ప్రతి వర్గానికి, ప్రతి జిల్లాకు న్యాయం జరిగేలా సీఎం జగన్ ఒక్కసారిగా 25 మందితో కేబినెట్ ఏర్పాటు చేసుకుని పాలన చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేబినెట్ రెండున్నర ఏళ్ల వరకే అని, ఆ సమయానికి పనితీరు బాగోని వారిని పక్కనబెట్టి కొత్తవారికి అవకాశం కల్పిస్తానని సీఎం జగన్ ముందే చెప్పేశారు. దీంతో మంత్రులు ఏమో ఐదేళ్లు వరకు ఉండేలా కష్టపడుతుంటే, మధ్యలో తమకేమన్నా ఛాన్స్ దక్కుతుందేమో అని సీనియర్ ఎమ్మెల్యేలు కాచుకుని కూర్చున్నారు.

 

ఇక మంత్రి పదవి కోసం అనంతపురం జిల్లా నేతలు గట్టిగానే ట్రై చేస్తున్నారు. జిల్లాలో ఒక మంత్రి పదవే రావడంతో మిగతా నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. పెనుగొండకు చెందిన మాలగుండ్ల శంకర నారాయణకు జగన్ కేబినెట్‌లో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెక్స్ట్ టర్మ్ మంత్రి పదవి దక్కించుకునేందుకు ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

 

కాంగ్రెస్‌లో రాజకీయ జీవితం మొదలుపెట్టిన కాపు..2009 ఎన్నికల్లో రాయదుర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇక తర్వాత వైఎస్ మరణంతో జగన్ వెనుక నడవడానికి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్ళి, 2012 ఉపఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలిచారు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులుపై ఓడిపోయిన కాపు, 2019 ఎన్నికల్లో కాల్వపై 14 వేల మెజారిటీతో గెలిచారు.

 

పైగా వైసీపీ కూడా అధికారంలోకి రావడంతో కాపు...నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేసుకుంటున్నారు. అయితే కాపు మంత్రి పదవి కోసం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన అనుచరులైతే తమ నేతకు మంత్రి పదవి రావాలని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కూడా నిర్వహిస్తున్నారు. ఇక కాపు నియోజకవర్గంలో పేదలకు ఉచితంగా కంటి ఆపరేషన్లు చేయిస్తున్నారు. ఉచితంగా అంబులెన్స్ సర్వీసులు నడుపుతున్నారు.

 

అయితే ఈ ఏడాది కాలంలో రాయదుర్గంలో చెప్పుకోదగిన అభివృద్ధి పనులు ఏం జరగలేదు. కాకపోతే ప్రభుత్వం పరంగా జరిగే కార్యక్రమాలు మామూలుగానే జరుగుతున్నాయి. పాఠశాలల అభివృద్ధి కోసం జరిగే నాడు-నేడు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, కొత్త సచివాలయాల నిర్మాణ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇక నియోజకవర్గంలో ఎమ్మెల్యే అనుచరుల బెదిరింపులు కూడా ఎక్కువయ్యాయని తెలుస్తోంది. స్థానిక సంస్థల నామినేషన్స్ సమయంలో డైరక్ట్‌గా ఎమ్మెల్యేనే ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి అభ్యర్ధులని బెదిరించినట్లు వార్తలు వచ్చాయి.

 

అటు టీడీపీ తరుపున సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు యాక్టివ్ గానే పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటూ, ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఏడాది కాలంలో ఇక్కడ టీడీపీ బాగానే పుంజుకున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే అధికారంలో ఉండటం వైసీపీకి అడ్వాంటేజ్, స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు ఆ పార్టీకే దక్కుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: