అధికార వైసీపీలో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో కర్నూలు జిల్లా ముందు వరుసలో ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ ఏదొక నియోజకవర్గంలో నేతల మధ్య ఆధిపత్య పోరు జరుగుతూనే ఉంది. జిల్లాలో చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్తితి ఉంది. ఇక ఈ ఆధిపత్య పోరుకు కర్నూలు సిటీ నియోజకవర్గం ఏమి అతీతంగా లేదు.

 

ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్‌కు, వైసీపీ నేత ఎస్‌వి మోహన్ రెడ్డిలకు అసలు పడటం లేదు.  2014 ఎన్నికల్లో ఎస్‌వి మోహన్...వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్ళిపోయి, మళ్ళీ 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి తిరిగొచ్చారు. అయితే అప్పటికే జగన్...హఫీజ్ ఖాన్‌కు టిక్కెట్ కేటాయించేశారు. ఇక ఆ ఎన్నికల్లో హఫీజ్..టీడీపీ నేత టి‌జి భరత్‌పై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

 

ఇటు ఎమ్మెల్యేగా హఫీజ్ నియోజకవర్గంలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ పనిచేసుకుంటుంటే...అటు ఎస్‌వి మోహన్ రెడ్డి కూడా సెపరేట్‌గా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. తనకు నచ్చిన విధంగా వేరే పార్టీ కార్యకర్తలకు వైసీపీ కండువా కప్పుకుంటూ వచ్చారు. దీంతో తన నియోజకవర్గంలో ఎస్‌వి పెత్తనం ఏంటి అన్నట్లు హఫీజ్ బహిరంగంగానే విమర్సలు చేశారు.

 

అలాగే ఎస్‌వి కూడా హఫీజ్‌కు కౌంటర్లు ఇచ్చారు. అయితే వీరి పోరు ముదిరిపోవడంతో వైసీపీ పెద్దలు ఇద్దరు నేతలకు కాస్త సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ మధ్య వీరి ఆధిపత్య పోరు అంతగా బయటపడటం లేదు. అయితే ఎమ్మెల్యేగా హఫీజ్ ఖాన్ మంచి పనితీరే కనబరుస్తున్నారు. నిత్యం ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడకముందు, కర్నూలు కార్పొరేషన్‌ని ఎలాగైనా వైసీపీ సొంతం చేయాలని, వార్డు వార్డు తిరిగారు.

 

లాక్ డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు అండగా నిలిచారు. అయితే సంవత్సర కాలంలో కర్నూలులో అనుకున్న అభివృద్ధి ఏమి జరగలేదు. ఇదే సమయంలో టీడీపీ నేత టి‌జి భరత్ కూడా ఇక్కడ యాక్టివ్‌గానే ఉన్నారు. పార్టీని బలోపేతం చేసుకుంటూ, ముందుకెళుతున్నారు. అయితే భరత్ ఏమో టీడీపీలో ఉండటం, ఆయన తండ్రి టి‌జి వెంకటేష్ బీజేపీలో ఉండటం కాస్త మైనస్ అవుతుంది. కాకపోతే నెక్స్ట్ ఎన్నికల సమయానికి టి‌జి వెంకటేష్ మళ్ళీ టీడీపీలోకి వచ్చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

 

ఇక అటు నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీ టిక్కెట్ హఫీజ్‌కు దక్కుతుందో లేదో డౌట్‌గానే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న రెడ్డి సామాజికవర్గం ఎక్కువగా ఎస్‌వి మోహన్ రెడ్డికే సపోర్ట్ ఇస్తున్నారు. అలాగే మైనారిటీ వర్గాలు హఫీజ్ వైపు ఉన్నారు. కానీ జగన్ ఎవరి వైపు ఉంటే వారికే టిక్కెట్ దక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: