ప్రపంచాన్ని చుట్టేసిన కరోనా రాజకీయ నాయకులని కూడా వణికిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు నేతలకు కరోనా వచ్చింది. ఈ క్రమంలోనే కర్నూలు జిల్లా కోడుమూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్‌కు కూడా కరోనా  పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్‌లోనే ఉంటున్నారు. అయితే నిరంతరం ప్రజల మధ్యలో తిరుగుతుండటంతోనే కరోనా ఎటాక్ అయినట్లు తెలుస్తోంది.

 

ఇక సుధాకర్...కోడుమూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఊహించని విధంగా టీడీపీ అభ్యర్ధి బూర్ల రామాంజనేయులపై 36 వేల మెజారిటీతో గెలిచారు. అయితే కేవలం జగన్ గాలిలోనే సుధాకర్‌కు ఇంత మెజారిటీ వచ్చింది. ఎమ్మెల్యేగా గెలిచాక సుధాకర్ పర్వాలేదనిపించేలా పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులోనే ఉంటున్నారు. కాకపోతే ఇక్కడ ప్రభుత్వ పథకాలు తప్ప, కొత్తగా ఏ కార్యక్రమం జరగట్లేదు.

 

పెద్దగా అభివృద్ధి ఏం జరగడం లేదు. తాగునీరు, సాగు నీరు సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి.  అసలు డాక్టర్ సుధాకర్‌కు రాష్ట్ర స్థాయిలో పెద్ద గుర్తింపు రాలేదు. అయితే ఆయనకు కరోనా రావడంతోనే వార్తల్లో పడ్డారు. అప్పటివరకు సుధాకర్ ఎమ్మెల్యే అని రాష్ట్ర జనాలకు పెద్దగా తెలియదనే చెప్పాలి. ఇక ఇక్కడ టీడీపీకి పెద్ద స్కోప్ లేదు. ఎన్నికల్లో ఓడిపోయిన రామాంజనేయులు అడ్రెస్ లేరు. దీంతో కోడుమూరులో టీడీపీకి దిక్కు లేకుండా పోయింది.  

 

అయితే 2014 ఎన్నికల్లో కోడుమూరు నుంచి వైఎస్సార్‌సీపీ తరుపున గెలిచిన మణిగాంధీ, తర్వాత టీడీపీలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వచ్చేశారు. కానీ అప్పటికే సుధాకర్‌కు టిక్కెట్ ఖాయం కావడంతో, ఆయన విజయం కోసం మణిగాంధీ కృషి చేశారు. ఇక ఎమ్మెల్యేగా సుధాకర్ అంత మంచి పనితీరు కనబర్చకపోవడంతో నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ వైఎస్సార్‌సీపీ టిక్కెట్ మణిగాంధీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి వచ్చే నాలుగేళ్లలో కోడుమూరు రాజకీయాలు ఎలాంటి మలుపు తిరుగుతాయో?

మరింత సమాచారం తెలుసుకోండి: