చంద్రబాబు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు... సత్కరించబడిన ఓ కుర్రాడు 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచి, అదే చంద్రబాబుని అసెంబ్లీలో ఓ ఆటాడుకున్న విషయం ఎవరు మరిచిపోయి ఉండరు. తొలిసారి ఎమ్మెల్యే అయినా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చంద్రబాబుపై కాస్త ఘాటుగానే విమర్శించారు. అలా చంద్రబాబు చేతుల మీదుగా అవార్డు తీసుకుని, ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేస్తున్న వైసీపీ ఎమ్మెల్యే ఎవరో కాదు. శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పల రాజు. 1995 పదవతరగతి ఫలితాల్లో అప్పలరాజు రాష్ట్రస్థాయిలో మంచి ప్రతిభ కనబరిచారు. దీంతో సీఎం హోదాలో బాబు, అప్పలరాజుని సత్కరించారు.

 

అయితే 2019 ఎన్నికల్లో అప్పలరాజు పలాస బరిలో నిల్చుని టీడీపీ అభ్యర్ధి గౌతు శిరీషపై అదిరిపోయే మెజారిటీతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన అప్పలరాజు...ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. కాకపోతే పెద్దగా రాజకీయ అనుభవం లేకపోవడం వల్ల కాస్త తడుబడుతున్నట్లే కనిపిస్తోంది. అయితే అసెంబ్లీలో మాత్రం అదిరిపోయే స్పీచ్‌లు ఇస్తూ...ప్రతిపక్ష టీడీపీకి కౌంటర్లు ఇస్తున్నారు.

 

ఒకానొక సమయంలో తనకు అవార్డు ఇచ్చిన చంద్రబాబుపైనే ఘాటు విమర్శలు చేశారు. బాబుకు మానసిక వ్యాధి వచ్చిందని దారుణంగా మాట్లాడారు. ఇక ఈ విమర్శలతో అప్పలరాజు మీద కొంచెం నెగిటివ్ వచ్చింది. తొలిసారి ఎమ్మెల్యే అయ్యి ఈ విధంగా దారుణంగా మాట్లాడటం సరికాదని విమర్శలు కూడా వచ్చాయి. ప్రజలకు మేలు చేసే విషయం కంటే, చంద్రబాబుపై విమర్శలు చేసే విషయంలో అప్పలరాజు దూకుడుగా ఉన్నారని కామెంట్లు కూడా వచ్చాయి. అటు పలాసలో టీడీపీకి అండగా గౌతు శిరీష ఉన్నారు. జిల్లా అధ్యక్షురాలుగా ఉన్నా ఆమె...దూకుడుగా పని చేస్తున్నారు.

 

పైగా తన ఫ్యామిలీకి ఇక్కడ మంచి పట్టు ఉంది. కాకపోతే జగన్ గాలి వల్ల పరాజయం పాలయ్యారు. దీంతో శిరీష కష్టపడి పనిచేస్తూ..పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళుతున్నారు. అటు స్థానిక సంస్థల ఎన్నికల విషయానికొస్తే....ఎలాగో వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, ఆ పార్టీకే మెజారిటీ స్థానాలు దక్కుతాయి. నియోజకవర్గంలో పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాలు ఉన్నాయి. టీడీపీ కొన్ని స్థానాల్లో గట్టి పోటీ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: