అప్పు చేయడం అంటే ఒకప్పుడు నామోషీ. కానీ ఆధునిక జీవితంలో 'అప్పు' అనే మాటకు అర్థాలు మారుతున్నాయి. ఇంటి అవసరాల దగ్గర నుంచి వ్యక్తిగత ఎదుగుదల వరకూ 'అప్పు' అనే అంశమే కీలకమవుతుంది. మరి అలాంటి 'అప్పు' పుట్టాలంటే ఏం చేయాలి. బ్యాంకింగ్‌ రంగాల్లో 'అప్పు' అంటే లోన్‌ అని అర్థం. బ్యాంకులు ఇచ్చే ఏ లోన్‌ అయినా మీకున్న క్రెడిట్‌ స్కోర్‌పైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రెడిట్‌ స్కోర్‌ విషయంలో మంచి మార్కులు లేకపోతే మీకు ఏ బ్యాంకులోనూ అప్పు పుట్టదన్నమాటే. పర్సనల్‌ లోన్‌, హౌసింగ్‌ లోన్‌, కారు లోన్‌ ఇలా ఏ లోన్‌ కావాలన్నా, ఇవ్వాలన్నా, క్రెడిట్‌ స్కోర్‌ బాగుండాలి. ఇకపోతే  ప్రతివారికి తక్కువ వడ్డీకి రుణం పొందాలని ఉంటుంది. ముఖ్యంగా బ్యాంకులు తమ వడ్డీ రేట్లను రెపో రేటుతో అనుసంధానించి, స్వల్ప వడ్డీకే అప్పులు ఇస్తుండటంతో కొత్తగా ఇల్లు, వాహనం కొనాలనుకునే వారి ఆశలు చిగురిస్తున్నాయి.


అప్పు పొందాలంటే.. క్రెడిట్  స్కోరు అధికంగా ఉండాలనే మాట ఎన్నో రోజులుగా వింటూ ఉన్నదే. అప్పు పొందేందుకు ఇది కీలకం కానీ,రుణాల వడ్డీ రేట్లు తగ్గుతుండటంతో తమ ఆదాయాన్ని కాపాడుకునేందుకు బ్యాంకులు ఇప్పుడు కొత్త మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తక్కువ క్రెడిట్ స్కోరు ఉన్నవారికి కాస్త అధిక వడ్డీని విధించే వ్యూహాన్ని పాటించేందుకు సిద్ధమవుతున్నాయి.  స్కోరు సాధారణంగా 300-900 పాయింట్ల వరకూ ఉంటుంది. ఇందులో 750కి మించి ఉంటే మంచి స్కోరన్నట్లు లెక్క. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఇలాంటి వారికి రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి. దీంతో పాటు వడ్డీ రేట్లలోనూ రాయితీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. ఉదాహరణకు ఈ విధానాన్ని తొలుత అమలు చేసిన బ్యాంక్  ఆఫ్ బరోడాను తీసుకుంటే..


ఇది అందిస్తోన్న గృహ రుణాలను రెపో రేటుకు అనుసంధానం చేసింది. ప్రస్తుతం ఉన్న రెపో రేటుపై 2.95 శాతం అధికంగా వడ్డీని వసూలు చేస్తోంది. అంటే బీఆర్ ఎల్ ఎల్ ఆర్ లెండిగ్ రేట్  8.10శాతం అన్నమాట. ఈ బ్యాంకు నుంచి గృహ రుణం తీసుకోవాలని భావించే వారి క్రెడిట్ స్కోరు 760 పాయింట్లకు మించి ఉంటే.. బీఆర్ ఎల్ ఎల్ ఆర్  8.10 శాతానికే రుణం అందుతుంది. 725-759 మధ్య ఉంటే 25 బేసిస్  పాయింట్లు అదనంగా అంటే.. 8.35శాతం వడ్డీని నిర్ణయించింది. ఇక 675-724 పాయింట్ల మధ్య ఉన్న వారికి బీఆర్ ఎల్ ఎల్ ఆర్ పై 1శాతం వరకూ అధిక వడ్డీని రిస్క్  ప్రీమియం  పేరుతో వసూలు చేస్తోంది. ఈ వడ్డీ రేట్లను అక్టోబరు 7 నుంచి అమల్లోకి తెచ్చింది కూడా. యూబీఐ, ఎస్ బీఐలూ ఈ రిస్క్  ప్రీమియాన్ని విధించేందుకు సిద్ధం అయ్యాయి. ఒకవేళ రుణం తీసుకున్న ఏడాది తర్వాత రుణగ్రహీత క్రెడిట్  స్కోరు పెరిగితే..



ఈ రిస్క్ ప్రీమియాన్ని తగ్గించే అవకాశం ఉంది. అలాగే.. స్కోరు తగ్గితే..ఆ మేరకు వడ్డీ పెరుగుతుంది. కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఇప్పటికే ఈ విధానాన్ని పాటిస్తున్నా..అందు లో పారదర్శకత లేకపోవడం పెద్ద లోపం. సాధారణంగా రుణం రావాలంటే.. 700 వరకూ క్రెడిట్  స్కోరు ఉంటే చాలనేది బ్యాంకుల మాట. ఇప్పుడు.. వడ్డీ రేట్లను క్రెడిట్  స్కోరుతో ముడిపెడుతున్న బ్యాంకులు.. తక్కువ స్కోరు ఉన్న వారికి రుణాలు ఇస్తాయా? అనేది కొత్త సందేహం. తక్కువ స్కోరు ఉన్నవారికి రుణాలు లభించడంలో ఇబ్బంది తో పాటు, వడ్డీ రేటు అధికంగా ఉండబోతోందనేది మాత్రం స్పష్టమవుతోంది. ఇక 760 పాయింట్లకు మించి సిబిల్  స్కోరు ఉన్నవారికి తక్కువ వడ్డీ ఫలితాలు అందబోతున్నా యని చెప్పొచ్చు. ఇన్నాళ్లూ క్రమశిక్షణతో రుణాలను, కార్డు బిల్లులను చెల్లించిన వారికి ఇది శుభవార్తే.  ఇకపోతే ముందు ముందు మరికొన్ని బ్యాంకులూ ఈ పద్ధతి పాటించేందుకు అవకాశం ఉందని అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: