స్నేహానికన్న మిన్న లోకాన లేదంటారు.. ఆ స్నేహితుల మధ్య పొరపొచ్చాలు వస్తూనే ఉంటాయి. వాటిని పక్కకుపెట్టి స్నేహం కొనసాగించాలి.. ఈ విషయాన్ని తెలిపే ఓ అందమైన కథ ఇది..

సెలవు రోజున సరదాగా షికారుకెళ్లిన ఇద్దరు స్నేహితులకు ఏదో విషయంపై మాట తేడా వచ్చింది. వాదన పెరిగింది. దీంతో మొదటి స్నేహితుడు, రెండోవాడ్ని చెంపపై కొట్టాడు. దెబ్బతిన్న స్నేహితుడు అక్కడే వున్న ఇసుకపై 'ఈరోజు నా స్నేహితుడు నా చెంపపై కొట్టాడు' అని రాశాడు.


మరికొంత దూరం వెళ్లిన తర్వాత, ఇద్దరికీ దాహం వేసి ఓ మడుగు దగ్గర ఆగారు. చెంప దెబ్బ తిన్న వాడు ముందుగా నీళ్ల లోకి దిగాడు. అక్కడ ఊబి వుండడంతో అందులో కూరుకుపోతుండగా, మొదటి మిత్రుడు తన ప్యాంటు విప్పి, ఊబిలో కూరుకుపోతున్న స్నేహితునికి అందించి బయటికి లాగాడు.


ప్రాణాపాయం నుండి బయటపడ్డ రెండో స్నేహితుడు- 'ఈరోజు నా మిత్రుడు నన్ను ప్రమాదం నుంచి రక్షించాడు..' అని ఓ బండరాయిపై చెక్కాడు.మొదటి విషయాన్ని ఇసుకపై, రెండోదాన్ని రాతిపై ఎందుకు రాశావని మొదటి మిత్రుడు అడిగాడు. 'ఇసుక మీద రాసింది గాలి వీస్తే చెరిగిపోతుంది. స్నేహితుల పొరపాట్లు కూడా అలాంటివే. వాటిని మనసులో నిలుపుకోకూడదు.


అలాగే... సహాయం చేసినపుడు శాశ్వతంగా గుర్తుంచుకోవాలి. అందుకే రాయిపై రాశాను. ఈ అక్షరాలు ఎప్పటికీ వుంటాయి' అన్నాడట. అంటే - స్నేహితుల మధ్య వచ్చే తప్పిదాలు ఇసుక మీద రాతల్లాంటివి. ఎవరు తప్పు చేసినా క్షమించి మర్చిపోవాలి.


రాతిపై రాసిన రాతలా స్నేహితుడి సహాయాన్ని కలకాలం గుర్తుంచుకోవాలి. అందుకే అంటారు'ఇచ్చింది మర్చిపోవడం, పుచ్చుకున్నది జ్ఞాపకం ఉంచుకోవడమే స్నేహం' అని. స్నేహమనేది ఒకరోజు కాలక్షేపం కాదు... స్వచ్ఛమైన అనుబంధానికి చిరునామా. ఏ రక్త సంబంధం లేకపోయినా.. అంతకు మించి గాఢత ఉండేది స్నేహమే కదా.


మరింత సమాచారం తెలుసుకోండి: