2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున చాలామంది కొత్త నేతలు పోటీలో దిగి జగన్ ఇమేజ్‌తో సూపర్ విక్టరీ అందుకున్న విషయం తెలిసిందే.  అలా అదిరిపోయే విజయం అందుకున్న నేతల్లో ఉషాశ్రీ చరణ్ కూడా ఒకరు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి తొలిసారి బరిలో దిగిన ఉషాశ్రీ చరణ్...టీడీపీ అభ్యర్ధి ఉమామహేశ్వర నాయుడుపై దాదాపు 20 వేల మెజారిటీతో విజయం సాధించారు. రాజకీయాల్లో పెద్ద ఫాలోయింగ్ లేని ఉషాశ్రీ కేవలం...జగన్ ఇమేజ్‌తోనే గెలిచారు.

 

అయితే ఎమ్మెల్యేగా గెలిచాక మాత్రం ఉషాశ్రీ జగన్ ఇమేజ్‌ని నిలబెడుతున్నట్లే కనిపిస్తోంది. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఏ మాత్రం అనుభవం లేకపోయినా సరే, నియోజకవర్గంపై అవగాహన పెంచుకుంటూ, సమస్యలు తెలుసుకుంటూ ముందుకెళుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం సక్రమంగా అమలయ్యేలా చేస్తున్నారు.

 

లాక్ డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందించి ఆదుకున్నారు. అటు నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యలకు చెక్ పెడుతున్నారు. అలాగే రైతులకు సకాలంలో విత్తనాలు సరఫరా చేయడం, ఉచితంగా ఎడ్లబండ్లు, స్పేయర్‌లు, టార్బాల్‌లు పంపిణీ చేశారు. ఇక ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి కోసం ఏర్పాటు చేసిన నాడు-నేడు కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నారు.

 

కాకపోతే ఈ ఏడాది కాలంలో నియోజకవర్గంలో పెద్దగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు.  ఇటు పార్టీ పరంగా కూడా కార్యక్రమాలు చేస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. ఇక టీడీపీ తరుపున ఉమామహేశ్వర నాయుడు యాక్టివ్‌గానే ఉన్నారు. నిరంతరం ప్రజల్లో ఉంటూ, సమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఎలాగో కళ్యాణదుర్గం టీడీపీకి కంచుకోట కాబట్టి, ఇక్కడ ఉమామహేశ్వర నాయుడుకు త్వరగానే పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఉషాశ్రీ నియోజకవర్గంపై ఫుల్ గ్రిప్ తెచ్చుకుంటే టీడీపీకి విజయావకాశాలు కష్టమవుతాయి. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలాగో వైసీపీకే అనుకూలంగా ఉండనున్నాయి. ఆ పార్టీ బలంగా ఉండటం, జగన్ సంక్షేమ పథకాలు ప్రభావంతో మెజారిటీ సీట్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: