టీడీపీ ఎమ్మెల్యేల్లో సైలెంట్ సెన్షేషన్ ఎవరైనా ఉన్నారంటే అది..తూర్పు గోదావరి జిల్లా మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావునే. తక్కువ మాటలు ఎక్కువ పని చేసే నాయకుల్లో ఈయన ఒకరు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన వేగుళ్ల.. 2004 ఎన్నికల్లో ఆలమూరు(నియోజకవర్గాల పునర్విభజనకు ముందు) నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2005 లో వైఎస్సార్ ప్రభంజనం ఉన్న, మండపేట మున్సిపాలిటీని టీడీపీకి దక్కేలా చేసి, చైర్మన్ పదవి దక్కించుకున్నారు.

 

ఇక 2009 , 2014 , 2019 ఎన్నికల్లో వరుసగా టీడీపీ తరుపున పోటీ చేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. కమ్మ సామాజికవర్గానికి చెందిన ఈయనకు మండపేటలో తిరుగులేని బలం ఉంది. అందుకే 2019 లో వైసీపీ తరుపున పిల్లి సుభాష్ చంద్రబోస్ పోటీ చేసినా, వేగుళ్ల ముందు నిలబడలేకపోయారు. దాదాపు 10 వేల పైనే మెజారిటీతో ఓటమి పాలయ్యారు.

 

ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న వేగుళ్ల, సైలెంట్ గా నియోజకవర్గంలో పని చేసుకుంటున్నారు. వివాదరహితుడిగా ఉన్న ఈయన, అన్ని వర్గాల ప్రజలని కలుపుని వెళుతున్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో నియోజకవర్గంలో పేద ప్రజలని ఆదుకుంటున్నారు. ఇక అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఏవైనా అక్రమాలకు పాల్పడితే వాటిని ఎత్తి చూపిస్తున్నారు.

 

వైసీపీ తరుపున మండపేటకు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ ఇటీవల ఆయన్ని రాజ్యసభకు ఎంపిక చేసిన నేపథ్యంలో, మండపేటలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపు బాధ్యతని, తోట త్రిమూర్తులుకు అప్పజెప్పారు. ఇక తోట, మొన్న ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి  టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయి, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చేసారు.

 

అయితే తోట వైసీపీ గెలుపు బాధ్యతలని తీసుకున్నా, ఇక్కడ వేగుళ్ళకు చెక్ పెట్టడం కష్టమని తెలుస్తోంది. ఇక్కడున్న మూడు మండలాలు మండపేట, రాయవరం, కపిలేశ్వరపురంలలో టీడీపీకి మంచి బలం ఉంది. ఇక మండపేట మున్సిపాలిటీలో కూడా టీడీపీకే ఎడ్జ్ ఉంది. కాకపోతే వైసీపీకి అధికారంలో ఉండటం అడ్వాంటేజ్.

 

అటు సామాజికవర్గాల పరంగా చూసుకున్న వేగుళ్ళకు మంచి సపోర్ట్ ఉంది. కమ్మ, బీసీ లలో వేగుళ్ళకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తోట మండపేట రావడం వల్ల పిల్లి సుభాష్ సామాజికవర్గమైన శెట్టిబలిజలు కూడా వేగుళ్ళకు సపోర్ట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో కాపులు వైసీపీకి ఎక్కువ సపోర్ట్ ఇస్తున్నారు. ఇక మొత్తం మీద చూసుకున్నట్లైతే మండపేటలో వేగుళ్ళకు తిరుగులేదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: