కర్నూలు జిల్లా అంటే వైసీపీకి కంచుకోటగా మారిపోయిన విషయం తెలిసిందే. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా కర్నూలు జిల్లాలో మెజారిటీ స్థానాలు వైసీపీ ఖాతాలోనే పడ్డాయి. జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉంటే 11 వైసీపీనే గెలిచింది. 3 సీట్లు టీడీపీ గెలుచుకుంది. ఇక 2019 ఎన్నికల్లో జగన్ వేవ్‌లో మొత్తం సీట్లు వైసీపీనే గెలిచింది.

 

అయితే 2014, 2019 ఎన్నికల్లో మంత్రాలయం నియోజకవర్గంలో వైసీపీ జెండా తిరుగులేకుండా ఎగిరింది. వైసీపీ తరుపున బాలనాగిరెడ్డి రెండుసార్లు విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో కూడా నాగిరెడ్డి, టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. నెక్స్ట్ వైసీపీకి వచ్చి వరుసగా గెలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా నిలిచిన బాలనాగిరెడ్డి నియోజకవర్గంలో దూకుడుగా పనిచేస్తున్నారు.

 

ప్రజలకు నిత్యం అందుబాటులోనే ఉంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు ఎలాంటి లోటు లేకుండా అందుతున్నాయి. ఇక రాఘవేంద్రస్వామి కొలువై ఉన్న మంత్రాలయాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారు. అయితే నియోజకవర్గంలో సాగు, తాగునీటి సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనార్థం దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికుల సౌకర్యార్థం, జిల్లా అంతర్గత వాణిజ్య– వ్యాపార రంగాల అభివృద్ధి కోసం మంత్రాలయం–కర్నూలు రైల్వే లైన్‌ అవసరం చాలా ఉంది. ఈ రైల్వే లైన్‌కు 50 ఏళ్ల నుంచి మోక్షం కలగడం లేదు.

 

ఇక పార్టీ పరంగా చూసుకుంటే ఇక్కడ వైసీపీ పూర్తి బలంగా ఉంది. టీడీపీ తరుపున తిక్కారెడ్డి పనిచేస్తున్నారు. ఆయన ఎన్నికల్లో ఓడిన దగ్గర నుంచి యాక్టివ్ గానే ఉన్నారు. కాకపోతే ఇక్కడ బాలనాగిరెడ్డి బలంగా ఉండటం వల్ల, తిక్కారెడ్డి పుంజుకోలేదు. ఇక ఈ నాలుగేళ్లలో బాలనాగిరెడ్డి బలం ఏమన్నా తగ్గితే, తిక్కారెడ్డికి ఏదైనా ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ వైసీపీ జెండా బలం పాతుకుపోయినట్లే కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: