అనంతపురం జిల్లా...తాడిపత్రి నియోజకవర్గం.. ఈ పేరు చెప్పగానే మొట్టమొదట గుర్తుచ్చే పేరు జేసీ దివాకర్ రెడ్డి. దశాబ్దాల కాలంగా తాడిపత్రిని జేసీ ఫ్యామిలీ ఏలుతూ వస్తుంది. 1985, 1989, 1994,1999, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున జేసీ దివాకర్ రెడ్డి అదిరిపోయే విజయాలు అందుకోగా, 2014 ఎన్నికలకొచ్చేసరికి జేసీ ఫ్యామిలీ టీడీపీలోకి వచ్చి, దివాకర్ అనంతపురం ఎంపీగా గెలిస్తే, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు.

 

అయితే ఇలా 1985 నుంచి 2014 వరకు తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీ హవా కొనసాగింది. కానీ 2019 ఎన్నికల్లో తొలిసారి జేసీ ఫ్యామిలీకి భారీ షాక్ తగిలింది. జగన్ హవా దెబ్బకు తాడిపత్రి బరిలో దిగిన ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి, వైసీపీ అభ్యర్ధి కేతిరెడ్డి పెద్దారెడ్డి చేతిలో 7 వేల మెజారిటీ తేడాతో ఓడిపోయారు. ఇక తొలిసారి జేసీ ఫ్యామిలీకి చెక్ పెట్టిన పెద్దారెడ్డి...ఎమ్మెల్యేగా గెలిచాక నియోజకవర్గంలోనే ప్రజలకు అందుబాటులో ఉంటూ చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ప్రభుత్వ పథకాలు అందిస్తున్నారు.

 

కాకపోతే తాడిపత్రికి జేసీ ఫ్యామిలీ చేయాల్సిందంతా చేసింది. త్రాగునీటి సమస్య లేకుండా చేసింది. రోడ్లు, డ్రైనేజ్‌లు ఇంకా నియోజకవర్గానికి కావల్సిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేసి పెట్టారు. అయితే పెద్దారెడ్డి ఇక్కడ కొత్తగా ఏమి చేయలేదట. పైగా జేసీ ఉన్నప్పుడు తాడిపత్రి మున్సిపాలిటీ చాలా బాగుంటే, ఇప్పుడు రూపురేఖలని కోల్పోయిందట. ఇక ఇక్కడ ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీల నుంచి అప్పుడు జేసీ ఫ్యామిలీకి, ఇప్పుడు పెద్దారెడ్డికి వాటాలు వస్తున్నాయట.  

 

అయితే పనితీరు విషయంలో ప్రభాకర్ రెడ్డికి నూటికి 70 మార్కులు పైనే వేయొచ్చని, కానీ పెద్దారెడ్డికి పాస్ మార్కులు కూడా రావడం కష్టమే అని నియోజకవర్గంలోని న్యూట్రల్ వ్యక్తులు చెబుతున్నారు. కాకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం వైసీపీకే మెజారిటీ స్థానాలు వస్తాయని అంటున్నారు. అధికారంలో ఉండటమే పెద్దారెడ్డికి అడ్వాంటేజ్ అవుతుందట. కానీ భవిష్యత్‌లో జేసీ ఫ్యామిలీని ఢీకొట్టాలంటే పెద్దారెడ్డి ఇంకా చాలా కష్టపడాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: