కొండేటి చిట్టిబాబు..విద్యార్థి దశ నుంచే పలు సమస్యలపై పోరాటం చేస్తూ వచ్చిన నాయకుడు. కాంగ్రెస్ లో రాజకీయ జీవితం మొదలు పెట్టి అంచెలంచలుగా ఎదిగిన చిట్టిబాబు, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. 2014 లో తొలిసారి తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నుంచి పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో చిట్టిబాబు, టీడీపీ అభ్యర్థి పులపర్తి నారాయణ మూర్తి చేతిలో ఓటమి పాలయ్యారు.

 

ఓడిపోయినా సరే నియోజకవర్గంలోనే పని చేసుకుంటూ వచ్చారు. ప్రతిపక్షంలో ఉంటూ పోరాటాలు చేస్తూ, ప్రజలకు అండగా నిలిచారు. అలా చేయడం వల్లే  2019 ఎన్నికల్లో ఉహించని విధంగా టీడీపీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబుపై దాదాపు 31 వేల పైనే మెజారిటీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన చిట్టిబాబు, నియోజకవర్గంలో ప్రజల సమస్యలని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు.

 

ముందు నుంచి యాక్టివ్ గా ఉంటూ, నియోజకవర్గంలో పని చేస్తున్నారు. అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు. ఇంకా నియోజకవర్గంలో కొత్తగా సిమెంట్ రోడ్లు, వంతెనలు, డ్రైనేజ్ నిర్మాణాలకు శంఖుస్థాపనలు చేసారు. ఇక ప్రస్తుతం కరోనా పట్ల ప్రజలని అప్రమత్తం చేస్తూనే, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలని ఆదుకుంటున్నారు. నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లు, హోమియో మందులు ఇస్తున్నారు. 

 

అయితే చిట్టిబాబుకు, తనయుడు వికాస్ వల్ల కాస్త బ్యాడ్ నేమ్ వస్తుంది. మొన్న ఆ మధ్య వికాస్ పుట్టినరోజు సందర్భంగా అంబాజీపేట చౌరస్తాలో భారీగా వేడుకలు ఏర్పాట్లు చేసి దాదాపు రెండు గంటలపాటు ట్రాఫిక్ జామ్ చేసి ప్రజలకు నరకం చూపించారు. ఆ ఘటన వల్ల చిట్టిబాబుకు కాస్త నెగిటివ్ అయింది. ఇక టీడీపీకి విషయానికొస్తే ఇక్కడ టీడీపీకి సరైన నాయకత్వం లేదు. మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన స్టాలిన్ బాబు, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంన్నారని చెప్పి, టీడీపీ అధిష్టానం స్టాలిన్ బాబుని సస్పెండ్ చేసింది. దీంతో ఇక్కడ టీడీపీని నడిపించే నాయకుడు లేకుండా పోయాడు. ఈ క్రమంలోనే స్థానికంగా బలంగా ఉన్న టీడీపీ నేతలని, చిట్టిబాబు తమ పార్టీలోకి తీసేసుకుంటున్నారు.

 

ఇక స్థానిక సంస్థల ఎన్నికలు విషయానికొస్తే...నియోజకవర్గంలో దాదాపు 70 శాతం పైనే స్థానాలు వైసీపీ ఖాతాలో పడే అవకాశముంది. నియోజకవర్గంలో అంబాజీపేట, పి గన్నవరం, ఐనవల్లి, మామిడికుదురు(పార్ట్) మండలాలు ఉన్నాయి. దాదాపు అన్ని మండలాల్లో వైసీపీ బలంగా ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని నడిపించేందుకు చంద్రబాబు, పి.గన్నవరం నియోజకవర్గానికి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యానికి బాధ్యతలు అప్పగించారు. ఆయనే టీడీపీ అభ్యర్ధులని బరిలో నిలిపారు. కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్థులు, వైసీపీకి గట్టి పోటీనిస్తున్నారు. కాకపోతే ఎంత పోటీ ఉన్న విజయం మాత్రం వైసీపీకే దక్కే అవకాశముంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: