మారుతున్న రోజులను బట్టి,వస్తున్న టెక్నాలజీని బట్టి అన్ని పనులు ఈజీగా అవుతున్నాయి.మనం కూర్చున్న చోటునుండే ఏదైన మనచేతిలోకి రప్పించుకోవచ్చూ.ఒకప్పుడు సినిమా టికెట్స్ కానివ్వండి,బస్సు,రైల్ ఇలా ఏదైన కావాలంటే గంటల తరబడి క్యూలో ఉండవలసి వచ్చేది,కాని ఇప్పుడున్న మొబైల్ యాప్‌లతో ఈ పనులన్నీ చాల తేలికగా అనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఏదైన పండగ వచ్చిందంటే రైల్వే రిజర్వేషన్‌ సీట్లకోసం పడిగాపులు పడినరోజులను తలుచుకుంటే నేటి తరానిది ఎంత సుఖమో అనిపిస్తుంది.ఇప్పటికి కొంతమందికి రైల్వే రిజర్వేషన్‌ కౌంటర్లు ఎక్కడున్నాయో కూడా తెలీదంటే అతిశయోక్తి కాదు.ఇక పండగ సీజన్లో కానివ్వండి,మరెప్పుడైన కానివ్వండి జనరల్‌ లేదంటే ప్లాట్‌ఫామ్‌ టికెట్లు కావాలంటే కాస్త కష్టమే అని చాలా మంది అనుకుంటారు.ఇప్పుడు ఆ కష్టం కూడా లేదంటోంది యుటీఎస్‌.సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్‌ అభివృద్ధి చేసిన ఈ యాప్‌ యుటీఎస్‌ ఆన్‌ మొబైల్‌.గుగూల్‌ ప్లే స్టోర్‌లో ఫ్రీగా లభించే ఈ యాప్‌తో ప్లాట్‌ఫామ్‌ టికెట్టును మాత్రమే కాదు సాధారణ టికెట్లను సైతం ఫోన్‌లోనే బుక్‌ చేసుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు చూద్దాం.



ముందుగా ఆండ్రాయిడ్‌ ఫోన్లు ఉన్నవారు గుగూల్‌ ప్లే స్టోర్‌ నుంచి యూటీఎస్‌ ఆన్‌ మొబైల్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.ఆ తర్వాత ప్రయాణికుడు తన ఫోన్‌ నెంబర్‌,పాస్‌వర్డ్‌, లింగం,పుట్టిన తేదీ ఎంటర్‌ చేయాలి.విజయవంతంగా నమోదైన తరువాత రైల్వేవాలెట్‌ ఆటోమేటిక్‌గా క్రియేట్‌ అవుతుంది.ఈ ఆర్‌వాలెట్‌లో నగదు జమ చేసుకుని కోరుకున్న చోటకు టికెట్‌,లేదంటే నగరంలో ఎంపిక చేసిన రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ అయినా ప్రయాణ టికెట్‌ అయినా పేపర్‌ లేకపోతే కష్టమనుకునేవారు పేపర్‌ టికెట్‌ను సైతం పొందవచ్చు.అదెలా అంటే ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుని తాము ఏ స్టేషన్‌లో రైలు ఎక్కుతామో అక్కడ ఉన్న ఏటీవీఎంలో బుకింగ్‌ ఐడీ,టికెట్‌ వివరాలు నమోదు చేయడం ద్వారా ప్రింట్‌ అవుట్‌ తీసుకోవచ్చు.ఇంతగా సౌలభ్యం వున్న దీనిలో చిన్న చిక్కువుంది.



అదేమిటంటే టికెట్‌ తీసుకున్న గంట లోపుగానే ప్రయాణం ప్రారంభించాలి.ప్రయాణికులు తమ ప్రయాణాలకోసం మాత్రమే కాదు ప్లాట్‌ఫామ్‌ టికెట్‌నూ ఆన్‌లైన్‌లో పేపర్‌ రహితంగా వినియోగించుకోవచ్చు. మొబైల్‌ జీపీఎస్‌ అనుసరించి దగ్గరలోని స్టేషన్‌లో ప్లాట్‌ఫామ్‌ టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు.అలాగని రైల్వేస్టేషన్‌ లోపల ఉండి టికెట్‌ బుక్‌ చేసుకోవడానికి ఈ యూటీఎస్‌ యాప్ అనుమతించదు.ఇక ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకుని క్యాన్సిల్‌ చేసుకుంటామంటే కుదురుతుందా అని డౌట్ వస్తే ప్లాట్‌ఫామ్‌ టికెట్లకు వీలుకాదు కానీ జర్నీ టికెట్‌లకు మాత్రం కొంతమేరకు సాధ్యమవుతుంది.అదీ పేపర్‌ టికెట్‌కు మాత్రమే. అదికూడా ఏటీవీఎంపై ప్రింటవుట్‌ తీసిన గంటలోపల క్యాన్సిలేషన్‌కు అనుమతిస్తారు.అయితే డబ్బులుమాత్రం ఆర్‌వాలెట్‌ లో మాత్రమే జమవుతాయి.చూసారుగా ఇక అతి సులువుగా ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ ప్రయాణాన్ని కొనసాగించండి..  


మరింత సమాచారం తెలుసుకోండి: