అనంత వెంకట్రామిరెడ్డి...ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన అనంత...నాలుగుసార్లు అనంతపురం ఎంపీగా గెలిచారు. 1996, 1998, 2004, 2009ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున అనంతపురం పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యారు. అయితే తర్వాత వైఎస్ మరణం, జగన్ వైసీపీ పెట్టడంతో అటు వచ్చేశారు. ఇక 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున అనంతపురం ఎంపీగా పోటీ చేసి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

 

ఆ తర్వాత అనంతపురం వైసీపీ పార్లమెంట్ అధ్యక్షుడిగా, అనంతపురం అర్బన్ సమన్వయకర్తగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి జగన్ వ్యూహం మార్చి..వెంకట్రామిరెడ్డిని అనంతపురం అర్బన్‌ అసెంబ్లీ బరిలో దించారు. టీడీపీ నేత ప్రభాకర్ చౌదరీపై 28 వేలపైనే ఓట్లతో విజయం సాధించారు. అయితే ఎంపీగా పనిచేసిన అనుభవం ఉండటంతో, అనంత ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తున్నారు.

 

ఈ ఏడాది కాలంలోనే ఏ ఎమ్మెల్యే చేయని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తున్నారు. రూ. 80 కోట్లతో నియోజకవర్గంలో ఉన్న డ్రైనేజ్ సమస్యకు చెక్ పెట్టారు. ఇక నగరంలో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు పాతూరులోని పాత పోస్టాఫీస్ నుండి తడకలేరు వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణం చేపట్టారు.  ఇక నాడు-నేడు కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. నియోజకవర్గంలో పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నారు.

 

ఇక కాలనీల్లో కొత్తగా సిమెంట్ రోడ్ల నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు. అటు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలకు వెళుతూ అధికారులని యాక్టివ్ చేస్తూ, ప్రజలకు త్వరగా పనులయ్యేలా చేస్తున్నారు. అదేవిధంగా కరోనా నేపథ్యంలో ప్రజలకు పలు జాగ్రత్తలు చెబుతూనే.... శానిటైజర్లు, మాస్కులు అందిస్తున్నారు. లాక్ డౌన్ ఉన్న ప్రాంతాల్లో ఉచితంగా నిత్యావసర వస్తువులు ఇస్తున్నారు. ఇటు పార్టీ పరంగా కూడా కార్యక్రమాలు చేస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటున్నారు.

 

ఇక ఇక్కడ టీడీపీ నేత ప్రభాకర్ చౌదరీ కూడా యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. నిత్యం ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్నారు. అధినేత పిలుపునిచ్చే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. కార్యకర్తలని కలుపుకుని పోతూ...పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. కాకపోతే అనంత మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుండటంతో ప్రభాకర్‌కు పుంజుకునే అవకాశం దక్కడం లేదు. ప్రస్తుతానికైతే ఇక్కడ వైసీపీ మంచి బలంగా కనిపిస్తోంది. కాబట్టి అనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీకే గెలుపు అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: