2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవడానికి జగన్ ఇమేజ్ కారణమనే విషయం తెలిసిందే. అతి తక్కువ మంది మాత్రమే జగన్ ఇమేజ్‌తో పాటు, సొంత ఇమేజ్‌తో గెలిచారు. అలా గెలిచిన ఎమ్మెల్యేల్లో నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఒకరు. కోవూరుకు ఈయన ఎక్కువ సార్లు ప్రాతినిధ్యం వహించారు. తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి రాజకీయ వారసుడిగా 1993లో ఆయన మరణాంతరం ప్రసన్నకుమార్‌రెడ్డి ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.

 

1994లో జరిగిన ఎన్నికల్లోనూ టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ఎన్టీఆర్‌ కేబినెట్‌లో చక్కెర కర్మాగారాల శాఖ మంత్రిగా పనిచేశారు. 1999లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2004లో ఓడిపోయి 2009లో టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే తర్వాత వైఎస్సార్ మరణం, జగన్ వైసీపీ పెట్టడంతో, టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి అందులోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే 2012లో వచ్చిన ఉపఎన్నికలో ప్రసన్నకుమార్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్ధి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై విజయం సాధించారు.

 

అయితే 2014 ఎన్నికల్లో ప్రసన్నకు ఎదురుదెబ్బ తగిలింది. టీడీపీ అభ్యర్ధి పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ప్రసన్నపై విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికలకొచ్చేసరికి ప్రసన్న మళ్ళీ పుంజుకుని పొలంరెడ్డిపై దాదాపు 40వేల మెజారిటీతో గెలిచారు. అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రసన్న...మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ సామాజికవర్గ సమీకరణల్లో భాగంగా పదవి మిస్ అయింది. అయితే నెక్స్ట్ టర్మ్‌లో అయినా...పదవి వస్తుందనే ఉద్దేశంతో ప్రసన్న... నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు.

 

మరీ ముఖ్యంగా చంద్రబాబుని గట్టిగా టార్గెట్ చేసి, ఆయనపై ప్రతిరోజూ విమర్శల దాడి చేస్తున్నారు. జగన్ దృష్టిలో పడి మంత్రి పదవి దక్కించుకునేందుకు బాగానే కష్టపడుతున్నారు. ఇక సీనియర్ ఎమ్మెల్యే కావడంతో నియోజకవర్గంలో కొన్ని సమస్యల పరిష్కారం విషయంలో అధికారులతో కాస్త దురుసుగానే ప్రవర్తిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవల లాక్ డౌన్ నిబంధనలు ఉల్లగించారని కేసు పెడితే, పోలీస్ స్టేషన్ దగ్గరే కూర్చుని ధర్నా చేసి కాస్త హడావిడి చేశారు. అయితే ప్రజలకు అండగా ఉండటంలో ప్రసన్న ముందే ఉన్నారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించి, అర్హులైనవారికి అందేలా చేస్తున్నారు.

 

అటు టీడీపీ నేత పొలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి పెద్దగా యాక్టివ్ గా లేరు. అయితే నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి తనకు అనుకూలమైన రెండు మండలాల్లో పార్టీని బలోపేతం చేస్తున్నారు.  అయితే ఎంత చేసినా సరే...ఇక్కడ టీడీపీ నలపరెడ్డి ముందు నిలబడలేని స్థితి ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 50 శాతంపైనే స్థానాలు వైసీపీకి ఏకగ్రీవమైపోయాయి. ఇక మిగిలిన స్థానాల్లో మెజారిటీ వైసీపీ గెలవడం ఖాయం.   

మరింత సమాచారం తెలుసుకోండి: