గత ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో అతి చిన్న వయసు ఉన్న యువ నాయకులు  బాగానే ఉన్నారు. మొదటిసారి పోటీ చేసి వారు టీడీపీ సీనియర్ నేతలని మట్టికరిపించారు. అలా తొలిసారి పోటీ చేసి అద్భుత విజయం అందుకున్న వారిలో అన్నంరెడ్డి అదీప్ రాజ్ ఒకరు. కాంగ్రెస్ లో యువనాయకుడుగా ఎదిగిన అదీప్...తర్వాత వైసీపీలోకి వచ్చేసారు. ఇక అదీప్ మీద నమ్మకంతో జగన్..పెందుర్తి ఇన్ ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.

 

అయితే అప్పటికే టీడీపీ ఎమ్మెల్యేగా సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఉన్నారు. పైగా టీడీపీ అధికారంలో ఉండటంతో బండారుకు ఎదురులేకుండా పోయింది. అయినా సరే అదీప్ కష్టపడి నియోజకవర్గంలో పని చేసారు. బండారు ప్రజా వ్యతిరేక పనులపై పోరాడారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో అదీప్ కు వైసీపీ టికెట్ ఇచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న అదీప్, బండారుపై అదిరిపోయే విజయం సాధించారు.

 

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అదీప్...నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉంటున్నారు. ఎప్పటికప్పుడు నియోజకవర్గంలో పర్యటిస్తూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో పేదలకు అండగా ఉంటూ, వారికి నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ముందు గ్రామాల్లో సిమెంట్ రోడ్లకు శంఖుస్థాపన చేసారు.

 

అయితే ఇక్కడ అదీప్ కు, టీడీపీ నేత బండారు ఫ్యామిలీనే ప్లస్ పాయింట్. గత ఐదేళ్లు వారి అరాచకాలకు ప్రజలు విసుగెత్తి పోవడం వల్లే, అదీప్ కు ప్లస్ అయింది. ముఖ్యంగా బండారు తనయుడు అప్పలనాయుడు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం, పలు వివాదాల్లో చిక్కుకోవడం వల్ల బండారుకు పెద్ద తలనొప్పి ఎదురైంది. ఇప్పటికీ కూడా బండారు తనయుడుని వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇక నియోజకవర్గంలో బండారు మీద మైనస్ ఉండటమే, అదీప్ కు ప్లస్. 

 

అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే.. మెజారిటీ స్థానాలు వైసీపీనే కైవసం చేసుకోవడం ఖాయం. నియోజకవర్గంలో పెదగంట్యాడ, పరవాడ, సబ్బవరం, పెందుర్తి మండలాలు ఉన్నాయి. నాలుగు చోట్ల వైసీపీకి ప్లస్ ఉంది. అయితే కొన్ని కీలక స్థానాల్లో టీడీపీ పోటీ ఇస్తుంది. ఇక పెదగంట్యాడలో కొన్ని ప్రాంతాలు గాజువాక మున్సిపాలిటీలో ఉన్నాయి. గాజువాక మున్సిపాలిటీలో కూడా వైసీపీకే ఎడ్జ్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: