ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివంగత వైఎస్సార్‌కు వీర విధేయులైన నేతలు చాలా మందే ఉన్నారు. అయితే వైఎస్సార్ మరణం తర్వాత వారిలో చాలామంది జగన్‌కు అభిమానులుగా మారారు. అలా వైఎస్ జగన్‌ని అభిమానించే నాయకుల్లో సీనియర్ ఎమ్మెల్యే పీడిక రాజన్న దొర ఒకరు. ఈయనకు జగన్ ఎంత అంటే అంతే. పైగా ఎవరితో ప్రమేయం లేకుండా జగన్‌తో ప్రత్యక్షంగా మాట్లాడే చనువు రాజన్నకు ఉంది.

 

అసలు రాజన్న రాజకీయ జీవితం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో 2004 ఎన్నికల్లో ఈయన విజయనగరం జిల్లా సాలూరు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2009 ఎన్నికల్లో తిరిగి అదే స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కానీ అనూహ్యంగా వైఎస్సార్ మరణించడం, జగన్ వైసీపీ పెట్టడంతో అందులోకి వచ్చారు.

 

2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అప్పుడు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టిన కూడా రాజన్న మాత్రం జగన్‌ని వదల్లేదు. వైసీపీలోనే కొనసాగి 2019 ఎన్నికల్లో మళ్ళీ సాలూరు బరిలో సూపర్ విక్టరీ కొట్టారు. అయితే జగన్ ఆప్తుడుగా ఉండటంతో మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ అనూహ్యంగా బొత్స సత్యనారాయణ, రాజన్నకు పదవి రాకుండా అడ్డుకున్నారు. గిరిజన మంత్రిగా జూనియర్ అయిన పుష్పశ్రీవాణికి దక్కేలా చేశారు.

 

మంత్రి పదవి రాకపోయిన రాజన్న ప్రజలకు సేవ చేయడంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ...సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అయితే రాజన్నకు వచ్చే విడతలో మంత్రి పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. జగన్ అండ పుష్కలంగా ఉండటంతో ఈసారి పదవి రావడం పక్కా అని అర్ధమవుతుంది.

 

అటు టీడీపీ విషయానికొస్తే సీనియర్ నేత రాజేంద్ర ప్రతాప్ భాంజ్...నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్‌గా లేరు. ప్రస్తుతానికైతే ఇక్కడ టీడీపీ వీక్‌గానే ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలో పడటం ఖాయం. నియోజకవర్గంలో సాలూరు, పాచిపెంట, మెంటాడ, మక్కువ మండలాలు ఉన్నాయి. నాలుగు మండలాల్లో వైసీపీ బలంగానే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: