విజయనగరం జిల్లా శృంగవరపుకోట...తెలుగుదేశం పార్టీ కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి జరిగిన ఎన్నికల్లో ఎక్కువ సార్లు టీడీపీనే గెలిచింది. 1983,1985, 1989, 1994, 1999, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. ఒక్క 2004లో కాంగ్రెస్ పార్టీ స్వల్ప మెజారిటీతో గెలిచింది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ గాలిలో వైసీపీ అభ్యర్ధి కడుబండి శ్రీనివాసరావు 11 వేల మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి కోళ్ళ లలితకుమారిపై విజయం సాధించారు.

 

ఎన్‌ఆర్‌ఐ అయిన కడుబండి...మంత్రి బొత్స సత్యనారాయణకు వీర విధేయుడు. ఆయన చొరవతోనే కడుబండికి 2014 ఎన్నికల్లో గజపతినగరం వైసీపీ టికెట్ వచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఇక 2019 ఎన్నికల్లో టికెట్ దక్కదు అనే నేపథ్యంలో బొత్స ప్రమేయంతో శృంగవరపుకోట టికెట్ వచ్చేలా చేశారు. రాష్ట్రమంతా జగన్ గాలి ఉండటం వల్ల టీడీపీ కంచుకోటగా ఉన్న ఎస్ కోటలో కడుబండి విజయం సాధించగలిగారు.

 

అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన కడుబండి నియోజకవర్గంలో అందుబాటులో ఉండటం గగనమని తెలుస్తోంది. ఈయన ఎక్కువగా గజపతినగరంలోనే ఎక్కువ ఉంటున్నారని, ప్రజలకు అందుబాటులో ఉండటం చాలా తక్కువ అని టాక్. అటు అభివృద్ధి పనుల విషయంలో కూడా చొరవ చూపడం లేదని తెలుస్తోంది. ఏ విధంగా చూసిన ఇక్కడ కడుబండిపై ఎక్కువ నెగిటివ్‌గానే ఉందని అంటున్నారు. కాకపోతే టీడీపీ వీక్‌గా ఉండటం, బొత్స అండ ఉండటం కడుబండికి కలిసొచ్చే అంశం. కానీ వచ్చే ఎన్నికల్లో ఈయనకు సీటు దక్కడం కష్టమని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి కుమార్తె శోభా స్వాతీరాణి వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకోవడానికి చూస్తున్నారు.

 

ఇక్కడ టీడీపీ తరుపున కోళ్ళ లలితకుమారి ఉన్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, నియోజకవర్గంలో పెద్దగా యాక్టివ్‌గా ఉన్న దాఖలాలు లేవు. కాకపోతే టీడీపీ రూట్ లెవెల్‌లో కూడా బలంగా ఉంది. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా పుంజుకునే అవకాశముంది. అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే... వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీకే మెజారిటీ స్థానాలు దక్కించుకునే అవకాశముంది. అలాగే టీడీపీ కూడా కొన్ని చోట్ల గట్టి పోటీ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: