2018 తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన రెండు స్థానాల్లో ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలోని స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ఒక‌టి. ఇక్క‌డ నుంచి 2009, 2014, 2018 ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా మూడుసార్లు టీడీపీ నుంచి గెలిచిన సండ్ర వెంకట వీర‌య్య హ్యాట్రిక్ కొట్టారు. గ‌తంలో పాలేరు నుంచి సీపీఎం త‌ర‌పున గెలిచిన సండ్ర మొత్తంగా నాలుగుసార్లు గెలిచారు. గ‌త ద‌శాబ్దంన్న‌ర కాలంగా స‌త్తుప‌ల్లిని త‌న అడ్డాగా చేసుకుని తిరుగులేని వ‌రుస విజ‌యాల‌తో దూసుకువెళుతున్నారు. తెలంగాణ‌లో తెలుగుదేశం అత్యంత సంక్లిష్ట ప‌రిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా సండ్ర ఇక్క‌డ 2014, 2018 ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ఆయ‌న వ్య‌క్తిగ‌త ఇమేజ్‌ను కూడా గుర్తు చేస్తుంది.

 

గ‌త ఎన్నిక‌ల్లో 18 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయ‌న పార్టీ ఓడిపోయేస‌రికి కొద్ది కాలానికే పార్టీకి దూర‌మై టీఆర్ఎస్‌లోకి జంప్ చేసేశారు. పార్టీ మారిన‌ప్పుడు ఎస్సీ + సీనియార్టీ హోదాలో ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌న్న ఆశ ఉన్నా కేసీఆర్ మంత్రి ప‌ద‌వి మాత్రం ఇవ్వ‌లేదు. ఇక పార్టీ మారినా సండ్ర నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయ ఆధిప‌త్యం శాసిస్తూ కొన్నేళ్లుగా త‌న వెంటే న‌డుస్తోన్న సామాజిక వ‌ర్గాల‌ను సైతం త‌న వెంట తిప్పుకున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు 365 రోజులూ అందుబాటులో ఉండ‌డం సండ్ర‌కు తిరుగులేని బ్ర‌హ్మాస్త్రం. వివాద‌ర‌హితుడు... సౌమ్య‌శీలి అన్న బిరుదులు కూడా ఆయ‌న‌కు క‌లిసి రానున్నాయి.

 

ఇక పార్టీ మారాక సండ్ర కొన్ని ప‌నుల‌కు నిధులు మంజూరు చేయించుకోవ‌డంలో స‌క్సెస్ అయ్యారు. సింగ‌రేణికి సంబంధించి మిన‌ర‌ల్ ఫండ్స్ మంజూరు అయ్యాయి. అలాగే స‌త్తుప‌ల్లి మున్సిపాల్టీకి రు. 40 కోట్లు పైప్‌లైన్లు, రోడ్లు, వాట‌ర్ ప‌నుల కోసం రాబ‌ట్టారు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న స‌మ‌స్య‌ల‌ను ఆయ‌న ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించేందుక త‌న వంతుగా కృషి చేస్తున్నారు. స‌మ‌స్య ప‌రిష్కారం చేయ‌డానికి గ‌వ‌ర్న‌మెంట్ వ‌ద్ద‌కు ప్ర‌తిపాద‌న‌లు తీసుకువెళ్ల‌డం.. క‌లెర్ట‌ర్‌తో మాట్లాడి కొన్నింటిని ప‌రిష్క‌రించ‌డంలో ముందుంటున్నారు. ఇటీవ‌ల లాక్‌డౌన్ నేప‌థ్యంలో రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల‌కు ఇబ్బంది లేకుండా చేశారు.

 

రాజ‌కీయంగా తిరుగులేని బ‌లం :
ఇక రాజ‌కీయంగా కూడా సండ్ర‌కు ఇప్ప‌ట్లో ఎదురు లేదు. నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఐదు మండ‌లాల్లో ఎంపీపీలు, జ‌డ్పీటీసీలు అన్ని టీఆర్ఎస్ ఖాతాలోనే ప‌డ్డాయి. ఇక స‌త్తుప‌ల్లి మున్సిపాల్టీలో ఉన్న 23 వార్డులు టీఆర్ఎస్ ఖాతాలోనే ప‌డ్డాయి. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో కొన్ని స‌మ‌స్య‌లు కూడా ఉన్నాయి. స‌త్తుప‌ల్లి - పెనుబ‌ల్లి రోడ్డును డ‌బుల్ లైన్‌గా మార్చి.. సెంట్ర‌ల్ డివైడైర్లు ఏర్పాటు చేయాల‌ని ఆయ‌న ప్ర‌తిపాద‌న‌లు పెట్టినా అవి అలాగే ఉన్నాయి. ఇక మొత్తంగా రు. 150 కోట్ల ప‌నుల‌కు ఆయ‌న ప్ర‌తిపాద‌న‌లు స‌మ‌ర్పించినా ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదు. ఇక నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్షం అనేదే లేక‌పోవ‌డం కూడా సండ్రకు క‌లిసి రానుంది. కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా ఉన్న సంభాని చంద్ర‌శేఖ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు.

 

నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి వారే బ‌ల‌మైన నేత‌లు....
స‌త్తుప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికే చెందిన మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసుల‌రెడ్డి, సెంట్ర‌ల్ బ్యాంక్ మాజీ చైర్మ‌న్ మువ్వా విజ‌య్‌బాబు ఉన్నా ఈ వ‌ర్గాలు అన్ని ఇప్పుడు స్త‌బ్దుగా ఉన్నాయి. ఇక డీసీసీబీ మాజీ చైర్మ‌న్ విజ‌య్‌బాబుకు, సండ్ర‌కు మున్సిప‌ల్ ఎన్నిక‌ల వ‌ర‌కు సంబంధాలు బాగానే ఉన్నా డీసీసీబీ చైర్మ‌న్ విష‌యంలో త‌న‌కు ప‌ద‌వి వ‌చ్చేలా సండ్ర చేయలేద‌న్న అసంతృప్తి విజ‌య్‌బాబుకు ఉంద‌న్న టాక్ ఉంది. 

 

బ‌లాలు (+) :
- వ్య‌క్తిత్వం, వివాద ర‌హితుడు అన్న పేరు
- దశాబ్దంన్న‌ర కాలంగా స‌త్తుప‌ల్లిలో తిరుగులేని విజ‌యాలు
- పార్టీ మారాక కోట్లాది రూపాయ‌ల‌తో ప‌నులు

 

బ‌ల‌హీన‌త‌లు (-) : 
- ప్ర‌స్తుత ప‌వ‌ర్ పాలిటిక్స్‌లో అన్నింటికి మంత్రి అజ‌య్‌పై ఆధార ప‌డాల్సిన ప‌రిస్థితి...
- పార్టీ మారిన‌ప్పుడు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌న్న హామీ ఉన్నా రాలేద‌న్న నిరాశ‌
- కేడ‌ర్ ప‌రంగా మొత్తం ఆయ‌నే చూసుకోవాల్సిన ప‌రిస్థితి... ప‌క్క‌న స‌మ‌ర్థులు అయిన నేత‌లు లేక‌పోవ‌డం

 

మరింత సమాచారం తెలుసుకోండి: