కర్నూలు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు ఎవరైనా ఉన్నారంటే అది మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తినే. దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీలో చక్రం తిప్పిన కేఈ 2014లో పత్తికొండ నుంచి గెలిచి చంద్రబాబు ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి కేఈ పోటీ నుంచి తప్పుకుని, తనయుడు కేఈ శ్యామ్ కుమార్‌ని బరిలో నిలిపారు.

 

కానీ ఊహించని విధంగా తొలిసారి ఎన్నికల బరిలో దిగిన కంగాటి శ్రీదేవి 42 వేల మెజారిటీతో శ్యామ్‌పై విజయం సాధించారు. అయితే శ్రీదేవి భర్త నారాయణరెడ్డి గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా 31 వేల ఓట్లు సాధించి సత్తా చాటారు. తర్వాత ఆయన వైసీపీలోకి చేరి కేఈ కుటుంబానికి బలమైన ప్రత్యర్థిగా ఎదిగారు. ఆయనే ఈ ఎన్నికల్లో పోటీ చేయాల్సి ఉంది. కానీ, ఆయనను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. దీంతో అనుహ్యాంగా ఆయన భార్య శ్రీదేవి తెరపైకి వచ్చారు. అప్పటి నుంచి కేఈ ఫ్యామిలీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా పనిచేసుకుంటూ వచ్చిన శ్రీదేవికి 2019 ఎన్నికల్లో సానుభూతితో పాటు జగన్ గాలి కూడా కలిసి రావడంతో, సూపర్ విక్టరీ కొట్టింది.

 

ఇక ఎమ్మెల్యేగా గెలిచాక శ్రీదేవి పర్వాలేదనిపించేలా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే పదవికి కొత్త కావడంతో నియోజకవర్గంపై పూర్తి పట్టు అయితే దొరకలేదు.  కాకపోతే ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడంలో ముందున్నారు. నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలు తెలుసుకుని, అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అలాగే ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సాయం అందిస్తున్నారు.

 

లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు కూడా తనవంతు సాయం చేస్తున్నారు. నియోజకవర్గంలో అక్కడక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. మద్దికెర మండలంలో 11 కోట్లతో తాగునీటి సమస్యకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.  ఇక ఇక్కడ టీడీపీని కేఈ ఫ్యామిలీ నడిపిస్తుంది. కృష్ణమూర్తి ఎలాగో రిటైర్ అయిపోయే స్టేజ్‌కి వచ్చారు కాబట్టి, నియోజకవర్గ బాధ్యతలు శ్యామ్ చూసుకుంటున్నారు.

 

కాకపోతే ఓడిపోయాక శ్యామ్ పెద్దగా యాక్టివ్‌గా లేరు. దీంతో పత్తికొండ టీడీపీ కేడర్ వైసీపీలోకి వెళ్లిపోతుంది. ఇక కేఈ కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో తనయుడుతో పాటు కృష్ణమూర్తి కూడా పార్టీ మారిపోతారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కేఈ ఫ్యామిలీ గనుక టీడీపీని వీడితే కర్నూలులో ఆ పార్టీకి దిక్కులేకుండా పోతుంది. అలా అని వారు టీడీపీలో ఉన్నా...ఇప్పటిలో పత్తికొండలో గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. ప్రస్తుతానికైతే పత్తికొండలో శ్రీదేవి ఆధిపత్యం నడుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: