పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం....టీడీపీకి కంచుకోట. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులే విజయం సాధించారు. 1983, 85, 89, 1994, 1999, 2004 ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగిరింది. ఇక 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ముదునూరి ప్రసాదరాజు టీడీపీకి చెక్ పెట్టారు. అయితే తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ వైసీపీ పెట్టడంతో ప్రసాదరాజు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళిపోయారు.  

 

ఈ క్రమంలోనే 2012లో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొత్తపల్లి సుబ్బరాయుడు, వైసీపీ నుంచి పోటీ చేసిన ప్రసాద్ రాజుని ఓడించారు. ఇక తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బండారు మాధవనాయుడు విజయం సాధించారు. అయితే ఓటమి పాలైన ప్రసాద రాజు నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

 

దీంతో 2019 ఎన్నికల్లో ప్రసాద్ రాజు 6 వేల ఓట్ల మెజారిటీతో జనసేన అభ్యర్ధి బొమ్మిడి నాయకర్‌పై విజయం సాధించారు. టీడీపీ నుంచి పోటీ చేసిన మాధవనాయుడు 27 వేల ఓట్లు తెచ్చుకుని మూడోస్థానంలో కూర్చున్నారు. ఇక రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసాద్ రాజు...తనదైన శైలిలో ప్రజలకు సేవ చేస్తూ ముందుకెళుతున్నారు. ఓ వైపు ప్రభుత్వ పథకాలని ప్రజలకు అందిస్తూనే, సాధ్యపడిన మేర అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు పార్టీని కూడా బలోపేతం చేసుకుంటూ, టీడీపీ కార్యకర్తలని తమవైపు తిప్పుకుంటున్నారు.

 

అయితే ఈ ఏడాది కాలంలో ప్రసాద్ రాజు అనుకున్నంత పేరు ఏమి తెచ్చుకోలేదు. అటు రాష్ట్ర స్థాయిలో కూడా కాస్త పార్టీ మీద వ్యతిరేకిత పెరగడంతో టీడీపీ కొంచెం పుంజుకుంది. మాధవనాయుడు కార్యకర్తలని కలుపుకుని పోతూ, ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తూ ఉంటున్నారు. ఇక్కడ జనసేన స్ట్రాంగ్ గానే ఉన్నా...నాయకులు యాక్టివ్ గా లేరు. ప్రస్తుతానికైతే వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ హవానే నడవనుంది. కాకపోతే భవిష్యత్ లో ఇక్కడ టీడీపీ-జనసేనలు కలిసి ఉంటే ప్రసాద్ రాజుకు తిప్పలు తప్పవు.  

మరింత సమాచారం తెలుసుకోండి: