తెలంగాణలో బోనాలు జాతర ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే మన బోనాల జాతర ఎల్లలు దాటుతున్నాయి. ఖండాంతరాలలో కూడా మన సంస్కృతి సంప్రదాయాల్ని మరచిపోకుండా బోనాల పండగ జరుపుకుంటున్నారు. అమెరికా నార్త్ కరోలినా లోని లేక్ జోర్థాంన్ లో టిటిజిఎ ఆధ్వర్యంలో బోనాల జాతర ధూమ్ ధామ్ గా జరిగింది. తెలంగాణ సంప్రదాయ పండుగ బోనాలు ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు బోనాల వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నారు. అమెరికాలో ట్రయాంగిల్ తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ నార్త్ కరోలినా,టిటిజిఎ ఆధ్వర్యంలో బోనాల సంబరం అంబరాలంటింది. 



లష్కర్ బోనాలకు ఏమాత్రం తీసిపోకుండా అంగరంగ వైభవంగా నిర్వహించారు. నార్త్ కరోలినా లెగ్ జోర్డాన్ వీదిలో బోనాల శోభను సంతరించుకున్నాయి. పెద్ద సంఖ్యలో మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో తలపై బోనం పెట్టుకుని ఊరేగింపు నిర్వహించారు. చిన్నా, పెద్దా, ఆడా, మగా తారతమ్యం లేకుండా తీన్ మార్ డ్యాన్స్ లతో హోరెత్తించారు.



బోనాల వేడుకల్లో పోతురాజు వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాళ్ళకు గజ్జెలు కట్టుకుని చేతులో వీరతాళ్లు ధరించి వీధుల్లో నృత్యాలు చేస్తూ అందరిలో ఉత్సాహం నింపారు. ఇక తెలుగు వారి సంస్కృతి అమెరికన్ లను కూడా ఆకట్టుకుంటుంది. అక్కడి వారు కూడా మనవారితో కలిసి చిందులేశారు. అందంగా అలంకరించిన మండపంపై అమ్మవారి చిత్ర పటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనం సమర్పించారు.



పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు, పట్టువస్త్రాలు, తాంబూలం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్థిల్లాలని అమ్మవారిని ప్రార్థించారు. మహిళలు బోనాలు సమర్పించిన అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సినీ గీతాలను ఆలపించి ఎన్నారైలను మైమరిపించారు కళాకారులు. ఆ తర్వాత తెలంగాణ పసందైన వంటకాలను ఆస్వాదించారు. సప్త సముద్రాలు దాటి దేశం కాని దేశం వెళ్లిన తెలుగు వారు మన సంప్రదాయాల్ని మిస్సవుతున్నామనే భావన రాకుండా అందరితో కలిసి ఒకే కుటుంబంలా ప్రతి పండుగను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: