పూర్వకాలంలో కూడా మనుషులకు సమస్యలు ఉండేవి, అయితే అప్పటి జీవన విధానం వేరుగా ఉండేది. అప్పట్లో మన చుట్టూ ఉన్న వారిలో ఎవరికైనా, ఏదైనా కష్టం వస్తే దానిని తీర్చడానికి అందరూ కలిసి తమవంతుగా ప్రయత్నించేవారు. మరీ ముఖ్యంగా అప్పటి మనుషులు మనము, మనది అనే భావనను నమ్మేవారు. అంతేకాక స్త్రీలను గౌరవించడం, అలానే అప్పుడు కూడా ధనం ఉన్నప్పటికీ, అది కేవలం బ్రతకడం కోసమే అని ఎక్కువగా భావించేవారు. ఇక మెల్లగా కాలక్రమేణా రోజులు, నెలలు సంవత్సరాలు ముందుకు గడవడం, ఈ కాల గమనంలో మనిషి తన మేధస్సుకు మరింత పదునుపెట్టి రకరకాల నూతన ఆవిష్కరణలు కనుగొంటూ ముందుకు సాగాడు. అప్పటితో పోలిస్తే నేటి ప్రపంచంలో కష్టమైన పని అనేది ఏ ఒక్కటి కూడా లేదు, ఎందువలన అంటే, ఎంతటి కష్టతరమైన పని అయినా సరే దానిని డబ్బుతో సులువుగా కానిచ్చేస్తున్నారు. ఒకప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఎవరైనా చనిపోతే, వారి కుటుంబాన్ని ప్రతిఒక్కరు ఎంతో ఓదార్చి, తమవంతు సాయాన్ని అందించి వారికి బాసటగా నిలిచేవారు. నేటి పరిస్థితి ఎంత దౌర్భాగంగా తయారయిందయ్యా అంటే, ఒక ప్రక్కన మనిషి చనిపోయి ఆ కుటుంబం బాధల్లో ఉంటె, మరోప్రక్కన పెద ఖర్మ నాడు ఎటువంటి పదార్ధాలు పెట్టాలి, ఎందరిని పిలవాలి అంటూ కేవలం తిండి కోసం మాత్రమే లెక్కలేసే స్థితికి మనుషులు తయారయ్యారు. 

ఇక మన వారు ఎవరికైనా కొంత ఆర్ధికంగా సమస్యలు వస్తే, వారు మనల్ని ఎక్కడ డబ్బులు అడుగుతారో అనే భయం, ఒకవేళ కొందరు తమ పరిస్థితి మరింత క్షీణించి మనల్ని డబ్బులు అడిగినా, మనలో 100 లో 99 శాతం మంది ఉండి కూడా లేదని చెప్తుంటాం. ఇక ప్రస్తుత కాలంలో నడుస్తన్న లేటెస్ట్ ట్రెండ్ ఏంటయ్యా అంటే, చక్కగా ఉదయాన్నే ఉద్యోగానికి వెళ్లడం, సాయంత్రం అయ్యేసరికి ఇంటికి చేరుకొని, హాయిగా మన భార్య బిడ్డలతో గడపడం, ఏదైనా పండుగల సమయంలోనో లేక సెలవులో వస్తే, ఫ్యామిలీ తో కలసి ఎంచక్కా బోలెడు డబ్బు తగలేసి షికార్లు చేసి రావడం చేస్తున్నాం. మనం ఎటువంటి స్థితికి వచ్చామంటే, చివరకు మన ప్రాణ స్నేహితుడు, తల్లి, తండ్రి, అక్క, అన్న, చెల్లి వీరిలో ఎవరైనా తమకు అవసరం అని డబ్బు అడిగితే, వారికి ఇవ్వడం ఎందుకు, అదేదో మన పిల్లలకు ఉపయోగిస్తే పోతుందిగా అంటూ నీచమైన అబద్దాలు చెప్పే స్థితికి వచ్చాం. అంటే ఒకప్పుడు బ్రహ్మం గారు చెప్పినట్టు తన, పర అనేవి లేవు, అవన్నీ కూడా డబ్బే అనే గొప్ప స్థితికి చేరుకున్నాం.అంతలా నేటి మనిషి జీవితంలో డబ్బు ప్రధమ స్థానాన్ని ఆక్రమించింది. మొత్తంగా ఏంటంటే, ఇక ఎన్నో నూతన ఆవిష్కరణలు కనుగొన్న మనిషి, ప్రక్క వారిపట్ల, అలానే ముఖ్యంగా దేవతగా పూజించవలసిన స్త్రీల పట్ల మరింత పైశాచికంగా ప్రవర్తిస్తున్నాడు. ఇక ఇటీవల కాలంలో అయితే ఈ పైశాచికత్వం ఎంతలా ముదిరింది అంటే, స్త్రీ అనే పేరు వినపడితే చాలు, ఆమె చిన్న పాప, లేదా వృద్ధురాలు అయినా కూడా వదలని నీచమైన స్థితిలో మనం జీవిస్తున్నాం. 

ఇక మరికొందరు నీచులు ఏకంగా పసి పాపలపై కూడా తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే ప్రస్తుత సమాజ ఈ పరిస్థితులకు ఎక్కువ శాతం కారణం పిల్లలను సంక్రమంగా పెంచని తల్లితండ్రులే అంటున్నారు మానసిక నిపుణులు. నేడు ప్రతి తల్లి మరియు తండ్రులు కేవలం బిడ్డలను బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు పొందండి, మంచి వాళ్ళని చూసి పెళ్లి చేసుకుని, గొప్పగా ఒక ఇల్లు కట్టుకుని పిల్ల పాపలతో హాయిగా జీవించండి అని చెప్తున్నారు తప్ప, మనలో ఏ తల్లి, తండ్రి కూడా పిల్లలకు చిన్నవయసులోనే ప్రక్కవారికి మనదగ్గర ఉన్నదానితో కొంత షేర్ చేయమని చెప్పడం, అలానే మనలో ఎవరికైనా సమస్య వస్తే తనవంతుగా ముందుండి చేయదలచిన సాయం చేయమని పిల్లలకు నేర్పడం వంటి అంశాలు కనీసం చెప్పకపోవడం దురదృష్టం అంటున్నారు. ఇక అదే చిన్న వయసు నుండే వారికి తల్లిని ఎలా చూడాలి, అలానే అక్క చెల్లెళ్లను, రేపు పెరిగి పెద్ద అయి పెళ్లి అయితే భార్యను ఎలా చూడాలి వంటివి వారికి చెప్తూ ఉండాలంటున్నారు. మనిషి జీవితంలోని అతి ముఖ్యమైన ఈ అంశాలను ప్రతి తల్లి, తండ్రి తప్పకుండా తమ బిడ్డలకు చిన్న వయసునుండే నేర్పడం అలవాటు చేస్తే, తప్పకుండా రాబోయే రోజుల్లో సమాజంలో చాలావరకు మార్పులు చోటు చేసుకుంటాయని వారు అంటున్నారు. లేకపోతే రాబోయే రోజుల్లో సమాజంలో మనిషి మనుగడ మరింత నీచమైన స్థితికి దిగజారుతుందని వారు హెచ్చరిస్తున్నారు. దీన్నిబట్టి మొత్తంగా ఒక్కమాటలో చెప్పాలంటే, నేటి మనిషి నాది, నేను, నా కుటుంబం అనే భావన వదిలి, ఒకప్పటి కాలం నాటి మనిషి వలె మనది, మనము  అనుకుని జీవిస్తే తప్పకుండా మన అందరికి శుభం జరిగే అవకాశం ఉంటుంది.......!!


మరింత సమాచారం తెలుసుకోండి: