భారతీయ రైల్వేను  ప్రైవేటీకరించే దిశగా కేంద్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దేశం లో అతిపెద్ద ప్రజా రవాణా వ్యవస్థ అయిన భారత్ రైల్వే ను ప్రైవేటీకరించడాన్నివిపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి . రైల్వే లను ప్రైవేటీకరించాలన్న నిర్ణయం సరికాదని పేర్కొంటున్నాయి . దీనివల్ల సామాన్యుడి  పై భారం పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి . అయినా కేంద్ర ప్రభుత్వం మాత్రం రైల్వే ప్రైవేటీకరణ కు ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్లు స్పష్టం అవుతోంది .


  తేజాస్  రైలును ప్రవేశపెట్టిన అనంతరం తాజాగా మరో 150 రైళ్లను , 50 రైల్వేస్టేషన్ల ను  దశలవారీగా ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని కేంద్రం గురువారం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రైళ్లనే కాకుండా రైల్వే స్టేషన్లను కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి , కేంద్రం సొమ్ము చేసుకోవాలని చూడడం పట్ల విపక్ష నేతలు మండిపడుతున్నారు . భారతీయ రైల్వే సామాన్యులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా   , వస్తు రవాణా, ఇతరత్రా మార్గాల ద్వారా  భారీగానే ఆదాయాన్ని ఆర్జిస్తోంది , అటువంటప్పుడు రైళ్లను , రైల్వే స్టేషన్లను ప్రైవేటీకరించాల్సిన అవసరం ఏమొచ్చిందని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.


 రైళ్లను , రేల్వే స్టేషన్లను ప్రైవేటీకరించే అంశంపై   కేంద్ర ప్రభుత్వ  నిర్ణయం గురించి నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ , రైల్వే మంత్రిత్వ శాఖకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు .  ఈ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు సాధికార కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని వెల్లడించారు .  దేశవ్యాప్తంగా ఆరు  విమానాశ్రయాల ప్రైవేటీకరణ అనుభవాన్ని ప్రస్తావిస్తూ,  రైల్వేలోని ఇదే తరహాలో ప్రైవేటీకరణ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లేందుకు కార్యదర్శులతో కూడిన కమిటీ ఏర్పాటు అవుతుందని రైల్వే బోర్డు చైర్మన్ యాదవ్ రాసిన మరో  లేఖలో అమితాబ్ కాంత్ వెల్లడించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: