సామాజికసేవ చేస్తూ  రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారిలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి కూడా ఒకరు. అయితే రాజకీయాల్లో సక్సెస్ అయిన కళావతి మాత్రం సామాజిక సేవ చేయడం ఆపలేదు. కష్టం అంటూ తన దగ్గరకు వచ్చిన వారికి ఎప్పుడు అండగానే ఉంటున్నారు. అందుకనే వరుసగా పాలకొండ నుంచి విజయం సాధించగలిగారు.

 

తన తండ్రి నర్సింహా దొర  ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన కళావతి 2009 ఎన్నికల్లో పాలకొండ నుంచి ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం కావడంతో, ఈమె వైసీపీలోకి వచ్చేసారు. నియోజకవర్గంపై మంచి పట్టు ఉండటంతో జగన్, కళావతికి 2014 ఎన్నికల్లో పాలకొండ టిక్కెట్ ఇచ్చారు.

 

అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణపై స్వల్ప మెజారిటీతో గెలిచారు. కానీ అప్పుడు వైసీపీ అధికారంలోకి రాకపోయినా, పార్టీ కోసం, ప్రజల కోసం నిత్యం కష్టపడి పనిచేసారు. ఓ వైపు టీడీపీ ఆపరేషన్ ఆకర్ష్ చేస్తూ వరుస పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలని లాగేస్తున్నా, కళావతి మాత్రం అటువైపు చూడలేదు. కష్ట సమయంలో కూడా పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు.

 

దీంతో 2019 ఎన్నికల్లో కూడా జగన్...కళావతి టిక్కెట్ ఇచ్చారు. ఇక ఈ సారి టీడీపీ అభ్యర్థి జయకృష్ణపై 18 వేల మెజారిటీతో గెలిచారు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడం, అటు వైసీపీ అధికారంలోకి రావడంతో, కళావతి నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఇక ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో నియోజకవర్గంలో నిత్యం ఏదొక సామాజిక సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువులు అందిస్తున్నారు. వలస కూలీలని ఆదుకుంటున్నారు.

 

అయితే ఈ ఏడాది సమయంలో కళావతి అనుకున్న మేర సక్సెస్ అవ్వలేదనే తెలుస్తోంది. రాష్ట్ర స్థాయిలో పెద్దగా హైలైట్ అయిన సందర్భం ఏమి లేదు. అటు టీడీపీలో నిమ్మక జయకృష్ణ కాస్త యాక్టివ్ గానే ఉంటున్నారు. రెండుసార్లు ఓడిపోవడంతో, ఈసారి తప్పకుండా గెలవాలనే కసితో పనిచేస్తున్నారు. కాకపోతే ప్రస్తుతానికి నియోజకవర్గంలో టీడీపీ పెద్దగా పుంజుకున్న దాఖలాలు లేవు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా వైసీపీనే పైచేయి సాధించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: