశ్వరా! నాకు ఆహారం కావల్సిన లేడిపిల్ల ఇటు వచ్చింది. అది  ఎక్కడ ఉందో చెప్పండి"  అని అడిగింది.


అబద్ధం చెప్పకూడదు. సత్యమే చెప్పాలి గదా! అని ఆ మునీశ్వరుడు “పులిరాజా! నేను మునివృత్తిలో వుండి అసత్యాన్ని చెబితే పాపం వస్తుంది గదా! అబద్ధం చెప్పను. నీవు తరుముకొని వచ్చిన లేడిపిల్ల అదిగో ఆ చెట్టుచాటున దాక్కొంది” అని చెప్పాడు.

 

ఇంకే ముంది! ప్రాణభీతితో గజగజలాడుతున్న లేడిపిల్లను ఒక్క ఉదుటున నోట కరచి చంపేసి అహారంగా తినేసింది పులి.  దాంతో మునీశ్వరుడు ఎన్నో సంవత్సరాల నుండి సాధించుకొన్న తపశ్శక్తి  నిజం చెప్పటం వల్ల నాశనం అయింది.

 

మునీశ్వరుడు చెప్పింది సత్యమే అయినా పాపాన్ని అనుభవించాల్సి వచ్చింది. సాధు జంతువును సంరక్షించాల్సింది పోయి మరణ కారకుడయ్యాడు గదా! “దుష్ట శిక్షణ కోసం, ధర్మ రక్షణ కోసం అబద్ధం చెప్పినా తప్పుకాదు” ఇది కృష్ణుడు చెప్పిన మాట. 

 

శ్రీకృష్ణుడు దుర్యోధన దుశ్శాసనాదులను ఆ (అ) ధర్మ పద్ధతి లోనే చంపించాడు. ఒక చెడి పోయిన అవయవాన్ని నరికేసి శరీరంలోని మిగిలిన అవయవాలను రక్షించటం ఉపకారమే గదా!  అధర్మాన్ని అధర్మంతోనూ, మోసాన్ని మోసం తోనూ, కత్తిని కత్తి తోనూ ఎదుర్కొనటం తప్పుగాదు.

 

ఒక్కొక్క విషయంలో సత్యం కన్నా అబద్ధం గొప్పది! అపకారం కలిగించే సత్యాని కన్నా, ఉపకారం కలిగించే అబద్ధమే పుణ్యప్రదం అవుతుంది. కాబట్టి సత్యం చెప్పటం మాత్రమే గొప్ప గాదు. వివేకంతో చెప్పే సత్యమే గొప్పది. అపకార బుద్ధితో  చెప్పే సత్యం, అబద్ధానికి మించిన పాపం కల్గిస్తుంది. మనం సత్యం చెప్పామా? అసత్యం  చెప్పామా? అనే దాని కన్నా అపకారం చేశామా? ఉపకారం చేశామా? అనేదే ముఖ్యం.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: