సాధారణంగా ఒకే నియోజకవర్గంలో ఒకే పార్టీ నుండి పలువురు నేతలు ఆధిక్యం కోసం పోటీ పడుతుంటారు. ఇక ఆధిపత్య పోరు వల్ల పార్టీకే డ్యామేజ్ జరిగే అవకాశముంది. అలా కాకుండా నేతలెవరూ పోటీలో లేనప్పుడు మొత్తం హవా అంతా ఒక్క నాయకుడుదే ఉంటుంది. ఇలా సోలోగా దూసుకెళుతున్న వైసీపీ ఎమ్మెల్యేల్లో చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ముందు వరుసలో ఉన్నారు.

 

కాంగ్రెస్ లో రాజకీయ జీవితం మొదలు పెట్టిన ఈయన 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కలిదిండి సూర్య నాగ సన్యాసి రాజు చేతిలో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఇక తర్వాత వైసీపీలోకి వచ్చిన ధర్మశ్రీ....2014 ఎన్నికల్లో అదే స్థానం నుంచి పోటీ చేసి, కేవలం 600 ఓట్ల తేడాతో మళ్ళీ సన్యాసి రాజు చేతిలోనే ఓడిపోయారు.

 

అయితే రెండు సార్లు ఓటమి పాలవ్వడంతో కసిగా పనిచేసుకుంటూ వచ్చిన ధర్మశ్రీ, 2019 ఎన్నికల్లో 27 వేల మెజారిటీతో రాజుని ఓడించారు. పైగా వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో ధర్మశ్రీ నియోజకవర్గంలో దూకుడుగా పనిచేసుకుంటున్నారు. పేద ప్రజలకు అండగా ఉంటున్నారు. ఇక మంచి మాటకారి అయిన ధర్మశ్రీ అటు అసెంబ్లీలోనైనా , ఇటు మీడియా ముందైనా ప్రతిపక్ష టీడీపీకి గట్టి కౌంటర్లే ఇస్తున్నారు.

 

ఈ నియోజకవర్గంలో వైసీపీలో ధర్మశ్రీ తప్ప, మరో పెద్ద నాయకుడు లేడు. దీంతో ఇక్కడ ధర్మశ్రీకి తిరుగులేకుండా ఉంది. మొత్తం వన్ మ్యాన్ షో చేసున్నారు. ఇదే సమయంలో ఇక్కడ టీడీపీలో లుకలుకలున్నాయి. మొన్న ఎన్నికల ముందే సన్యాసి రాజుకు టికెట్ ఇవ్వొద్దని, నియోజకవర్గంలో ఉన్న కాపు టీడీపీ నేతలు బాబుకు చెప్పారు. కానీ బాబు మాత్రం రాజుకే టికెట్ ఇచ్చారు. దీంతో నియోజకవర్గంలో ఉన్న మెజారిటీ ఉన్న కాపులు ధర్మశ్రీకి సపోర్ట్ ఇచ్చారు. ఆ దెబ్బకు రాజు దారుణంగా ఓడిపోయారు. ఇక రాబోయే ఎన్నికల్లోనైనా కాపుల్లో ఎవరొకరికి టికెట్ ఇవ్వకపోతే, ఇక్కడ టీడీపీ పరిస్థితి గోవిందా.

 

అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే...నియోజకవర్గంలో టీడీపీ వీక్ గా ఉంది కాబట్టి, వైసీపీకి 70 శాతం పైనే స్థానాలు దక్కే అవకాశముంది. నియోజకవర్గంలో చోడవరం, బుచ్చయ్యపేట, రావికమతం, రోలుగుంట మండలాలు ఉన్నాయి. నాలుగు మండలాల్లో వైసీపీ బలంగానే ఉంది. కాబట్టి చోడవరంలో ధర్మశ్రీకి తిరుగులేదని చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: