అనంతపురం జిల్లాలో జగన్ గాలిలో భారీ మెజారిటీతో గెలిచిన ఎమ్మెల్యేల్లో గుంతకల్లు ఎమ్మెల్యే యల్లారెడ్డి వెంకటరామిరెడ్డి ఒకరు. దాదాపు 48 వేల పైనే మెజారిటీతో టీడీపీ అభ్యర్ధి జితేంద్ర గౌడ్‌ని ఓడించారు. అయితే వెంకటరామిరెడ్డి 2014 ఎన్నికల్లో మాత్రం 5 వేల మెజారిటీ తేడాతో జితేంద్ర చేతిలో ఓడిపోయారు. ఆ ఓటమికి 2019 ఎన్నికల్లో ప్రతీకారం తీర్చుకుని తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

 

అయితే తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంకటరామిరెడ్డి...గుంతకల్లు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. కాకపోతే సొంత పార్టీ నేతలు, కార్యకర్తల సమస్యలే పరిష్కారం అవుతున్నాయి. జగన్ పార్టీలకు అతీతంగా పథకాలు అందాలని చెప్పినా, గుంతకల్లులో మాత్రం సొంత పార్టీ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అటు వాలంటీర్లుని ఎలాగో సొంత పార్టీ కార్యకర్తలని నియమించేశారు.

 

ఇక టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి...ఇప్పుడు జరగడం లేదని తెలుస్తోంది. ఈ ఏడాది కాలంలో గుంతకల్లులో పెద్దగా వచ్చిన మార్పు ఏమి లేదట. కాకపోతే కరోనా సమయంలో ఎమ్మెల్యే బాగా పనిచేశారని, పేదలకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్నారట. ఇటు గుంతకల్లులో ఇసుక కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా పేదలకు ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ విషయంలో పలు అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

 

పైగా గత టీడీపీ ప్రభుత్వం కొందరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్ళు కట్టించింది. అయితే ఎన్నికల సమయంలో కొందరి ఇళ్ళు పెండింగ్‌లో పడిపోయాయి. కానీ ఇప్పుడు వాటిని పడగొట్టేసి, ఆ స్థలాలని తీసుకుని, మళ్ళీ ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళకు ఇస్తున్నారని అంటున్నారు. ఇదంతా ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వెంకటరామిరెడ్డి గుంతకల్లు మొత్తానికి ఎమ్మెల్యే కాదని, కేవలం వైసీపీ నేతలకు, కార్యకర్తలకు మాత్రమే ఎమ్మెల్యే అని తెలుగు తమ్ముళ్ళు మండిపడుతున్నారు.

 

ఇక ఇక్కడ టీడీపీని జితేంద్ర గౌడ్ నడిపిస్తున్నారు. అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాలు చేస్తూ కార్యకర్తలని కలుసుకుంటున్నారు. అయితే వైసీపీ మీద నెగిటివ్ ఉన్న దాన్ని ఉపయోగించుకుని, పుంజుకోలేని స్థాయిలో జితేంద్ర ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే గుంతకల్లులో లోకల్ బాడీ ఎలక్షన్స్ వైసీపీకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: