2019 ఎన్నికల్లో ఘోర ఓటమిదెబ్బకు టీడీపీకి వీర విధేయులుగా ఉన్న నేతల సైతం వైసీపీలోకి వెళ్ళిన విషయం తెలిసిందే. టీడీపీలో ఉంటే భవిష్యత్ ఉండదని భావించడం వల్ల, ఎంతోకాలంగా టీడీపీలో ఉన్న సీనియర్ నేత బీదా మస్తాన్ రావు సైతం వైసీపీ కండువా కప్పేసుకున్నారు. అయితే బీదాకు కావలి నియోజకవర్గంపై గట్టి పట్టున్న విషయం తెలిసిందే. 2009లో టీడీపీ తరుపున కావలి ఎమ్మెల్యేగా గెలిచిన బీదా..2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయారు.

 

ఇక బాబు ఒత్తిడితో 2019 ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి, తర్వాత వైసీపీలోకి వచ్చారు. అయితే ఈయన వైసీపీలోకి రావడం వల్లే, సిట్టింగ్ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బలం మరింతగా పెరిగింది. అయితే రామిరెడ్డి 2009లో కావలి నుంచి ప్రజారాజ్యం తరుపున పోటీ చేసి ఓడిపోయి, తర్వాత వైసీపీలోకి వచ్చి, వరుసగా 2014, 2019 ఎన్నికల్లో విజయం సాధించారు.

 

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో రామిరెడ్డికి నియోజకవర్గంపై పట్టు పెరిగింది. అదేవిధంగా ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కాకపోతే ఈయన నిత్యం ఏమి ప్రజల్లో ఉండరని తెలుస్తోంది. అప్పుడప్పుడు ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో మాత్రం కనిపిస్తున్నారు. ఇదే సమయంలో బీదా మస్తాన్‌కు సోదరుడు వరుసయ్యే బీదా రవిచంద్రాయాదవ్ కావలిపై పట్టు తెచ్చుకోవడానికి చూస్తున్నారు.

 

టీడీపీ జిల్లా అధ్యక్షుడుగా ఉన్న రవి...కావలిలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు. అయితే మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి కూడా యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. కాకపోతే రవి, విష్ణులు సెపరేట్‌గా పనిచేయడం వల్ల టీడీపీ బలపడటం లేదు. ఇదే అంశం ఎమ్మెల్యే రామిరెడ్డికి కలిసొస్తుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు ఎలాగో వైసీపీకే ఫేవర్‌గా ఉంటాయి. మొత్తానికైతే టీడీపీలో గ్రూపులు, బీద మస్తాన్ వైసీపీలోకి రావడం రామిరెడ్డికి ప్లస్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: