తూర్పు గోదావరి జిల్లాలో బాగా పవర్‌ఫుల్ ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ద్వారంపూడి, వైఎస్సార్‌తో సన్నిహితంగా ఉండేవారు. ఆ సాన్నిహిత్యంతోనే 2009లో కాకినాడ సిటీ సీటు దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, ప్రజారాజ్యం అభ్యర్ధులని చిత్తుగా ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 

ఇక 2014 ఎన్నికలోచ్చేసరికి ద్వారంపూడికి ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ సీనియర్ నేత వనమాడి వెంకటేశ్వరరావు చేతిలో చిత్తుగా ఓడిపోయారు. ఓడిపోయిన వెనక్కి తగ్గకుండా నియోజకవర్గంలో పనిచేసుకున్నారు. దీంతో 2019 ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించారు. వనమాడిపై 14 వేల మెజారిటీతో గెలిచారు. పైగా వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో ద్వారంపూడి కాకినాడలో తిరుగులేని శక్తిగా ఎదిగారు. ఇక్కడ సామాజికవర్గాల పరంగా రాజకీయం చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

ఇటీవల ఈయన, పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇక అప్పుడు జనసేన నేతలు, కాపులు ద్వారంపూడి ఇంటి ముందు ధర్నా చేయడానికి వెళ్లారు. అక్కడ వారిపై ద్వారంపూడి అనుచరులు దాడి చేశారు. అయితే వారు కూడా కాపులే కావడం గమనార్హం. ద్వారంపూడి నియోజకవర్గంలో కాపులని రెండు వర్గాలుగా చీల్చేసి రాజకీయం చేస్తున్నారని అంటున్నారు. ఓ వర్గం కాపులు ద్వారంపూడికి అండగా ఉన్నారు.

 

ఇక నియోజకవర్గం సిటీ పరిధిలోనే ఉంది కాబట్టి, ఇక్కడ అభివృద్ది ఎప్పటి నుంచో జరిగింది. గత ఐదేళ్లలో మంచి అభివృద్ధి జరిగిందని చెబుతున్నారు. అటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు బాగానే అందుతున్నాయి. అలాగే లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలని ద్వారంపూడి ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు, కాకపోతే ఈయన రైస్ మిల్లర్స్ బిజినెస్‌లో బాగానే లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 

అలాగే పేదలకు ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీలో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని టాక్. ఉప్పుటేరులో పనికిరాని భూములు ఇచ్చేందుకు చూస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. నియోజకవర్గంలో పేకాట కూడా బాగా జరుగుతుందని అంటున్నారు. ఇక టీడీపీ, జనసేనలని వీక్ చేయడంలో ద్వారంపూడి సక్సెస్ అయ్యారనే చెప్పుకోవచ్చు. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాకినాడ కార్పొరేషన్ సులువుగా వైసీపీ ఖాతాలో పడే అవకాశముంది. మొత్తానికైతే కాకినాడ సిటీలో  ద్వారంపూడి రాజకీయం మామూలుగా లేదంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: